హత్య కేసులో నిందితుల రిమాండ్‌

ABN , First Publish Date - 2020-02-20T05:49:55+05:30 IST

ఫంక్షన్‌హాల్‌లో ముగ్గురు కూలీల మధ్య జరిగిన గొడవలో ఓ వ్యక్తి మరణానికి కారణమైన ఇద్దరు నిందితులను ఆదిభట్ల పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

హత్య కేసులో నిందితుల రిమాండ్‌

ఆదిభట్ల: ఫంక్షన్‌హాల్‌లో ముగ్గురు కూలీల మధ్య జరిగిన గొడవలో ఓ వ్యక్తి మరణానికి కారణమైన ఇద్దరు నిందితులను ఆదిభట్ల పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ యాదగిరిరెడ్డి, సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ నరేందర్‌, ఎస్‌ఐ సురే్‌షలతో కలిసి విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. హైదరాబాదుకు చెందిన మహమ్మద్‌ రియాజ్‌ లేబర్‌ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. కాగా ఈ నెల 7వ తేదీన మన్నెగూడ బీఎంఆర్‌ శారద కన్వెన్షన్‌హాల్‌ అనే పంక్షన్‌హాల్‌లో వారం రోజుల పాటు పనులు చేసేందుకు  నాంపల్లి లేబర్‌ అడ్డా నుంచి ముగ్గురు కూలీలను తీసుకొచ్చాడు. ఈ నెల 14న ఫంక్షన్‌ పూర్తయిన తరువాత వారు చేయాల్సిన పనులు చెప్పి కాంట్రాక్టర్‌ ఇంటికి వెళ్లి పోయాడు. రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో మద్యం సేవించిన ముగ్గురు కూలీల మధ్య మాటా మాటా పెరిగి గొడవకు దారితీసింది. గొడవలో భాగంగా ఫంక్షన్‌హాల్‌లో మంటలు ఆర్పడానికి ఏర్పాటు  చేసిన సిలెండర్‌తో దాడి చేసుకున్నారు. దీంతో అబ్ధూల్లా తలకు గాయం అయినట్లు తెలుసుకున్న లేబర్‌ లేబర్‌ కాంట్రాక్టర్‌ మహమ్మద్‌ రియాజ్‌ అతడిని సికింద్రాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు మహమ్మద్‌ రియాజ్‌ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న ఆదిభట్ల పోలీసులు నిందితులకు సంబంధించిన ఆధారాలు గుర్తింపుకార్డులు లేకపోవడంతో ఇబ్రహీంపట్నం ఏసీపీ యాదగిరిరెడ్డి పర్యవేక్షణలో ఆదిభట్ల ఎస్‌హెచ్‌వో నరేందర్‌ అధ్వర్యంలో ప్రత్యేక బృందం దర్యాప్తు చేయగా మద్యప్రదేశ్‌ రాష్ట్రం, బేతుల్‌ జిల్లా, ఆమ్లా మండల్‌ బేడి ఖూర్దు గ్రామానికి చెందిన హనుమాన్‌ మున్టే (25), సౌత్‌ దిల్లీ బిజ్‌వాసన్‌ గ్రామం అంబేద్కర్‌కాలనీకి చెందిన బందన్‌ కుమార్‌చౌదరీ అలియాస్‌ ఆనంద్‌ అలియాస్‌ వినోద్‌ (31)లు నాంపల్లి లేబర్‌ అడ్డా కేంద్రంగా పుట్‌పాత్‌లపై ఉంటున్నట్లు గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసు స్టేషన్‌కు తరలించి వారిని విచారించగా ఎంజీబీఎస్‌, సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌, పబ్లిక్‌గార్డెన్‌లలో తిరుగుతూ పుట్‌ పాత్‌లపై పడుకుంటున్నట్లు తెలిపారు. నాంపల్లి అడ్డాపై  కూలి పనిలో భాగంగా ఫంక్షన్‌హాల్‌కు వెళ్లిన వారు 14న రాత్రి జరిగిన గొడవలో గ్యాస్‌ సిలెండర్‌తో దాడి చేయడంతో నగరంలోని పార్సీగుట్టలో నివాసముండే అబ్ధూల్లా(45) మృతి చెందినట్లు అంగీకరించడంతో వారిని బుధవారం కోర్టులో హాజరు పరచి రిమాండ్‌కు తరలించారు. కాగా కేసుకు సంబంధించి ఆధారాలు లేనప్పటికీ దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసిన సీఐ నరేందర్‌, ఎస్సై సురేష్‌కుమార్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ రమేష్‌, పీసీలు పాండు రంగారెడ్డి, ప్రసాద్‌, శ్రీశైలం, అభిరాం, తేజేశ్వర్‌లను ఏసీపీ యాదగిరిరెడ్డి అభినందించారు. వారికి తగిన రివార్డు అందేలా రాచకొండ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌కు సిఫార్సు చేసినట్లు తెలిపారు.

Updated Date - 2020-02-20T05:49:55+05:30 IST