‘బ్లాక్‌’లో రెమ్‌డెసివిర్‌.. ‘ప్రైవేట్‌’ పనేనా!?

ABN , First Publish Date - 2021-04-22T04:42:53+05:30 IST

విషమ పరిస్థితుల్లో ఉన్న కరోనా బాధితులు కోలుకోవడానికి ఈ రెమ్‌డెసివిర్‌ మందు వినియోగిస్తారు. ఇది బహిరంగ మార్కెట్లో లభ్యం కాదు. కేవలం రెండు రకాలుగా మాత్రమే ఈ ఇంజక్షన్‌ దొరుకుతుంది.

‘బ్లాక్‌’లో రెమ్‌డెసివిర్‌..  ‘ప్రైవేట్‌’ పనేనా!?

కంపెనీల నుంచే తెప్పించుకుంటున్న ఆసుపత్రి వర్గాలు

చివరకు బాధితుడికి కాకుండా నల్లబజారుకు..

ఏజెంట్ల ద్వారా అధిక ధరకు విక్రయం

విజిలెన్స్‌ రట్టు చేసేవరకు యంత్రాంగం ఏం చేస్తున్నట్టు?


రెమ్‌డెసివిర్‌... కరోనా చికిత్సలో అతి ముఖ్యమైన ఇంజక్షన్‌. కరోనా ఆసుపత్రులకు మాత్రమే సరఫరా అయ్యే ఈ మందు బ్లాక్‌ మార్కెట్లో అమ్ముడవుతోంది. వెయ్యి రూపాయల విలువజేసే ఈ ఇంజక్షన్‌ రూ.20వేల నుంచి 30 వేల వరకూ పలుకుతోంది. సాధారణ మార్కెట్లో లభ్యం కాని ఈ మందు బ్లాక్‌లోకి ఎలా వస్తోంది?. ఏజెంట్లు ఎలా తయారయ్యారు?. వీరికి ఈ మందు ఎలా అందుతోంది?. కరోనాను ఆసరా చేసుకొని ప్రజల రక్తం తాగుతున్న అసలు దళారులు ఎవరు!? ఈ విషయమై జిల్లా యంత్రాంగం బుధవారం లోతుగా చర్చించింది. రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ బ్లాకులో అమ్ముతున్నారని ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనం, దానిని నిజం చేస్తూ విజిలెన్స్‌ అధికారులు దళారులను పట్టుకున్న వైనం.. ఇవన్నీ అధికార వర్గాలను కలవరపాటుకు గురిచేశాయి. ఈ రాకెట్‌ వెనుక సూత్రధారులను పట్టుకోవడం కోసం పోలీస్‌ యంత్రాంగం సన్నద్ధమైంది. 


నెల్లూరు, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి) : విషమ పరిస్థితుల్లో ఉన్న కరోనా బాధితులు కోలుకోవడానికి ఈ రెమ్‌డెసివిర్‌ మందు వినియోగిస్తారు. ఇది బహిరంగ మార్కెట్లో లభ్యం కాదు. కేవలం రెండు రకాలుగా మాత్రమే ఈ ఇంజక్షన్‌ దొరుకుతుంది. ఒకటి ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి (జీజీహెచ్‌). ఏపీహెచ్‌ఎంఐడీసీ ద్వారా జీజీహెచ్‌కు ఈ మందు సరఫరా చేస్తారు. అది కూడా జీజీహెచ్‌కు చెందిన ఎవరో ఒక డాక్టర్‌ అడిగినంత మాత్రాన ఇవ్వరు. దీనికి ముగ్గురు డాక్టర్లతో కమిటీ ఉంటుంది. అందులో ఆసుపత్రి సూపరింటెండెంట్‌, నోడల్‌ ఆఫీసర్‌తోపాటు మరో డాక్టరు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ సిఫారసు మేరకే జీజీహెచ్‌కు సప్లయి చేస్తారు. ఆ మందు కూడా ఏ రోగికి వినియోగించారు, వారి ఆధార్‌ కార్డు వివరాలు, వ్యాధిగ్రస్థుడి కండీషన్‌ తెలిపే మెడికల్‌ రిపోర్టు ఇవన్నీ ఏపీహెచ్‌ఎండీసీకి అందజేస్తేనే ఆ మందు రిలీజ్‌ చేస్తారు. అంటే జీజీహెచ్‌ నుంచి ఈ మందు బయటికి వచ్చే అవకాశం లేదు. 


