వర్షం... ఉపశమయం

ABN , First Publish Date - 2020-05-30T09:03:36+05:30 IST

జిల్లాలోని మన్యం, మైదాన ప్రాంతాల్లో పలుచోట్ల శుక్రవారం సాయంత్రం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులకు పలుచోట్ల చెట్ల కొమ్మలు

వర్షం... ఉపశమయం

జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులతో మోస్తరు వర్షం

ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత

సాయంత్రం ఒక్కసారిగా మారిన వాతావరణం

మాడుగుల, బుచ్చెయ్యపేట మండలాల్లో కుండపోత

మాడుగుల మండలం చినబొడ్డరేవులో పిడుగుపడి రైతు మృతి

కోటవురట్ల మండలం భీమిరెడ్డిపాలెంలో గేదె మృత్యువాత


 మాడుగుల రూరల్‌/ చీడికాడ/ బుచ్చెయ్యపేట/ రావికమతం/ నర్సీపట్నం టౌన్‌/ కోటవురట్ల/ పాడేరు/ హుకుంపేట/ చింతపల్లి : జిల్లాలోని మన్యం, మైదాన ప్రాంతాల్లో పలుచోట్ల శుక్రవారం సాయంత్రం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులకు పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. మాడుగుల మండలంలో పిడుగు పాటుకు ఓ నిండు ప్రాణం బలైంది. శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రతంగా కాసింది. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. రహదారులపై జనం సంచారం పూర్తిగా తగ్గిపోయింది.  మధ్యాహ్నం మూడు గంటల తరువాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.


ఆకాశం మేఘావృతమైంది. ఈదురు గాలులు వీచాయి. ఉరుములు, మెరుపులతో వర్షం మొదలైంది.  పాడేరు, హుకుంపేట, చింతపల్లి, జీకేవీధి, చీడికాడ, రావికమతం, కోటవురట్ల, నర్సీపట్నం  మండలాల్లో మోస్తరుగా వర్షం పడగా, మాడుగుల, బుచ్చెయ్యపేట మండలాల్లో భారీగా కురిసింది. మాడుగుల మండలంలో పెనుగాలులు వీచాయి. వాతావరణం చల్లబడడంతో జనం ఉపశమం చెందారు. 


పిడుగు పడి రైతు మృతి

శంకరం పంచాయతీ చినబొడ్డరేవు గ్రామంలో  పిడుగు పడడంతో చెందిన పాంగి కృష్ణ(51)అనే రైతు మృతి చెందాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబ పెద్ద మృత్యువాత పడడంతో దుఃఖంలో మునిగిపోయారు. కోటవురట్ల మండలం పాములవాక శివారు భీమిరెడ్డిపాలెంలో పిడుగు పడడంతో గేదె మృతి చెందింది. సుమారు రూ.80 వేల విలువ చేసే పాడి గేదెను కోల్పోయానని   బాధిత రైతు తంగేటి నూకరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలావుంటే, ఈ వర్షం ఎండిపోతున్న చెరకు కార్శి, సరుగుడు, అపరాల పంటలకు ఊపిరి పోసిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2020-05-30T09:03:36+05:30 IST