Abn logo
May 9 2021 @ 00:21AM

రెమ్‌డిసివిర్‌ బ్లాక్‌ మార్కెట్‌ ముఠా అరెస్టు

హన్మకొండ పోలీస్‌స్టేషన్‌లో ముఠా అరెస్టును చూపుతున్న ఏసీపీ జితేందర్‌రెడ్డి

5 ఇంజక్షన్లు, రూ. 24వేల నగదు స్వాధీనం


వరంగల్‌ అర్బన్‌ క్రైం, మే 8 : కొవిడ్‌ బారిన పడినవారికి అత్యవసర సమయాల్లో అందించే రెమ్‌డిసివర్‌ ఇంజక్షన్లను బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న ముఠా సభ్యులను శనివారం హన్మకొండ పోలీసులు అరెస్టు చేశారు. ప్రజాసేన అవినీతి నిరోధక స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు పుప్పాల రజినీకాంత్‌ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఐదుగురు ముఠా సభ్యులను అరెస్టు చేశారు. హన్మకొండ పోలీ్‌సస్టేషన్‌లో ఏసీపీ మూల జితేందర్‌రెడ్డి నిందితుల వివరాలను వెల్లడించారు. నల్గొండ జిల్లా దిండి మండలం రామ్‌నాథ్‌పూర్‌ గ్రామానికి చెందిన ఎలిమినేటి నరేష్‌, హైదరాబాద్‌ తార్నాకకు చెందిన వాంకుడోత్‌ సందీప్‌, సికింద్రాబాద్‌ కార్ఖానాకు చెందిన జంగిలి ప్రశాంత్‌, వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేట మండలం గురిజాలకు చెందిన బొల్లం ఓంప్రకాశ్‌, కొక్కు ప్రశాంత్‌ గతంలో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు సంస్థలో ల్యాబ్‌ టెక్నీషియన్‌ కోర్సును అభ్యసించారు. స్నేహితులైన వీరు శిక్షణ అనంతరం వారి సొంత జిల్లాల్లోని పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో ల్యాబ్‌ టెక్నీషియన్లుగా పనిచేస్తున్నారు. వీరు ఒక ముఠాగా ఏర్పడి ఆ ఆస్పత్రుల యాజమాన్యాలకు తెలియకుండా రెమ్‌డిసివర్‌ ఇంజక్షన్లను చోరీ చేసి ఎమ్మార్పీ ధరల కంటే అధిక రేట్లకు బ్లాక్‌లో విక్రయిస్తున్నారు. హన్మకొండలో ఈ ముఠా సభ్యులు రెమ్‌డిసివర్‌ ఇంజక్షన్లు విక్రయిస్తున్నట్లు శనివారం రజినీకాంత్‌కు సమాచారం అందగా ఆయన పోలీసులకు చేరవేశాడు. దీంతో వరంగల్‌ సెంట్రల్‌ జోన్‌ డీసీపీ పుష్ప స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. హన్మకొండ చౌరస్తాలో నిందితులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఐదుగురిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 5 ఇంజక్షన్‌ వాయిల్స్‌తో పాటు రూ.24 వేల నగదును స్వాధీనం చేసుకున్నామని, కేసు నమోదు చేసి ఐదుగురిని రిమాండ్‌కు తరలించామని ఏసీపీ జితేందర్‌ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో హన్మకొండ సీఐ చంద్రశేఖర్‌, ఎస్సైలు రఘుపతి, నవీన్‌కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.