రెండో పద్ధతి


కొవిడ్‌ ఆసుపత్రులుగా నిర్ధారించిన ప్రైవేటు ఆసుపత్రులకు కూడా ఈ మందు అందుతుంది. కొవిడ్‌ చికిత్సకు ప్రభుత్వం నుంచి అనుమతిపత్రం పొందిన ప్రైవేటు ఆసుపత్రులు నేరుగా కంపెనీ నుంచి ఈ మందులు తెప్పించుకొంటున్నాయి. ఇలా తెప్పించుకున్న మందులు బ్లాక్‌మార్కెట్‌లోకి వెళుతున్నాయి. 


చికిత్స పేరుతో దగా


ప్రభుత్వ అనుమతి ఉన్న ప్రైవేటు ఆసుపత్రి వర్గాలు అన్ని విధాలా కరోనా బాధితులను దగా చేస్తున్నాయి. ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచిత వైద్యం చేయాల్సిందిపోయి రూ.వేలకు వేలు బిల్లులు చెల్లించే వారికే అడ్మిషన్లు ఇస్తున్నాయి. ఇది ఒకరకమైన దోపిడీ అయితే.. వీరి పేరు చెప్పి రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు తెప్పించి ఏజెంట్ల ద్వారా బ్లాక్‌ మార్కెట్లో విక్రయిస్తున్నాయి. నెల్లూరులోని పలు కొవిడ్‌ ప్రైవేటు ఆసుపత్రులలో ఇదే జరుగుతోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విషమ పరిస్థితుల్లో ఉన్న బాధితులకు ఈ ఇంజక్షన్లు వాడరు. అలా వాడితే దాని వాస్తవ ధర ఎంతో ప్రభుత్వం అంతే చెల్లిస్తుంది. ఆ మాత్రం ధరకు సేవ చేయడం ఇష్టంలేని వీరు రోగుల పేర్లు చెప్పి బయట బ్లాక్‌ మార్కెట్‌లో డిమాండును బట్టి రూ.25 వేల నుంచి 30వేల వరకు విక్రయిస్తున్నారు. విశేషమేమంటే ఈ మందు బ్లాక్‌లో ఎవరి దగ్గర దొరుకుందో ఆసుపత్రి వర్గాలే రోగితాల బంధువులకు చెబుతాయి 


చర్యలేమిటో!?


రెమ్‌డెసివిర్‌ బ్లాకులో అమ్ముతున్నారన్న విషయం విజిలెన్స్‌ అధికారుల దాడులతో వెలుగుచూసింది. మరి ఇందుకు బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు. అసలు సంబంధిత శాఖ ఏం చేస్తోంది. ఈ మందు ఏ ఆసుపత్రికి ఎన్ని డోసులు పంపిందనే వివరాలను తయారీ ఫ్యాక్టరీలు డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయానికి కూడా తెలియజేస్తాయని సమాచారం. మరి అలాంటప్పుడు వీటిని సక్రమంగా వినియోగిస్తున్నారా!? లేదా!? అనే విషయాన్ని పరిశీలించాల్సిన అవసరం ఆ శాఖకు లేదా!? కరోనా తొలి విడత నుంచి అంటే గత ఏడాది నుంచి ఈ ఇంజక్షన్లు బ్లాకులో అమ్ముతున్నారని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.  కరోనా వైద్యం విషయంలో అధికారులు ఇంత ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే కొన్ని ప్రైవేటు ఆసుపత్రి వర్గాలు   దోచుకొంటున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 



