Chitrajyothy Logo
Advertisement

Review 2021 : టాలీవుడ్ రీమేక్స్ ఇవే..

twitter-iconwatsapp-iconfb-icon
Review 2021 : టాలీవుడ్ రీమేక్స్ ఇవే..

ప్రతీ ఏడాది లాగానే .. 2021లో కూడా టాలీవుడ్ లో పలు రీమేక్ మూవీస్ తెరకెక్కాయి. అయితే కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ కారణంగా కొన్ని సినిమాలు ఈ ఏడాది షూటింగ్ జరుపుకోలేకపోయాయి. మరికొన్ని విడుదల కాలేకపోయాయి. అయినప్పటికీ  తెలుగులో దాదాపు 9 సినిమాలు ఇతర భాషల్లోని సూపర్ హిట్ సినిమాల ఆధారంగా తెరకెక్కాయి. వాటిలో కొన్ని చిత్రాలే చెప్పుకోదగ్గ స్థాయిలో విజయం సాధించాయి. ఇంతకీ 2021లో విడుదలైన ఆ రీమేక్ మూవీస్ ఏంటో చూద్దాం.

రెడ్ 

‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్. ఆ విజయోత్సాహంతో అతడు నటించిన తదుపరి చిత్రం ‘రెడ్’. తమిళ సూపర్ హిట్ చిత్రం ‘తడం’ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. అరుణ్ విజయ్ హీరోగా నటించిన ఈ చిత్రం తమిళంలో సూపర్ హిట్ అవడంతో ఈ సినిమాపై రామ్ మనసు పడ్డాడు. కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘రెడ్’ గా తెలుగులో రీమేక్ చేశాడు రామ్. ఇద్దరు ఐడెంటికల్ ట్విన్స్ ఒక మర్డర్ విషయంలో పోలీసులతో ఎలాంటి మైండ్ గేమ్ ప్లే చేశారు అన్నదే సినిమా కథాంశం. తెలుగులో ఒరిజినల్ అంతటి స్థాయిలో మెప్పించలేకపోయారు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. 


కపటధారి 

సుమంత్ హీరోగా.. ప్రదీప్ కృష్ణ మూర్తి దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ ‘కపటధారి’. నందితా శ్వేతా కథానాయికగా నటించగా.. నాజర్, జయప్రకాశ్ , వెన్నెల కిషోర్, సుమా రంగనాథన్ తదితరులు నటించిన ఈ సినిమాని జి.ధనంజయన్, లలితా ధనంజయన్ నిర్మించారు. కన్నడ సూపర్ హిట్ ‘కవలుదారి’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. రిషి హీరోగా రూపొందిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. అయితే తెలుగులో మాత్రం ఈ సినిమా కన్నడ సినిమా స్థాయిలో మెప్పించలేకపోయింది. ఓ ట్రాఫిక్ పోలీస్ కి .. గతంలో ఎప్పుడో జరిగిన మర్డర్ తాలుక క్లూస్ దొరుకుతాయి. వాటి ఆధారంగా అసలు హంతకుడ్ని అతడు ఎలా ట్రేస్ చేశాడు అన్నదే సినిమా కథాంశం. తమిళం కూడా ఈ సినిమా శిబిరాజ్ హీరోగా కపడదారిగా రీమేక్ అయింది. అక్కడా మెప్పించలేకపోయింది.


ఏ1 ఎక్స్ ప్రెస్ 

సందీప్ కిషన్ హీరోగా.. డెన్నిస్ జీవన్ కానుకొలను దర్శకత్వంలో రూపొందిన స్పోర్ట్స్ డ్రామా ‘ఏ1 ఎక్స్ ప్రెస్’. ఇందులో సందీప్ హాకీ ఛాంపియన్ గా నటించాడు. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించగా.. రావు రమేశ్, మురళీ శర్మ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. హిప్ హాప్ తమిళ ఆది హీరోగా నటించిన ‘నట్పే తునై’ తమిళ చిత్రం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. డి.పార్తీబన్ దేశింగు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సూపర్ హిట్ అవడమే కాకుండా.. విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. అయితే ఈ సినిమా స్థాయిలో  ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ రూపొందలేదనే చెప్పుకోవాలి.  సందీప్ కిషన్ ఖాతాలో మరో ఫ్లాప్ గా నమోదైంది. 


