సొంత గూడుపై టెన్షన్‌

ABN , First Publish Date - 2020-07-11T10:05:37+05:30 IST

తాము అధికారంలోకి వస్తే పేదలందరికీ ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తామని గత ఏడాది ఎన్నికల ప్రచార సమయంలో అప్పటి ప్రతిపక్ష

సొంత గూడుపై టెన్షన్‌

గత ప్రభుత్వంలో ఎంపిక చేసిన ‘టిడ్కో’ లబ్ధిదారుల జాబితాలు వడపోత

అనర్హుల పేరిట పలువురి పేర్లు తొలగింపు

పరిశీలన పేరుతో ‘ఇంటి’కి దూరం చేస్తున్నారని పేదల ఆవేదన

ఏడాది దాటినా పునఃప్రారంభంకాని ఇళ్ల నిర్మాణ పనులు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): తాము అధికారంలోకి వస్తే పేదలందరికీ ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తామని గత ఏడాది ఎన్నికల ప్రచార సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఎన్నికల్లో వైసీపీ గెలుపొంది, ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఇది జరిగి 13 నెలలు దాటింది. పేదలకు ఇంతవరకు ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదు. పైగా అంతకుముందున్న ప్రభుత్వం.... పట్టణ ప్రాంతాల్లో పేదల కోసం నిర్మించిన టిడ్కో ఇళ్లను ఇంతవరకు లబ్ధిదారులకు అందజేయలేదు. నిర్మాణ పనులను సైతం నిలుపుదల చేయించారు. పేదలకు సొంతింటి కలను సాకారం కాకుండా చేశారు.


అంతేకాక టిడ్కో ఇళ్లకు కొత్తగా అర్హుల జాబితాలను తయారు చేస్తామంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు, అధికారులు ప్రకటనలు చేస్తుండడం లబ్ధిదారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది. తాజాగా ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్‌ శ్రీధర్‌ గురువారం గాజువాక ప్రాంతంలోని టిడ్కో ఇళ్లను పరిశీలించి, ఆరు నెలల్లో పనులు పూర్తి చేసి, వాటా ధనం చెల్లించిన దరఖాస్తుదారుల్లో అర్హులకు ఇళ్లను కేటాయిస్తామని చెప్పారు. దీంతో అనర్హుల పేరిట తమకు ఇళ్లు దక్కకుండా చేస్తారేమోనని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహా విశాఖ నగరపాలక సంస్థ(జీవీఎంసీ), నర్సీపట్నం, ఎలమంచిలి మునిసిపాలిటీల పరిధిలో హౌసింగ్‌ లబ్ధిదారులు, టిడ్కో ఇళ్ల స్థితిగతులపై ‘ఆంధ్రజ్యోతి’ గ్రౌండ్‌ రిపోర్ట్‌...


గాజువాక నియోజకవర్గంలో....

గాజువాక నియోజకవర్గంలో పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం గత ప్రభుత్వం భానోజీతోటలో 30 ఎకరాలు, దయాళ్‌నగర్‌లో 10 ఎకరాలు, తలారివానిపాలెంలో 25 ఎకరాలు సేకరించింది. సుమారు రెండేళ్ల క్రితం ఇళ్ల నిర్మాణ పనులు మొదలయ్యాయి. గత ఏడాది మే నెలలో ప్రభుత్వం మారడంతో ఇళ్ల పనులు ఆగిపోయాయి. ఆ సమయానికి భానోజీతోటలో 3,000 ఇళ్లు 70 శాతం, దయాళ్‌నగర్‌లో వెయ్యి ఇళ్లు 50 శాతం, తలారివానిపాలెంలో 2,500 ఇళ్లు 40 శాతం వరకు పూర్తయ్యాయి. 


పెందుర్తి నియోజకవర్గంలో....

పరవాడలో 512 గృహాల నిర్మాణం చేపట్టారు. గత ఏడాది మే నెలలో పనులు ఆపేశారు. అప్పటికి అన్ని బ్లాకుల శ్లాబ్‌ పనులు పూర్తయ్యాయి. కొన్నింటికి ప్లాస్టరింగ్‌ చేసి రంగులు కూడా వేశారు.  జీవీఎంసీ 85వ వార్డు పరిధిలోని మంత్రిపాలెంలో ఏడు బ్లాకుల్లో 336 ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టారు. ఒక్క బ్లాకు పూర్తయ్యింది. మిగిలిన ఆరు బ్లాకులు పునాదుల దశలో ఆగిపోయాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు వీటిని రద్దు చేసి రీటెండరింగ్‌కు వెళ్లారు. జీవీఎంసీ ఆరో జోన్‌లోని చీమలాపల్లిలో 2,688 గృహాలకుగాను మొదటి దశలో 1,008 గృహాల నిర్మాణం పూర్తయ్యింది. మరో 4 బ్లాకులు శ్లాబ్‌ దశకు చేరుకున్నాయి. రెండో దశలో 1,600 గృహ నిర్మాణాలు బేస్‌మెంట్‌ దశలో ఉన్నాయి. పెందుర్తిలో 448 గృహాలకుగాను 288 గృహాలు ముగింపు దశలో, మిగిలినవి పునాదులు, శ్లాబ్‌లలో ఉన్నాయి. చినముషిడివాడలో 98 ఇళ్ల శ్లాబ్‌లు పూర్తయ్యాయి.


