Abn logo
Nov 29 2020 @ 01:11AM

‘సూటబుల్‌’ వివాదమేనా!

మీరా నాయర్‌ దర్శకత్వం వహించిన ‘ఏ సూటబుల్‌ బాయ్‌’ వెబ్‌ సిరీస్‌ చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. ఈ సినిమా ‘లవ్‌ జిహాద్‌’ను ప్రేరేపిస్తుందనేది కొందరి ఆరోపణ. ప్రముఖ కవి, రచయిత విక్రమ్‌ సేథ్‌ 1993 రాసిన ‘ఏ సూటబుల్‌ బాయ్‌’ నవల ఆధారంగా తీసిన ఈ చిత్రం అక్టోబర్‌ 22న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. టబూ, ఇషాన్‌ ఖత్తర్‌, తాన్యా మణిక్తాలా నటించిన ఈ సినిమాకు మూలమైన నవల అసలు కథేమిటంటే...


అది 1951 ప్రాంతం. ఉత్తర భారతదేశంలో అప్పటికీ దేశవిభజన సమయంలో చెలరేగిన మతకల్లోలాలు ఇంకా నివురుగప్పిన నిప్పులా కొనసాగుతూనే ఉంటాయి. ‘ఏ సూటబుల్‌ బాయ్‌’ కథ బ్రహ్మపురం పట్టణంలో మొదలవుతుంది. రూపా మెహ్రా అనే మహిళ పెళ్లీడుకొచ్చిన తన చిన్న కూతురు లతా మెహ్రాకి ఈడుజోడైన వరుడి కోసం వెతుకుతూ ఉంటుంది. రూపా తన పెద్ద కూతురు సవితను రెవెన్యూ మంత్రి కుమారుడు ప్రాణ్‌ కపూర్‌కి ఇచ్చి పెళ్లి చేస్తుంది. జమిందారీ వ్యవస్థ రద్దు బిల్లు కోసం మంత్రి మహేశ్‌ కపూర్‌ తీవ్రంగా ప్రయత్నిస్తుంటాడు. దీంతో తన స్నేహితుడు ఖాన్‌ కుటుంబానికి చెందిన నవాబ్‌ సాహిబ్‌  భూమిని కోల్పోతాడనే బెంగ ఓ వైపు, మరోవైపు సంగీత కళాకారిణి, రాజమందిరాల్లో ఆడిపాడే సయిదా బాయి అనే వేశ్యను తన చిన్నకుమారుడు మాన్‌ ప్రేమించడం ఆయనను కలవరపరుస్తుంటాయి. ఈ క్రమంలోనే లత తన ఈడు అబ్బాయితో ప్రేమలో పడుతుంది. తీరా అతను కబీర్‌ అనే ముస్లిం అని తెలుస్తుంది. ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకునేందుకు తమ కుటుంబం అసలు ఒప్పుకోదని లతకు తెలుసు. అలాగనీ పారిపోయి పెళ్లిచేసుకునేందుకు కబీర్‌ అంగీకరించడు. దాంతో లత తన తల్లితో కలిసి కోల్‌కతాలోని అన్నయ్య వద్దకు వెళుతుంది. అక్కడ తమ బంధువుల అబ్బాయి, ఇంగ్లండ్‌లో చదువుకున్న అమిత్‌తో లత పెళ్లి జరిపించాలని ఆమె తల్లి అనుకుంటుంది. అయితే అమిత్‌ కుటుంబం ఒప్పుకోకపోవడంతో అక్కడి నుంచి కథ ఢిల్లీకి మారుతుంది. అక్కడ హరేశ్‌ ఖన్నా అనే అబ్బాయి లతకు సరిజోడని ఆమె తల్లి భావిస్తుంది. అయితే అప్పటికే వేరే అమ్మాయితో ప్రేమలో ఉన్న హరేశ్‌కు లతను పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉండదు. తిరిగి ఇంటికి వచ్చిన లతకు కబీర్‌ తమ కుటుంబాన్ని ఘర్షణ సమయంలో తొక్కిసలాట నుంచి కాపాడాడనే విషయం తెలుస్తుంది. కానీ కబీర్‌ మరో మహిళతో సన్నిహితంగా ఉన్నాడనే విషయం స్నేహితురాలి ద్వారా తెలుసుకున్న లత, హరేశ్‌ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. వేశ్య సయిదా బాయి తన స్నేహితుడైన ఫిరోజ్‌తో ప్రేమగా మెలగడం చూసి కత్తితో ఫిరోజ్‌ను పొడుస్తాడు. మాన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేయడంతో అతడి తండ్రి మంత్రి పదవి పోతుంది. తన పొరపాటు వల్లనే మాన్‌ తనను కత్తితో పొడిచాడని ఫిరోజ్‌ చెప్పడంతో పోలీసులు అతడిని విడిచిపెడతారు. లత, హరేశ్‌ తమ కొత్త ఇంట్లో కొత్త జీవితం ప్రారంభించేందుకు బ్రహ్మపురంలో రైలు ఎక్కుతారు. దాంతో కథ ముగుస్తుంది. 


Advertisement
Advertisement
Advertisement