వైరస్‌ విలయం


పది మందిలో నలుగురికి పాజిటివిటీ

ఆరు రోజుల్లో 9 నుంచి 40 శాతానికి పెరిగిన కేసులు

సీరియస్‌గా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం

సీఈసీ అనుమతితో రేపు అధికారులతో సమీక్ష

పాల్గొననున్న మంత్రు అనిల్‌, గౌతమ్‌


మహమ్మారి కరోనా తీవ్రరూపం దాల్చుతోంది. పరీక్షలు చేయించుకున్న ప్రతి పది మందిలో నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అవుతోంది. కేవలం ఆరు రోజుల వ్యవధిలోనే వైరస్‌ వేగం నాలుగున్నర రెట్లు పెరిగింది. దేశంలో ఎక్కడా లేని విధంగా నెల్లూరులో విపరీతంగా పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకొని నెల్లూరులో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలని టీడీపీ నేత సోమిరెడ్డి సీఎం జగన్‌కు లేఖ రాశారు. ఈ మేరకు ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని సీరియ్‌సగా తీసుకుంది. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నా అత్యవసర పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ఎన్నికల కమిషన్‌ అనుమతితో శుక్రవారం జిల్లా మంత్రులు అనిల్‌కుమార్‌ యాదవ్‌, మేకపాటి గౌతంరెడ్డిలు జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. 


నెల్లూరు, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి) : గడిచిన రెండు రోజులుగా నమోదవుతున్న పాజిటివ్‌ కేసుల సంఖ్య రాష్ట్ర, జిల్లా అధికారులను భయకంపితులను చేస్తోంది. పరీక్షలు చేసుకున్న ప్రతి పది మందిలో నలుగురికి పాజిటివ్‌ వచ్చిందంటే వైరస్‌ ఎంత తీవ్రంగా వ్యాప్తి చెందుతోందో ఊహించవచ్చు. 20వ తేదీన జిల్లాలో 3325 మందికి కరోనా పరీక్షలు చేస్తే అందులో 1347 మందికి పాజిటివ్‌ వచ్చింది. అంటే పరీక్షించిన ప్రతి వంద మందిలో 40.5 మందికి కరోనా ఉన్నట్లు తేలింది. ఏప్రిల్‌ ఆరంభం నుంచి కరోనా విజృంభిస్తున్నా 20వ తేదీకి ముందు వరకు ఇంత తీవ్రత కనిపించలేదు. 15వ తేది 2283 మందికి పరీక్షలు జరిపితే 223 పాజిటివ్‌లు నమోదయ్యాయి. అంటే  9.76 శాతం మందికి పాజిటివ్‌గా తేలింది. 16న 3915 మందికి 354 పాజిటివ్‌ కేసులు (9.04 శాతం) రికార్డు అయ్యాయి. 17న 3753 మందికి 624 మందికి పాజిటివ్‌ వచ్చింది. అంటే కేసుల పెరుగుదల 9 నుంచి 16 శాతానికి పెరిగింది. 18, 19 తేదీల్లో జరిపిన పరీక్షలలో 15 శాతం మందికి పాజిటివ్‌ కనిపించింది.  అయితే 20వ తేదీకి వచ్చే సరికి 16 నుంచి 40 శాతానికి పెరిగింది. రాష్ట్రంలో కేసుల పెరుగుదల శాతం ఇంత ఎక్కువగా మరెక్కడా నమోదు కాకపోవడం విశేషం. నాలుగు రోజుల వ్యవధిలో కేసుల పెరుగుదల రెట్టింపు అవుతుండటం ఆందోళన కలిగించే అంశం. 


రేపు మంత్రుల సమీక్ష 


కరోనా కట్టడి, చికిత్సలపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవడం కోసం శుక్రవారం జిల్లా మంత్రులు అనిల్‌కుమార్‌ యాదవ్‌, మేకపాటి గౌతంరెడ్డిలు కలెక్టర్‌, వివిధ శాఖాదికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.  ఉదయం 11 గంటలకు జడ్పీ సమావేశ మందిరంలో ఈ  సమీక్ష జరగనుంది. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమలులో  ఉన్నందున అత్యవసర పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ఎన్నికల కమిషన్‌ అనుమతితో ఈ సమీక్ష నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా నెల్లూరులో  కేసులు పెరుగుతున్న క్రమంలో కరోనా తీవ్రతను వివరిస్తూ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ రాశారు. నెల్లూరులో హెల్త్‌ ఎమర్జన్సీ పెట్టాలని కోరారు. బుధవారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి పేర్ని నాని అమరావతి నుంచి కలెక్టర్‌, వైద్యాధికారులతో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ఫోన్‌లో సమీక్షించారు.  