వకీల్ సాబ్ 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన కోర్ట్ రూమ్ డ్రామా ‘వకీల్ సాబ్’. శ్రుతి హాసన్ కథానాయికగా నటించగా.. అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ళ, ప్రకాశ్ రాజ్, శరత్ బాబు, సమ్మెట గాంధి, వంశీ కృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.  పింక్ సూపర్ హిట్ బాలీవుడ్ చిత్రానికిది రీమేక్ వెర్షన్. అమితాబ్ , తాప్సీ ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. పవర్ స్టార్ ఇమేజ్ కు అనుగుణంగా రూపుదిద్దుకున్న వకీల్ సాబ్ ..అభిమానుల్ని అలరించింది. పవర్ స్టార్ మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఈ సినిమాతో కమ్ బ్యాక్ ఇవ్వగా.. భారీ ఓపెనింగ్స్ దక్కాయి. అలాగే.. పవర్ స్టార్ పెర్ఫార్మెన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. సినిమా పవన్ ఖాతాలో సూపర్ హిట్ గా నమోదైంది. 


నారప్ప 

విక్టరీ వెంకటేశ్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన పీరియాడికల్ రివెంజ్ డ్రామా ‘నారప్ప’. ప్రియమణి కథానాయికగా నటించగా.. అమ్ము అభిరామి, నాజర్, రావు రమేశ్, ఆడుకలాం నరేన్, రాజీవ్ కనకాల బ్రహ్మాజీ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ధనుష్ హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో తమిళంలో సూపర్ హిట్ అయిన అసురన్ చిత్రానికిది అఫీషియల్ రీమేక్. ధనుష్ కు ఈ సినిమాతో మరోసారి నేషనల్ అవార్డ్ దక్కింది. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ‘నారప్ప’ చిత్రం తెలుగులో కూడా సూపర్ హిట్ అయింది. వెంకీ నటన ప్రేక్షకుల్ని మెప్పించింది. అట్టడుగు వర్గానికి చెందిన ఒక కుటుంబం, అగ్రకులంలోని ధనిక భూస్వామి వల్ల కలిగే సమస్యల్ని ఎదుర్కొని పరిష్కరించుకొనే నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. 


తిమ్మరుసు 

టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ తిమ్మరుసు. ప్రియాంకా జవాల్కర్ కథానాయికగా నటించగా.. అజయ్, బ్రహ్మాజీ, రవిబాబు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. కన్నడ సూపర్ హిట్ చిత్రం ‘బీర్బల్ ట్రయాలజీ కేస్ 1 : ఫైండింగ్ వజ్రముని’ చిత్రానికిది అఫీషియల్ రీమేక్. యం.జీ శ్రీనివాస్ హీరోగా నటించిన ఈసినిమా అక్కడ మంచి ప్రశంసలు దక్కించుకుంది. అదే స్థాయిలో తెలుగులో కూడా ఈ సినిమా ప్రేక్షకుల్ని మెప్పించింది. ఈ సినిమాతో సత్యదేవ్ సూపర్ హిట్ అందుకున్నారు. ఓ క్యాబ్ డ్రైవర్ మర్డర్ కేస్ లో అన్యాయంగా జైలు పాలై శిక్ష అనుభవిస్తున్న ఓ కుర్రాడి తరపున నిలబడి న్యాయం కోసం పోరాడిన ఒక వకీల్ కథే ఈ సినిమా కథాంశం. ఇందులో లాయర్ గా సత్యదేవ్ అద్భుతమైన పెర్ఫార్మెన్ ఇచ్చారు. 


