రిలయన్స్ గూటికి ఫ్యూచర్

ABN , First Publish Date - 2020-08-30T06:29:49+05:30 IST

దేశీయ రిటైల్‌ కింగ్‌ కిశోర్‌ బియానీకి చెందిన ఫ్యూచర్‌ గ్రూప్‌ వ్యాపారాలను రూ.24,713 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్టు ముకేశ్‌ అంబానీ యాజమాన్యంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) ప్రకటించింది...

రిలయన్స్ గూటికి ఫ్యూచర్

  • రిటైల్‌, హోల్‌సేల్‌, లాజిస్టిక్స్‌, వేర్‌హౌజింగ్‌ వ్యాపారాల కొనుగోలు   
  • ఒప్పందం విలువ రూ.24,713 కోట్లు 


న్యూఢిల్లీ: దేశీయ రిటైల్‌ కింగ్‌ కిశోర్‌ బియానీకి చెందిన ఫ్యూచర్‌ గ్రూప్‌ వ్యాపారాలను రూ.24,713 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్టు ముకేశ్‌ అంబానీ యాజమాన్యంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) ప్రకటించింది. ఆర్‌ఐఎల్‌ తన అనుబంధ విభాగమైన రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఆర్‌వీఎల్‌) ద్వారా ఈ కొనుగోలు జర పనుంది. ఫ్యూచర్‌ గ్రూప్‌నకు చెందిన రిటైల్‌, హోల్‌సేల్‌, లాజిస్టిక్స్‌, వేర్‌హౌజింగ్‌ వ్యాపారాలను చేజిక్కించుకుంది. రిలయన్స్‌ తన రిటైల్‌ వ్యాపారాన్ని మరింత విస్తరించడంతోపాటు దేశంలో అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఈ-కామర్స్‌ సంస్థలకు గట్టిపోటీనిచ్చేందుకు ఈ డీల్‌ దోహదపడనుంది. క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ, పోటీ రంగ నియంత్రణ మండలి సీసీఐ, కంపెనీ లా  ట్రిబ్యునల్‌ ఎన్‌సీఎల్‌టీతో పాటు షేర్‌హోల్డర్లు, రుణదాతలు తదితరుల అనుమతులకు లోబడి ఈ లావాదేవీ పూర్తికానుంది. 


ఆర్థిక సంక్షోభంలో ఫ్యూచర్‌ గ్రూప్‌ 

అప్పుల భారం, లాక్‌డౌన్‌తో ఫ్యూచర్‌ గ్రూప్‌ ప్రధాన కంపెనీ ఫ్యూచ ర్‌ రిటైల్‌ ఆర్థిక సంక్షోభంలోకి జారుకుంది. గ్రూప్‌లోని మిగతా కంపెనీల పరిస్థితీ అంతంతే. ఈ గ్రూప్‌లోని 6 లిస్టెడ్‌ కంపెనీలపై నున్న మొత్తం రుణ భారం గత సెప్టెంబరు చివరినాటికి రూ.12,778 కోట్లకు పెరిగింది. బియానీ కుటుం బ హోల్డింగ్‌ కంపెనీలపై దాదాపు ఇదే స్థాయి రుణభారం ఉంది. పైగా, హోల్డింగ్‌ కంపెనీల చేతుల్లో ఉన్న మెజారిటీ షేర్లు ప్రస్తుతం తాకట్టులో ఉన్నాయి. 


రిలయన్స్‌ రిటైల్‌ ప్రస్థానం

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 2006లో తొలిసారిగా ‘రిలయన్స్‌ రిటైల్‌’ పేరుతో రిటైల్‌ వ్యాపారంలోకి ప్రవేశించింది. రిలయన్స్‌ ఫ్రెష్‌ బ్రాండ్‌నేమ్‌తో తొలి సూపర్‌ మార్కెట్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. ఆ తర్వాత కాలంలో వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు ఎలకా్ట్రనిక్స్‌, ఫ్యాషన్‌, క్యాష్‌ అండ్‌ క్యారీ విభాగాల్లోకీ ప్రవేశించింది. 2014లో రిలయన్స్‌ రిటైల్‌ ఆదాయంలో ఫ్యూచర్‌ గ్రూప్‌ను వెనక్కి నెట్టి దేశంలో అతిపెద్ద రిటైలర్‌గా అవతరించింది. ఆ ఏడాది ఫ్యూచర్‌ గ్రూప్‌ మొత్తం ఆదాయం రూ.13,666 కోట్లు కాగా.. రిలయన్స్‌ రిటైల్‌ రెవెన్యూ రూ.14,496 కోట్లకు ఎగబాకింది. 


ఈ డీల్‌ ద్వారా: ఫ్యూచర్‌ రిటైల్‌, ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్‌ ఫ్యాషన్స్‌లోని ప్రమోటర్ల వాటా పూర్తిగా రిలయన్స్‌ రిటైల్‌ పరంకానుంది. ఫ్యూచర్‌ కన్జ్యూమర్‌ లిమిటెడ్‌ను సైతం రిలయన్స్‌ టేకోవర్‌ చేయనుంది. ఫ్యూచర్‌ ఫైనాన్షియల్‌, బీమా వ్యాపారాలు మాత్రం ఈ ఒప్పందం పరిధిలోకి రావు. 


