Advertisement
Advertisement
Abn logo
Advertisement

సర్పంచ్‌ చొరవతో అక్రమ నిర్మాణాల తొలగింపు

 నందిగామ: మండల పరిధిలోని మేకగూడ శివారులో కబ్జాకు గురైన తుంగకుంట చెరువు స్థలంపై అధికారులు చర్యలు చేపట్టారు. చెరువు స్థలాన్ని ఆక్రమించుకుని చుట్టూ ఏర్పాటు చేసిన సిమెంట్‌ ఫెన్సింగ్‌(గోడ)ను బుధవారం కబ్జాదారులు స్వచ్ఛందంగా తొలగించారు.  కాగా, చెరువు స్థలం కబ్జాకు గురైందని సర్పంచ్‌ పాండురంగారెడ్డి పలుమార్లు రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. సర్వేనంబర్‌ 886లో చెరువు విస్తీర్ణం 9ఎకరాల 27గుంటలు కాగా, ప్రస్తుతం 3 ఎకరాలు కూడా లేదని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. గ్రామ శివారులోని న్యాట్కో పరిశ్రమ వారు తుంగకుంట పక్కన ఉన్న సర్వే నంబరులో భూమి కొనుగోలు చేసి దానితో పాటు చెరువు శిఖం పొలాన్ని సైతం కబ్జాచేసి ప్రహరీ నిర్మాణం చేశారని సర్పంచ్‌ ఆరోపించారు. అయితే, సమాచార హక్కు చట్టం ప్రకారం సంబంధిత అధికారులకు చేసిన ఫిర్యాదుపై.. తీసుకున్న చర్యల గురించి దరఖాస్తు చేసుకున్నానని సర్పంచ్‌ తెలిపారు. దీనికి స్పందించిన అధికారులు ముందస్తుగా సంబంధిత పరిశ్రమ నిర్వాహకులకు సమాచారం ఇవ్వడంతో వారు స్వచ్ఛందంగా చెరువులో నిర్మించిన ప్రహరీ నిర్మాణాన్ని తొలగిస్తున్నారని తెలిపారు. 

Advertisement
Advertisement