ఇష్క్ 

తేజ సజ్జా హీరోగా ప్రియా వారియర్ హీరోయిన్ గా .. యస్.యస్.రాజు దర్శకత్వంలో రూపొందిన థ్రిల్లింగ్ లవ్ స్టోరీ ‘ఇష్క్’. ఇట్స్ నాటే లవ్ స్టోరీ అనే ట్యాగ్ లైన్ తో రూపొందిన ఈ సినిమా.. ఇదే పేరుతో మలయాళంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రానికి అఫీషియల్ రీమేక్. షేన్ నిగమ్ ఇందులో హీరోగా నటించాడు. అయితే మలయాళ చిత్రమంతటి స్థాయిలో తెలుగు చిత్రం ప్రేక్షకుల్ని థ్రిల్ చేయలేకపోయింది. లాంగ్ డ్రైవ్ కు వెళ్లిన ఒక జంట.. అనుకోని పరిస్థితుల్లో ఇరుక్కుంటారు. పోలీస్ నని చెప్పి ఆ జంటను ఒక రాత్రంతా టార్చర్ పెట్టిన వ్యక్తి నుంచి వాళ్ళు తప్పించుకొని ఎలా బైటపడ్డారు అన్నదే ఈ సినిమా కథాంశం. మలయాళ చిత్రాన్ని యాజిటీజ్ గా ఫాలో అయినా బాగుండేది. కానీ తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చడం దగ్గరే తేడా కొట్టింది. ఇష్క్ తెలుగు వెర్షన్ డిజాస్టర్ గా నిలిచిపోయింది. 


మాస్ట్రో 

నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ ‘మాస్ట్రో’. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ అంధాధూన్ కు ఈ సినిమా అఫీషియల్ రీమేక్. ఆయుష్మాన్ ఖురానా, టబు, రాధికా ఆప్టే ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకి విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. అంతేకాదు ఈ సినిమాకి నేషనల్ అవార్డు కూడా దక్కింది. డిస్నీ హాట్ స్టార్ లో డైరెక్ట్ గా విడుదలైన ఈ సినిమా తెలుగు వెర్షన్ ప్రేక్షకుల్ని మెప్పించడంలో పూర్తిగా విఫలమైంది. ఒరిజినల్ వెర్షన్ సోల్ పట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాడు దర్శకుడు మేర్లపాక గాంధీ. నభానటేశ్ హీరోయిన్ గా నటించగా.. తమన్నా, నరేశ్, జిషుసేన్ గుప్తా ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. నితిన్ ఖాతాలో మాస్ట్రో సినిమా ఫ్లాప్ గా నమోదైంది. 


దృశ్యం 2

విక్టరీ వెంకటేశ్ హీరోగా జీతు జోసెఫ్ తెరకెక్కించిన ఫ్యామిలీ థ్రిల్లర్ ‘దృశ్యం 2’. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా డైరెక్ట్ గా విడుదలైంది. మలయాళంలో సూపర్ హిట్టైన ‘దృశ్యం 2’ చిత్రానికిది అఫీషియల్ రీమేక్ అన్న సంగతి తెలిసిందే. మొదటి బాగాన్ని మించి ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో.. అదే దర్శకుడితో తెలుగులో ఈ సినిమాను రీమేక్ చేశారు. మీనా, నరేశ్, నదియా, తనికెళ్ళ భరణి ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమా తెలుగులో కూడా మంచి టాక్ తెచ్చుకుంది. ఆరేళ్ళ క్రితం జరిగిన ఒక మర్డర్ కేసును పోలీసులు తిరగతోడతారు. దాంతో తన ఫ్యామిలీని కాపాడుకోడానికి రాంబాబు ఎలాంటి వ్యూహం పన్నాడు అన్నదే ఈ సినిమా కథాంశం.  వెంకీ ఈ సినిమాతో ప్రేక్షకుల్ని మెప్పించారు. 

- రామకృష్ణ కుమార్ 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement