6 రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల సీజ్‌

ABN , First Publish Date - 2021-05-08T05:40:19+05:30 IST

కరోనా బాధితులకు అత్యవసర వైద్యం కింద వినియోగించే రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల బ్లాక్‌ మార్కెటింగ్‌ ఏమాత్రం ఆగడం లేదు.

6 రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల సీజ్‌

గుంటూరు, మే 7 (ఆంధ్రజ్యోతి): కరోనా బాధితులకు అత్యవసర వైద్యం కింద వినియోగించే రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల బ్లాక్‌ మార్కెటింగ్‌ ఏమాత్రం ఆగడం లేదు. శుక్రవారం నగరంలోని ఇన్నర్‌రింగురోడ్డులో ఉన్న విశ్వాస్‌ హాస్పిటల్‌లో స్టాఫ్‌నర్సుగా పని చేస్తోన్న రాపూరి దుర్గ ప్రసన్నకుమార్‌ రెమ్‌డెసివిర్‌(కోవీఫర్‌) ఇంజక్షన్లు విక్రయిస్తున్నాడని విశ్వసనీయంగా సమాచారం అందింది.  డ్రగ్స్‌ కంట్రోల్‌ అధికారులు వారి గురించి ఏమి చెప్పకుండా తమకు అర్జంట్‌గా రెమ్‌డెసివిర్‌ కావాలని అతనిని ఆశ్రయించారు. దాంతో అతను ఒక్కో వెయిల్‌కి రూ.35 వేల ఖర్చు అవుతుందని చెప్పి అడ్వాన్స్‌గా రూ.5 వేలు తీసుకొన్నాడు. ఆ తర్వాత ఆరు కోవిఫర్‌ ఇంజక్షన్లు తీసుకొచ్చాడు. ఎప్పుడైతే దుర్గ ప్రసన్నకుమార్‌ ఇంజక్షన్లు తీసుకొచ్చాడో అతనని డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు పట్టుకొని ఎంక్వయిరీ చేశారు. తనకు కొత్తపేట సురక్ష ఆస్పత్రిలో పనిచేసే వాసిమళ్ల వరలక్ష్మి సరఫరా చేసిందని చెప్పాడు. ఆ మేరకు అధికారులు వాసిమళ్ల వరలక్ష్మిని విచారించగా తనకు అమరావతి రోడ్డులోని ప్రభుత్వ జ్వరాల ఆస్పత్రిలో పనిచేసే స్టాఫ్‌ నర్సు కన్నయ్య సుమ ఇచ్చారని తెలిపారు. కన్నయ్య సుమని విచారించగా ఆ ఇంజక్షన్లు తానే సరఫరా చేసినట్లు అంగీకరించారు. అయితే తనకు ఎవరు ఇచ్చారనేది ఆమె చెప్పలేదు. పెదకాకాని పోలీసుస్టేషన్‌లో దీనిపై ఫిర్యాదు చేసినట్లు డ్రగ్స్‌ కంట్రోల్‌ శాఖ ఏడీ అనిల్‌కుమార్‌ తెలిపారు. ఆరు ఇంజక్షన్లు, రూ.5 వేల నగదు సీజ్‌ చేశామన్నారు.  

Updated Date - 2021-05-08T05:40:19+05:30 IST