ప్రలోభాలతో మత మార్పిడులొద్దు

ABN , First Publish Date - 2020-10-01T09:01:21+05:30 IST

రాష్ట్రంలో పేద ప్రజలను ప్రలోభపెట్టి బలవంతపు మత మార్పిడులకు పాల్పడవద్దని వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు.. మతమార్పిడులను ప్రోత్సహిస్తున్న వారికి సూచించారు. ఆయన బుధవారమిక్కడ విలేకరులతో మాట్లాడారు....

ప్రలోభాలతో మత మార్పిడులొద్దు

  • క్తైస్తవం కుల మతాలకు అతీతం
  • నిర్బంధ ఆంగ్ల మాధ్యమం..
  • మతవ్యాప్తిలో అంతర్భాగమే!
  • గుళ్లపై దాడిచేసినవారిని వదిలి
  • పిచ్చోళ్లపై ‘నేర’ ముద్ర బాధాకరం
  • రెడ్లు అంటే నాకెంతో గౌరవం
  • కొందరు అపార్థం చేసుకున్నారు
  • వైసీపీ ఎంపీ రఘురామ వ్యాఖ్యలు


న్యూఢిల్లీ, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పేద ప్రజలను ప్రలోభపెట్టి బలవంతపు మత మార్పిడులకు పాల్పడవద్దని వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు.. మతమార్పిడులను ప్రోత్సహిస్తున్న వారికి సూచించారు. ఆయన బుధవారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. క్తైస్తవ మతం కుల మతాలకు అతీతమైందని చెప్పారు. కోర్టు తీర్పులను తృణీకరిస్తూ రాష్ట్రంలో ఆంగ్ల మాధ్యమాన్ని నిర్బంధంగా అమలు చేస్తున్న తీరు చూస్తుంటే.. ఇదంతా మతవ్యాప్తిలో అంతర్భాగంగానే జరుగుతున్నట్లు సందేహం కలుగుతోందన్నారు. ఆంగ్లంలో మాట్లాడినంత మాత్రాన అందరికీ ఉద్యోగాలు రావ న్న విషయం గుర్తించాలని చెప్పారు. నాలుగు ఇంగ్లీష్‌ ముక్కలు మాట్లాడితే ఉద్యోగం వచ్చేస్తే.. దేశంలో నిరుద్యోగ సమస్యే ఉండకూడదన్నారు.


దేవాలయాలపై దాడులకు పాల్పడే అసలు దోషులను వదిలి.. పిచ్చోళ్లపై నేరస్థులుగా ముద్రవేయడం బాధాకరమన్నారు. రెడ్డి సామాజిక వర్గమంటే తనకెంతో గౌరవమని చెప్పారు. కొందరు రెడ్లు తన వ్యాఖ్యలను ఆపార్ధం చేసుకోవడం బాధాకరమన్నారు. ‘పేర్ల చివరిలో వచ్చే ‘రెడ్డి‘ అనేది గ్రామాల్లో ఒక పెద్దగా గుర్తించి గౌరవసూచకంగా ఇచ్చే బిరుదు. మునసబులుగా పని చేసేవారికి రెడ్డి అనే ఉండేది. తెలంగాణలో పటేల్‌, పట్వారీలుగా పనిచేసిన వారికి రెడ్డి అనేది హోదాగా ఉండేది. హీరో వెంకటేశ్‌ మామగారు కమ్మ కులానికి చెందినా ఆయన పేరులో రెడ్డి ఉంటుంది. గ్రామంలో పన్నులు వసూలు చేసే పెద్ద మనిషిగా ఉండే రఘువీరారెడ్డి బీసీ అయినప్పటికీ ఆయన పేరులో రెడ్డి ఉంది. రెడ్డి పేరుతో ప్రత్యేకంగా కులం ఎక్కడా లేదు. రెడ్డి కులంగా చెప్పుకొంటున్న వారి కులం నిజానికి ‘కాపు‘. నన్ను విమర్శించిన నీచనికృష్టుల గురించే మాట్లాడాను’ అని చెప్పారు. పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ పదవి నుంచి తనను తొలగించాలని జగన్‌ ఇటీవల తన ఢిల్లీ పర్యటనలో కేంద్ర పెద్దలను కోరినట్లు తెలిసిందన్నారు. తనను పదవి నుంచి తొలగిస్తారని అనుకోవడం లేదన్నారు.


రైతులకు 1.35లక్షల కోట్లు చెల్లిస్తారా?

రాజధానిని మారిస్తే.. భూములిచ్చిన రైతులందరికీ రూ.1,35,000కోట్ల పరిహారం చెల్లించగలరా అని రఘురామరాజు ప్రశ్నించారు. ప్రభుత్వంతో రైతులు కుదుర్చుకున్న ఒప్పందానికి భిన్నంగా, సీఆర్‌డీఏ చట్టాన్ని తుంగలో తొక్కి రాజధాని మార్పు పేరుతో రైతులకు అన్యాయం చేయడం తగదన్నారు. అమరావతిని రాజధానిగా అంగీకరించినందువల్లే తమ పార్టీని ప్రజలు 151 సీట్లతో గెలిపించారని తెలిపారు.

Updated Date - 2020-10-01T09:01:21+05:30 IST