కొవిడ్‌ నిబంధనలు తొలగింపు.. ఇక బస్సు నిండా జనం

ABN , First Publish Date - 2020-09-25T17:24:48+05:30 IST

ఇక బస్సు నిండా ప్రయాణికులు ఎక్కవచ్చు. అన్ని సీట్లలోనూ..

కొవిడ్‌ నిబంధనలు తొలగింపు.. ఇక బస్సు నిండా జనం

అన్ని సీట్లకు అనుమతి

సీట్ల వరకే.. స్టాండింగ్‌కు అనుమతి నో

400 బస్సులు రోడ్ల మీద పరుగులు

ప్రస్తుతం 50 శాతం ఆక్యుపెన్సీ

తెలంగాణకు అనుమతి వస్తే.. ఇక ఫుల్‌

భద్రాచలం బస్సు ఎటపాక వరకూ..


రాజమహేంద్రవరం(ఆంధ్రజ్యోతి): ఇక బస్సు నిండా ప్రయాణికులు ఎక్కవచ్చు. అన్ని సీట్లలోనూ ప్రయాణికులు కూర్చునేలా ప్రభుత్వం అనుమతిచ్చింది. రెండు రోజుల కిందట ఉత్తర్వులు జారీ అయ్యాయి. రోడ్ల మీద గతంలో మాదిరిగా బస్సులు పరుగులు తీయబోతున్నాయి. కొవిడ్‌ లాక్‌డౌన్‌ వల్ల మార్చి 22 నుంచి బస్సులు కొంతకాలం నిలిచిపోయిన సంగతి తెలిసిందే. తర్వాత కొన్ని నిబంధనలతో సగం సీట్ల వరకే అనుమతిచ్చిన సంగతీ తెలిసిందే.


ముగ్గురు కూర్చునే సీట్లలో ఇద్దరికి, ఇద్దరు కూర్చునే సీట్లలో ఒకరిని మాత్రమే అనుమతించారు. మాస్కు ధరించి,శానిటైజ్‌ చేసుకుని, 100 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటేనే ప్రయాణికుడిని అనుమతించేవారు. పైగా ఎక్కడ బడితే అక్కడ ఆపి ప్రయాణికులను ఎక్కించుకునేవారు కాదు. కేవలం బస్టాండ్లలోనే అనుమతించేవారు. దీంతో మొదట్లో ప్రయాణికులు చాలా ఇబ్బందిపడ్డారు. కానీ తర్వాత ప్రయాణికులే బస్సులు ఎక్కడం మానేశారు. చాలా తక్కువమంది మాత్రమే బస్సులు ఎక్కారు. ఉద్యోగస్తులు, అత్యవసర పనుల మీద వెళ్లేవారు మాత్రమే బస్సులను ఉపయోగించుకున్నారు.


కానీ ఇటీవల లాక్‌డౌన్‌ నిబంధనలు ఎత్తేయడంతో ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగింది. దీంతో ప్రభుత్వం బస్సులోని అన్ని సీట్లలోనూ ప్రయాణికులు కూర్చునేలా అనుమతి ఇచ్చింది. కానీ లాక్‌డౌన్‌కు ముందు మాదిరిగా ఆర్టీసీ బస్సుల్లో సీట్లు దొరకకపోయినా నిలబడి ప్రయాణించే అవకాశం ఇప్పుడు ఉండదు. ఎన్ని సీట్లుంటే, అంతమందిని మాత్రమే అనుమతిస్తారు.


రోడ్డెక్కిన 400 బస్సులు

రాజమహేంద్రవరం రీజియన్‌ పరిధిలోని జిల్లాలో మొత్తం 800 బస్సులు ఉన్నాయి. వాటిలో ప్రస్తుతం 400 బస్సులు నడుస్తున్నాయి. సూపర్‌ లగ్జరీ బస్సులో 36 సీట్లు,  ఎక్స్‌ప్రెస్‌లో 49 సీట్లు పల్లె వెలుగులో  55 సీట్లు ఉంటాయి. ఇకపై అన్ని సీట్లలో ప్రయాణికులు ఎక్కవచ్చు. గతంలో  రోజుకు 5 లక్షల మంది పయనించేవారు. రూ.కోటి నుంచి రూ.కోటి 10 వేల వరకూ  ఆదాయం వచ్చేది. ప్రస్తుతం లక్ష నుంచి లక్షన్నర మంది ప్రయాణికులు ఎక్కుతున్నారు. రూ.35 లక్షల నుంచి 40 లక్షల వరకూ మాత్రమే ఆదాయం వస్తోం ది. ఈ సంఖ్య క్రమంగా పెరుగుతుందనే ఆశాభావంతో ఉన్నట్టు ఆర్‌ఎం ఆర్వీఎస్‌ నాగేశ్వరరావు తెలిపారు.


హైదరాబాద్‌కు అనుమతి లేదు

తెలంగాణకు ముఖ్యంగా హైదరాబాద్‌కు బస్సులు తిరగడంలేదు. ఇటీవల ఏపీ, తెలంగాణ ఆర్టీసీ అధికార్లమధ్య చర్చలు జరిగాయి. కానీ ఒక నిర్ణయానికి రాలేదు. ఓ ఒప్పందం కుదిరితే ఆర్టీసీకి మంచిరోజులు వచ్చినట్టే. సుమారు 135 బస్సులు ఆంధ్రా- తెలంగాణ మధ్య తిరుగుతాయి. ప్రస్తుతం బెంగళూరుకు మాత్ర మే  బస్సులు నడుపుతున్నారు. చెన్నై ప్రభుత్వం అను మతి ఇవ్వకపోవడం వల్ల అక్కడికీ బస్సులు తిరగడం లేదు. భద్రాచలం బస్సులకు ఇబ్బంది అయింది. కానీ మన ఆర్టీసీ అధికారులు మారేడుమిల్లి మీదుగా ఎటపాక వరకూ బస్సులు నడుపుతున్నారు. అక్కడికి భద్రాచలం బస్టాండు కేవలం అర కిలోమీటరు దూరం మాత్రమే ఉంటుందని చెబుతున్నారు. ఇక విశాఖ, తిరుపతి, విజయవాడ వైపు బస్సులు అవసరమైన మేరకు నడుపుతున్నారు. రామచంద్రపురం నుంచి యానాం వరకూ సోమవారం నుంచి ఆరు బస్సులు తిప్పే ప్రయత్నంలో ఉన్నట్టు ఆర్‌ఎం తెలిపారు.  


Updated Date - 2020-09-25T17:24:48+05:30 IST