అనకాపల్లిలో....

పట్టణ పేదల కోసం రూ.120 కోట్ల అంచనా వ్యయంతో సత్యనారాయణపురంలో 2,520, కొప్పాకలో 506, సిరసపల్లిలో 432 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. సత్యనారాయణపురంలో నిర్మాణ పనులు పూర్తికావడంతో గత ఎన్నికలకు ముందు డ్రా పద్ధతిలో లబ్ధిదారులకు కేటాయించారు. వీరి పేరున కరెంటు మీటర్లు కూడా వచ్చాయి. కొప్పాక, సిరసపల్లిల్లో నిర్మాణ పనులు 60 శాతం మేర అయ్యాయి. 


నర్సీపట్నంలో...

మునిసిపాలిటీలోని పేదల కోసం గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం చేపట్టింది. 1,824 ఇళ్ల నిర్మాణ పనులు 70 శాతం నుంచి 90 శాతంవరకు అయ్యాయి. 624 ఇళ్లు పునాదుల స్థాయిలోనే వుండడంతో అధికారులు వాటిని రద్దు చేశారు. పాత లబ్ధిదారుల్లో 134 మందిని అనర్హులుగా గుర్తించారు. అర్హులైన వారిలో 1,824 మందికి టిడ్కో ఇళ్లు కేటాయించి, మిగిలిన వారికి స్థలాలు మంజూరు చేస్తామని అధికారులు చెబుతున్నారు.


ఎలమంచిలిలో....

పట్టణంలోని రామ్‌నగర్‌ సమీపంలో టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. గత ప్రభుత్వం 608 మంది లబ్ధిదారులను ఎంపిక చేసింది. ప్రభుత్వం మారిన తరువాత అధికారులు మరోసారి సర్వే చేసి వీరిలో 96 మందిని అనర్హులుగా తేల్చారు. 168 ఇళ్ల పనులు దాదాపు పూర్తయ్యాయి. మరో 360 ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఆగిపోయాయి. 


ఆందోళన చెందొద్దు: తిప్పల నాగిరెడ్డి, ఎమ్మెల్యే గాజువాక

టిడ్కో గృహాల కోసం డీడీలు చెల్లించిన వారు ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. డబ్బులు చెల్లించి పేర్లు నమోదు చేయించుకున్నవారందరికీ ఇళ్ల నిర్మాణాలు పూర్తయిన వెంటనే పారదర్శకంగా కేటాయింపులు జరుగుతాయి. 


 సత్వరమే పనులు పూర్తి చేయాలి: పల్లా శ్రీనివాసరావు, గాజువాక మాజీ ఎమ్మెల్యే

మా ప్రభుత్వ హయాంలో చేపట్టిన టిడ్కో ఇళ్ల నిర్మాణాలు చాలా వరకు పూర్తయ్యాయి. ప్రస్తుత ప్రభుత్వం మిగిలిన పనులను సత్వరమే పూర్తిచేసి, లబ్ధిదారులకు అందజేయాలి. ఎప్పటిలోగా పనులు పూర్తిచేస్తారో అధికారులు ప్రకటించాలి. లేకపోతే లబ్ధిదారులతో కలిసి ఆందోళనకు దిగుతాం. 


బండారు సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే, పెందుర్తి

టిడ్కో ఇళ్ల పనులను 15 నెలల నుంచి పనులు ఆపేయడం సరికాదు. చాలా ఇళ్లు 90 శాతం వరకు పూర్తయ్యాయి. జగన్‌ పాదయాత్రలో భాగంగా నర్సీపట్నం వచ్చినప్పుడు టిడ్కో ఇళ్లను ఉచితంగా ఇస్తానని హామీ ఇచ్చారు. ఇళ్ల పనులను సత్వరమే పూర్తిచేయించి లబ్ధిదారులకు అందజేయాలి.


సొంతింటి కల నెరవేరదా?: షేక్‌ షిలార్‌ బీబీ, సిరసపల్లి, అనకాపల్లి

టీడీపీ ప్రభుత్వం నాకు సింగిల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు మంజూరు చేసింది. తరువాత కొద్దికాలానికి ప్రభుత్వం మారిపోయింది. అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం... ఇళ్ల పనులు పూర్తిచేసి అప్పగిస్తుందని ఆశించాను. 15 నెలలు కావస్తున్నప్పటికీ భవన నిర్మాణాలు పూర్తి కాలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మా సొంతింటి కలను నెరవేరుస్తుందని ఆశిస్తున్నాను.

Updated Date - 2020-07-11T10:05:37+05:30 IST