దందా ప్రైవేటులోనే..! ‘రెమ్‌డెసివిర్‌’ తతంగమంతా ఆసుపత్రుల సిబ్బందితోనే

ABN , First Publish Date - 2021-05-08T06:03:37+05:30 IST

‘రెమ్‌డెసివిర్‌’ ప్రస్తుతం ఈ పేరు చెబితే మొదట గుర్తుకొచ్చేది బ్లాక్‌ మార్కెట్‌నే. కరోనా సెకండ్‌ వేవ్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ ఇంజక్షన్‌కు డిమాండ్‌ పెరిగింది. ఈ సూదిమందు మార్కెట్‌లో సరిపడా దొరకకపోవడం, రోగుల కుటుంబ సభ్యులకు దానిపై పూర్తిస్థాయి అవగాహన లేకపోవడంతో అవసరాన్ని ఆసరాగా చేసుకుంటున్న కొందరు.. ఈ ఇంజక్షన్‌ను బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయించి సొమ్ములు చేసుకుంటున్నారు.

దందా ప్రైవేటులోనే..!  ‘రెమ్‌డెసివిర్‌’ తతంగమంతా ఆసుపత్రుల సిబ్బందితోనే
ఖమ్మం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సీజ్‌చేసిన రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు

వాటి సమీపాల్లోనే బ్లాక్‌ విక్రయాలు

‘ఆంధ్రజ్యోతి’ కథనానికి సీపీ వారియర్‌ స్పందన

రంగంలోకి టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు

హైదరాబాద్‌, ఖమ్మానికి చెందిన మూడు ముఠాలు అరెస్టు

ఖమ్మం, మే7 (ఆంధ్రజ్యోతి): ‘రెమ్‌డెసివిర్‌’ ప్రస్తుతం ఈ పేరు చెబితే మొదట గుర్తుకొచ్చేది బ్లాక్‌ మార్కెట్‌నే. కరోనా సెకండ్‌ వేవ్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ ఇంజక్షన్‌కు డిమాండ్‌ పెరిగింది. ఈ సూదిమందు మార్కెట్‌లో సరిపడా దొరకకపోవడం, రోగుల కుటుంబ సభ్యులకు దానిపై పూర్తిస్థాయి అవగాహన లేకపోవడంతో అవసరాన్ని ఆసరాగా చేసుకుంటున్న కొందరు.. ఈ ఇంజక్షన్‌ను బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయించి సొమ్ములు చేసుకుంటున్నారు. అయితే ఆయా ఇంజక్షన్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరిన కరోనా రోగులకు అందుబాటులోనే ఉంటుండగా.. అక్కడ బెడ్లు దొరక్క ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరిన వారికి మాత్రం అందని ద్రాక్షగానే మిలుగుతున్నాయి. దాన్ని ఆసరాగా చేసుకుంటున్న రెమ్‌డెసివిర్‌ బ్లాక్‌ దందా ముఠాలు ఒక్కొ ఇంజక్షన్‌ను రూ.35వేల నుంచి రూ.50వేలకు విక్రయిస్తున్నారు. అయితే దందా మొత్తం పలు ప్రైవేటు ఆసుపత్రులు కేంద్రంగానే జరుగుతోందని.. శుక్రవారం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బ్లాక్‌ మార్కెట్‌ ముఠా సభ్యులను అదుపులోకి తీసుకోవడంతో స్పష్టమవుతోంది. కాగా శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’ జిల్లా సంచికతో ‘మందుమాయ’ శీర్షికన కథనం ప్రచురితమవగా అది అక్షరసత్యమేనని నిరూపితమైంది. 

బ్లాక్‌ మార్కెట్‌ దందా ప్రైవేటులోనే..

‘రెమ్‌డెసివిర్‌’ దందా అంతా ప్రైవేటులోనే సాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరోనా రోగులు తమ ఆసుపత్రుల్లో చేరిన తర్వాత వారికి అవసరమున్నా లేకున్నా.. ఇంజక్షన్‌ వేయాలంటూ అందినకాడికి దండుకుంటున్నారన్న విమర్శలున్నాయి. అంతేకాదు పలు ఆసుపత్రుల నిర్వాహాకులే దగ్గరుండి మరీ దందాకు శ్రీకారం చుడుతున్నారు. హైదరాబాద్‌, విజయవాడ ముఠాలతో సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం, పేషంట్‌కు అవసరమున్నా లేకున్నా.. ఆయా పేషెంట్ల పేరుమీద ఇంజక్షన్లను తెప్పించి తమ దగ్గర స్టోర్‌ చేసుకుంటున్నారని సమాచారం.  ఆ తర్వాత ఎవరైనా కరోనా రోగులకు అత్యవసర పరిస్థితుల్లో ఇంజక్షన్‌ కావాలంటే బ్లాక్‌లో తెప్పించాలని, కావాలంటే తాము తెప్పిస్తామని చెప్పి వారి నుంచి రూ. 30వేల నుంచి రూ. 50 వేల వరకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఇతర ముఠాలకు కూడా ప్రైవేటు ఆసుపత్రులే తమ బ్లాక్‌ దందాను కొనసాగించడానికి అడ్డాలుగా మారాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లోని రోగులకు అత్యవసర పరిస్థితుల్లో రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ను విక్రయించేలా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉంటూ విక్రయాలు సాగిస్తున్నట్టుగా సమాచారం. కాగా ఆసుపత్రులపై పర్యవేక్షణ పెంచి తనిఖీలు నిర్వహిస్తే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 

‘మందు మాయ’కు స్పందించిన సీపీ వారియర్‌..