ఈ డీల్‌ తర్వాత: ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ పరిధిలో  ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల మాన్యుఫాక్చరింగ్‌, డిస్ట్రిబ్యూషన్‌, ఇంటిగ్రేటెడ్‌ ఫ్యాషన్‌ సోర్సింగ్‌, మాన్యుఫాక్చరింగ్‌ వ్యాపారాలు కొనసాగనున్నాయి. 


ఒప్పందం పూర్తయ్యాక ఓపెన్‌ ఆఫర్‌ 

ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌తో ఒప్పందం పూర్తయ్యాక కంపెనీ మైనారిటీ వాటాదారుల నుంచి 26 శాతం వాటా కొనుగోలు కోసం రిలయన్స్‌ రిటైల్‌ ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించాల్సి ఉంటుంది. 


అమెజాన్‌ పరిస్థితేంటో..? 

రిలయన్స్‌తో డీల్‌ కుదిరిన నేపథ్యంలో ఫ్యూచర్‌లో పెట్టుబడులున్న అమెజాన్‌ పరిస్థితి ఏంటనేదానిపై స్పష్టత లేదు. గత ఏడాది ఆగస్టులో అమెజాన్‌.. ఫ్యూచర్‌ కూపన్స్‌లో 49 శాతం వాటా కొనుగోలు చేసింది. తద్వారా ఫ్యూచర్‌ రిటైల్‌లోనూ 1.3 శాతం వాటా లభించింది. 




దేశంలో ఆధునిక రిటైల్‌ విప్లవంలో ముఖ్య భూమిక పోషించిన ఫ్యూచర్‌ గ్రూప్‌ ప్రముఖ వ్యాపారాలు, బ్రాండ్లు మా గూటికి చేరుతున్నందుకు సంతోషంగా ఉంది. చిన్న వ్యాపారులు, కిరాణాలతోపాటు బడా కన్జ్యూమర్‌ బ్రాండ్లతో క్రియాశీలక భాగస్వామ్య విధానంతో రిటైల్‌ ఇండస్ట్రీ వృద్ధిని మరింత పెంచగలమన్న నమ్మకం ఉంది. దేశవ్యాప్తంగా మా కస్టమర్లకు విలువైన సేవలను కొనసాగించేందుకు కట్టుబడి ఉన్నాం.  

- ఇషా అంబానీ, రిలయన్స్‌ రిటైల్‌ డైరెక్టర్‌ 




కొనుగోలు జరగనుందిలా.. 

ఫ్యూచర్‌ గ్రూప్‌ కాంపొజిట్‌ స్కీమ్‌ ఆఫ్‌ అరేంజ్‌మెంట్‌ (స్కీమ్‌)లో భాగంగా ఆర్‌ఐఎల్‌ ఈ కొనుగోలు చేయనుంది. ఈ స్కీమ్‌లో భాగంగా ఫ్యూచర్‌ గ్రూప్‌ తన రిటైల్‌, హోల్‌సేల్‌, లాజిస్టిక్స్‌, వేర్‌హౌజింగ్‌ వ్యాపారాలను ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌(ఎ్‌ఫఈఎల్‌)లో విలీనం చేయనుంది. 

ఫ్యూచర్‌ గ్రూప్‌ రిటైల్‌, హోల్‌సేల్‌ వ్యాపారాలు ఆర్‌ఆర్‌వీఎల్‌ పూర్తి అనుబంధ విభాగమైన రిలయన్స్‌ రిటైల్‌ అండ్‌ ఫ్యాషన్‌ లైఫ్‌స్టైల్‌ లిమిటెడ్‌(ఆర్‌ఆర్‌ఎ్‌ఫఎల్‌ఎల్‌)కు బదిలీ అవుతాయి.

లాజిస్టిక్స్‌, వేర్‌హౌజింగ్‌ విభాగాలు నేరుగా ఆర్‌ఆర్‌వీఎల్‌కు బదిలీ కానున్నాయి. 

ఈ డీల్‌లో భాగంగా ఆర్‌ఆర్‌ఎ్‌ఫఎల్‌ఎల్‌ కింది విధంగా పెట్టుబడులు పెట్టనుంది. 


1. వ్యాపారాల విలీనం తర్వాత ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌లో 6.09 శాతం వాటా కోసం ఈక్విటీ షేర్ల ప్రిఫరెన్షియల్‌ ఇష్యూలో రూ.1,200 కోట్లు. 

2. ఈక్విటీ వారంట్ల ప్రిఫరెన్షియల్‌ ఇష్యూలో మరో రూ.400 కోట్లు. వాటిని ఈక్విటీగా మార్చుకోవడం ద్వారా మరో 7.05 శాతం వాటా లభించనుంది. 


Updated Date - 2020-08-30T06:29:49+05:30 IST