Abn logo
Mar 5 2021 @ 16:36PM

అమెజాన్ ప్రైమ్ వీడియో హెడ్ అపర్ణకు సుప్రీంలో ఊరట!

న్యూఢిల్లీ: ఓవర్ ది టాప్ (ఓటీటీ) ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా క్రియేటివ్ హెడ్ అపర్ణ పురోహిత్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. వెబ్ సిరీస్ ‘తాండవ్’కు సంబంధించిన కేసులో దర్యాప్తునకు ఆమె సహకరిస్తారని, కాబట్టి అరెస్ట్ చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఓటీటీకి సంబంధించిన కొత్త నిబంధనలకు కోరలు లేవని, అవి కేవలం మార్గదర్శకాలు మాత్రమేనని కేసును విచారించిన జస్టిస్ అశోక్ భూషణ్ సారథ్యంలోని ధర్మాసనం పేర్కొంది. కేవలం కొన్ని మార్గదర్శకాలు కాకుండా ఓ చట్టాన్ని రూపొందించాలని కేంద్రాన్ని కోరింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో వస్తున్న కంటెంట్‌ను స్క్రీనింగ్ చేసేందుకు, అవసరమైన చర్యలు తీసుకునేందుకు అనువైన నియమావళి ఓటీటీ కొత్త నిబంధనల్లో లేదని కోర్టు స్పష్టం చేసింది. 

‘తాండవ్’ వెబ్ సిరీస్ ద్వారా మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు పురోహిత్ ప్రయత్నిస్తున్నారంటూ ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో ముందస్తు బెయిలు కోసం అలహాబాద్ హైకోర్టును ఆమె ఆశ్రయించగా న్యాయస్థానం బెయిలు నిరాకరించింది. గత నెల 25న అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అపర్ణ పురోహిత్ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. విచారించిన సుప్రీం ధర్మాసనం అపర్ణకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 

Advertisement
Advertisement
Advertisement