‘ఆంధ్రజ్యోతి’ కథనాలు అక్షరసత్యాలని మరోసారి రుజువైంది. రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ అవసరాన్ని ఆసరాగా చేసుకుని వాటిని బ్లాక్‌ మార్కెట్‌లో రూ. 30వేల నుంచి రూ.50వేల వరకు విక్రయిస్తున్నట్టుగా ఆంధ్రజ్యోతిలో ‘మందు మాయ’ శీర్షికన శుక్రవారం కథనం ప్రచురితమవగా.. బ్లాక్‌లో ఇంజక్షన్లను విక్రయిస్తున్న మూడు ముఠాలను ఖమ్మం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఖమ్మంలో రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల దందా జోరుగా సాగుతోందని, హైదరాబాద్‌ కేంద్రంగా పలు ముఠాలు ఖమ్మంలోని పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో పరిచయమున్న వైద్యసిబ్బంది సహాయంతో బ్లాక్‌లో విక్రయాలు జరుపుతున్నారంటూ శుక్రవారం ఖమ్మం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ‘మందు మాయ’ శీర్షికన కధనం ప్రచురితమైంది. దానికి స్పందించిన ఖమ్మం పోలీస్‌ కమిషనర్‌ విష్ణు ఎస్‌ వారియర్‌ రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను దారిమళ్లించి విక్రయించే ముఠాలను కట్టడి చేయాలని ఆదేశాలు జారీచేశారు. ఆయన ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు 11మంది సభ్యులున్న మూడు ముఠాలను అదుపులోకి తీసుకుని వారినుంచి 18 రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను, రూ.63వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌ పటాన్‌చెరువు ప్రాంతానికి చెందిన ఆంబులెన్స్‌ డ్రైవర్‌ అక్కడి ఈఎస్‌ఐ ఆసుపత్రిలోని స్టాఫ్‌ నర్సు నుంచి కొనుగోలు చేసి ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి పర్యవేక్షకుడు, స్టోర్‌ ఇన్‌చార్జ్‌, ఖమ్మానికి చెందిన అంబులెన్స్‌ డ్రైవర్‌ సహకారంతో ఒక్కో ఇంజక్షన్‌ రూ.35వేలకు విక్రయిస్తుండగా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. మరో ఘటనలో ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్న స్టాఫ్‌, ల్యాబ్‌ టెక్నిషీయన్‌, ఓటీ అసిస్టెంట్‌, డ్యూటీ డాక్టర్‌ సమన్వయంతో బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయిస్తున్న మూడు రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు, రూ.50వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. కాగా ఆ రెండు ముఠాలను ప్రైవేటు ఆసుపత్రుల సమీపంలోనే రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకోవడం గమనార్హం. ప్రైవేటు ఆసుపత్రిలో స్టాఫ్‌ ఆసుపత్రి రోగులకు అవసరం ఉందని నమ్మించి బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయించేందుకు ప్రయత్నించగా వారిని అదుపులోకి తీసుకున్నట్టు టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ రామానుజం తెలిపారు. ఈ దాడుల్లో టాస్క్‌ఫోర్స్‌ సీఐ రవికుమార్‌, ఎస్సై ప్రసాద్‌, సిబ్బంది, వన్‌టౌన్‌ సిబ్బంది పాల్గొన్నారు. మరో ఘటనలో ఖమ్మానికి చెందిన ఇద్దరు వ్యక్తుల నుంచి తొమ్మిది ఇంజక్షన్లను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం అర్బన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఇద్దరు యువకులు రెమ్‌డెసివిర్‌ బ్లాక్‌లో విక్రయిస్తున్నట్టుగా విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్‌ సీఐ వేణుమాధవ్‌, ఎస్సై సతీష్‌కుమార్‌, తమ సిబ్బందితో కలిసి దాడిచేసి పట్టుకున్నారు. ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ యువకుడితోపాటు, మరో యువకుడికి హైద్రాబాద్‌కు చెందిన శ్రీకాంత్‌ అనే వ్యక్తి ఇంజక్షన్లను సరఫరా చేస్తున్నట్టు సమాచారం. 


Updated Date - 2021-05-08T06:03:37+05:30 IST