నౌపడలో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2022-09-25T05:08:08+05:30 IST

టెక్కలి మండలం నౌపడ రైల్వేస్టేషన్‌ సమీపంలో శనివారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. రైల్వేశాఖకు చెందిన స్థలాల్లో అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు వాల్తేర్‌ డివిజన్‌ సీనియర్‌ సెక్షన్‌ ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు చర్యలు చేపట్టారు. సర్వేనెంబర్‌ 40లో సుమారు 35సెంట్లలో 34 అక్రమ నిర్మాణాలను తొలగించాలని రైల్వేశాఖ అధికారులు కొన్నాళ్ల కిందట ఆక్రమణదారులకు నోటీసులు అందజేశారు. దీంతో నిర్మాణదారులు కోర్టును ఆశ్రయించగా.. రైల్వేశాఖకు అనుకూలంగా తీర్చు వచ్చింది. తాజాగా మూడురోజుల కిందట రైల్వేశాఖ సీనియర్‌ సెక్షన్‌ ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నేపఽథ్యంలో శనివారం ఆక్రమణలను తొలగించేందుకు రైల్వే అధికారులు సన్నద్ధమయ్యారు.

నౌపడలో ఉద్రిక్తత
అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్న అధికారులు.. అడ్డుకుంటున్న స్థానికులు

రైల్వేశాఖ స్థలాల్లో ఆక్రమణల తొలగింపునకు చర్యలు
నిర్మాణదారులు, పోలీసు బలగాల మధ్య తోపులాట
భారీగా మోహరించిన ఆర్‌పీఎఫ్‌ బలగాలు
(టెక్కలి/ టెక్కలి రూరల్‌, సెప్టెంబరు 24)

టెక్కలి మండలం నౌపడ రైల్వేస్టేషన్‌ సమీపంలో శనివారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. రైల్వేశాఖకు చెందిన స్థలాల్లో అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు వాల్తేర్‌ డివిజన్‌ సీనియర్‌ సెక్షన్‌ ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు చర్యలు చేపట్టారు. సర్వేనెంబర్‌ 40లో సుమారు 35సెంట్లలో 34 అక్రమ నిర్మాణాలను తొలగించాలని రైల్వేశాఖ అధికారులు కొన్నాళ్ల కిందట ఆక్రమణదారులకు నోటీసులు అందజేశారు. దీంతో నిర్మాణదారులు కోర్టును ఆశ్రయించగా.. రైల్వేశాఖకు అనుకూలంగా తీర్చు వచ్చింది. తాజాగా మూడురోజుల కిందట రైల్వేశాఖ సీనియర్‌ సెక్షన్‌ ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నేపఽథ్యంలో శనివారం ఆక్రమణలను తొలగించేందుకు రైల్వే అధికారులు సన్నద్ధమయ్యారు. ఓ వైపు ఆర్‌పీఎఫ్‌ కమాండెంట్‌ మనోజ్‌కుమార్‌ పర్యవేక్షణలో బలగాలు చేరుకున్నాయి. మరోవైపు టెక్కలి సీఐ సూర్యచంద్రమౌళి పోలీసు సిబ్బంది సహాయంతో.. రెవెన్యూ అధికారుల సమక్షంలో భారీ ప్రొక్లెయినర్లతో తొలగింపు చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో నిర్మాణదారులు అధికారులను అడ్డుకున్నారు. సుమారు 70 ఏళ్లకుపైగా ఇక్కడ జీవనం సాగిస్తున్నామని, ఇప్పుడు ఖాళీ చేస్తే ఎలా బతుకుతామని నిలదీశారు. మమ్మల్ని రోడ్డున పడేయడం న్యాయమా అంటూ వాపోయారు. అయినా అధికారులు వెనక్కి తగ్గకుండా ప్రొక్లెయినర్‌తో ఆక్రమణల తొలగించేందుకు సిద్ధమయ్యారు. దీంతో స్థానికులు, పోలీసుల మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆక్రమణల తొలగింపు నేపథ్యంలో నిర్మాణదారులు ఆందోళనకు దిగారు. ‘గతంలో దివంగత మాజీ ఎంపీ కింజరాపు ఎర్రన్నాయుడు మాకు అండగా నిలబడ్డారు. నిర్మాణాలు తొలగించకుండా రైల్వే అధికారులకు సర్దిచెప్పారు. ఇప్పుడు పునరావాసం చూపకుండా ఖాళీ చేయమనడం ధర్మమా?. రెండు రోజుల కిందట నోటీసులు ఇచ్చి.. కనీస సమయం ఇవ్వకుండా తొలగింపు చర్యలు చేపట్టడం ఎంతవరకు సమంజసం’ అని నిర్మాణదారులు ప్రశ్నించారు. తమకు కొంత సమయం కావాలని కోరారు. వారి పక్షాన పాతనౌపడ సర్పంచ్‌ దల్లి సంధ్యారాణి, ప్రతినిధి దల్లి లోకేశ్వర్‌రెడ్డి, ఎంపీటీసీ సుగ్గు అప్పలరెడ్డి తదితర ప్రజాప్రతినిధులు అధికారులతో మాట్లాడారు. దీంతో రైల్వే అధికారులు వచ్చే నెల 6 వరకు సమయం ఇచ్చారు. ఒప్పందం ప్రకారం అప్పటిలోగా ఇళ్లు ఖాళీ చేయాలని నిర్మాణదారులకు సూచించారు. ఆ రోజు పూర్తిస్థాయిలో అక్రమ నిర్మాణాలు తొలగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రైల్వేశాఖ ఏడీఈఎన్‌ ఎంవీ రమణ, సీనియర్‌ సెక్షన్‌ ఇంజినీరింగ్‌ వర్క్స్‌ అధికారి డేవిడ్‌రాజు, తహసీల్దార్‌ బెండి గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.
 
 

Updated Date - 2022-09-25T05:08:08+05:30 IST