ఆగని మరణ మృదంగం


నెల్లూరు(వైద్యం : జిల్లాలో కరోనా మరణ మృదంగం కొనసాగుతోంది. బుధవారం వైరస్‌ నుంచి కోలుకోలేక ఏడుగురు బాధితులు మృతి చెందారు.  మరోవైపు పాజిటివ్‌ కేసుల సంఖ్య కూడా తగ్గనంటున్నాయి. తాజాగా 934 కేసులు నమోదవగా, మొత్తం కేసుల సంఖ్య 71,835 లకు చేరుకున్నాయి. అలాగే కరోనా నుంచి కోలుకున్న 1812 మందిని అధికారులు డిశ్చార్జ్‌ చేశారు. కాగా, ఆత్మకూరులో బుధవారం పాక్షిక లాక్‌డౌన్‌ ప్రారంభమైంది.ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే షాపులకు అనుమతి ఇచ్చారు.


వైద్యసేవల్లో నిర్లక్ష్యం వద్దు!


నెల్లూరు (హరనాథపురం) : వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వల్ల కొవిడ్‌ బాధితుడు మరణించాడనే  ఫిర్యాదు రాకూడదని కలెక్టర్‌ చక్రధర్‌బాబు అధికారులకు సూచించారు. బుధవారం తన బంగ్లాలో వైద్యాధికారులు, కొవిడ్‌ వైద్యశాలల ఇన్‌చార్జి అధికారులతో ఆయన సమావేశమయ్యారు. కొవిడ్‌ వైద్యశాలల్లో అవసరమైన మందులు, ఆక్సిజన్‌, వైద్య సిబ్బందిని అందుబాటులో  ఉంచుకోవాలని సూచించారు. 24 గంటలూ వైద్యసేవలు అందించేలా వైద్యులకు, పారామెడికల్‌ సిబ్బందికి విధులు కేటాయించాలని అన్నారు. ఈ సమావేశంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ స్వర్ణలత, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ దాసు తదితరులు పాల్గొన్నారు.


కరోనా నియంత్రణకు చర్యలు


వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని


నెల్లూరు (వైద్యం), ఏప్రిల్‌ 21 : జిల్లాలో కరోనా నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంతి ఆళ్లనాని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా నియంత్రణకు ఐదుగురు మంత్రులతో ఓ కమిటీ  ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బుధవారం కలెక్టర్‌ చక్రధర్‌బాబు, ఇన్‌చార్జ్‌ డీఎంహెచ్‌వో స్వర్ణలతతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. జిల్లాలో 12 కరోనా చికిత్సలు చేసే ఆసుపత్రులను ఎంపిక చేశామని చెప్పారు. జీజీహెచ్‌లో 561 మంది కరోనా వైద్యసేవలు పొందుతున్నారని వారికి అవసరమైన మందులు, నాణ్యమైన ఆహారం అందించాలని సూపరింటెండెంట్‌ ప్రభాకర్‌కు సూచించారు. కొవిడ్‌ ఆసుపత్రులలో వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. కరోనా బాధితులకు వెంటనే వైద్య సేవలు అందించేందుకు అవసరమైన వైద్యుల నియామకం కూడా చేపట్టాలని సీఎం ఆదేశించారన్నారు. కరోనా బాధితుల నుంచి ప్రైవేట్‌ ఆసుపత్రులు ఎక్కువ ఫీజు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాస్క్‌లు లేకుండా తిరిగితే రూ.100  జరిమానా విధించాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సముదాయాల వద్ద నో మాస్క్‌, నో ఎంట్రీ బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. 



Updated Date - 2021-04-22T04:42:53+05:30 IST