‘పేట’లో అక్రమ నిర్మాణాలపై కొరడా

ABN , First Publish Date - 2022-01-21T05:25:56+05:30 IST

నరసన్నపేట పట్టణ ప్రధాన రహదారిలో అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. గత రెండు రోజులుగా స్థానిక లక్ష్మీ థియేటర్‌ సమీపంలో రోడ్డు పోరంబోకు స్థలంలోగల 16 షాపుల తొలగింపునకు రెవెన్యూ అధికారులు శ్రీకారం చుట్టారు. దీంతో మిగతా ఆక్రమణదారుల్లో అలజడి రేగుతుంది.

‘పేట’లో అక్రమ నిర్మాణాలపై కొరడా
లక్ష్మీ థియేటర్‌ వద్ద తొలగిస్తున్న అక్రమ నిర్మాణాలు

- లోకాయుక్త ఆదేశాల మేరకు ఆక్రమణల తొలగింపు 

- మారుతీనగర్‌, ఆర్టీసీ కాంప్లెక్స్‌, కళాశాల రోడ్డు షాపుల పరిస్థితిపై ఆందోళన 

నరసన్నపేట, జనవరి 20: నరసన్నపేట పట్టణ ప్రధాన రహదారిలో అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. గత రెండు రోజులుగా స్థానిక లక్ష్మీ థియేటర్‌ సమీపంలో రోడ్డు పోరంబోకు స్థలంలోగల 16 షాపుల తొలగింపునకు రెవెన్యూ అధికారులు శ్రీకారం చుట్టారు. దీంతో మిగతా ఆక్రమణదారుల్లో అలజడి రేగుతుంది. మారుతీనగర్‌ జంక్షన్‌కు ఆనుకుని దుంపల కామయ్య బంకు వరకు గల షాపులతో పాటు, ఎల్‌ఐసీ కార్యాలయానికి ఎదురుగా ఉన్న షాపులు, కళాశాల రోడ్డు, లక్ష్మీ థియేటర్‌కు ఎదురుగా ఉన్న షాపులు, బర్మాకాలనీకి ముందున్న షాపులు కూడా రోడ్డు పోరంబోకు స్థలంలోనే నిర్మించారు. వీరు కొన్ని దశాబ్దాలుగా షాపులు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం తొలగిస్తున్న షాపులు ప్రతిపక్ష పార్టీకి మద్దతుదారులైన ఒకే కుటుంబానికి చెందినవి కావడంతో అధికారులు వేగంగా తొలగింపులు చేపడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. బర్మా కాలనీలో పేదలు ఇళ్లు నిర్మించారని, పేదల చాటున అక్కడ కూడా కొందరు పెద్దలు షాపింగ్‌ కాంప్లెక్స్‌లు నిర్మించడంతో వాటిని ప్రభుత్వ ధరకు క్రమబద్ధీకరిస్తామని ఆర్డీవో కిషోర్‌ బర్మా కాలనీలో చెప్పడం వెనుక రహస్యం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అక్రమ నిర్మాణాలు తొలగించడంతో  నిర్మాణదారులు ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించి స్టే తెచ్చుకునేందుకు పరుగులు పెడుతున్నారు. చిన్న, మధ్య తరగతి వర్గాలకు చెందిన వ్యాపారులు షాపులు తొలగిస్తారని, తమ జీవితాలు రోడ్డున పడతాయని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై తహసీల్దార్‌ ప్రవల్లికా ప్రియ మాట్లాడుతూ లోకాయుక్త ఆదేశాల మేరకు అక్రమ నిర్మాణదారులకు నోటీసులు జారీ చేశామని, మారుతీనగర్‌ జంక్షన్‌ వద్ద షాపు యాజమానులకు కూడా  నోటీసులు ఇచ్చామన్నారు. ఆక్రమణలు తొలగించడంలో ఎటువంటి తారతమ్యం ఉండదని స్పష్టం చేశారు. 

Updated Date - 2022-01-21T05:25:56+05:30 IST