రిలయన్స్ ధమాకా సేల్!

ABN , First Publish Date - 2020-09-10T06:57:37+05:30 IST

ముకేశ్‌ అంబానీకి చెందిన జియో ప్లాట్‌ఫామ్స్‌లో వాటా కొనుగోలు చేసిన అమెరికన్‌ ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ సిల్వర్‌ లేక్‌ పార్ట్‌నర్స్‌.. రిలయన్స్‌ రిటైల్‌లోనూ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది...

రిలయన్స్ ధమాకా సేల్!

  • రిటైల్‌ విభాగంలో వాటాల విక్రయం షురూ 
  • రూ.7,500 కోట్లకు 1.75శాతం వాటా కొన్న సిల్వర్‌ లేక్‌ 
  • సంస్థలో పెట్టుబడి కోసం క్యూలో కేకేఆర్‌!


న్యూఢిల్లీ: ముకేశ్‌ అంబానీకి చెందిన జియో ప్లాట్‌ఫామ్స్‌లో వాటా కొనుగోలు చేసిన అమెరికన్‌ ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ సిల్వర్‌ లేక్‌ పార్ట్‌నర్స్‌.. రిలయన్స్‌ రిటైల్‌లోనూ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌(ఆర్‌ఆర్‌వీఎల్‌)లో 1.75 శాతం వాటాను సిల్వర్‌ లేక్‌ రూ.7,500 కోట్లకు కొనుగోలు చేయనుందని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) వెల్లడించింది. ఈ డీల్‌లో భాగంగా ఆర్‌ఆర్‌వీఎల్‌ మార్కెట్‌ విలువను రూ.4.21 లక్షల కోట్లుగా లెక్కగట్టినట్లు తెలిపింది. నియంత్రణ మండళ్లతోపాటు ఇతర అనుమతులకు లోబడి ఈ ఒప్పందం పూర్తికానుంది. జియోప్లాట్‌ఫామ్స్‌లో వాటా కొనుగోలు చేసిన మరో ప్రైవేట్‌ ఈక్విటీ దిగ్గజం కేకేఆర్‌ సైతం రిలయన్స్‌ రిటైల్‌లో 150 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్లు సమాచారం. 


దేశంలోనే అతిపెద్ద రిటైల్‌ సంస్థ 

ఆర్‌ఆర్‌వీఎల్‌ అనుబంధ విభాగమైన రిలయన్స్‌ రిటైల్‌ లిమిటెడ్‌.. దేశంలోనే అతిపెద్ద చిల్లర వర్తక సంస్థ. శరవేగంగా వృద్ధి చెందుతున్న, అత్యంత లాభదాయక రిటైల్‌ సంస్థ కూడా.  సూపర్‌ మార్కెట్లు, కన్జ్యూమర్‌ ఎలకా్ట్రనిక్స్‌ స్టోర్లు, క్యాష్‌ అండ్‌ క్యారీ హోల్‌సేల్‌ స్టోర్లు, ఫ్యాషన్‌ రిటైల్‌ విక్రయ కేంద్రాలతోపాటు జియోమార్ట్‌ పేరుతో ఈమధ్యనే ఆన్‌లైన్‌ కిరా ణా ప్లాట్‌ఫామ్‌ను సైతం ప్రారంభించింది. దేశంలోని దాదాపు 7,000 పట్టణాల్లో 12,000 వరకు స్టోర్లను నిర్వహిస్తోంది. 


దేశీయ రిటైల్‌లో ఆధిపత్య పోరు  

దేశీయ వ్యవస్థీకృత రిటైల్‌ మార్కెట్‌పై పూర్తి ఆధిపత్యం కోసం ముకేశ్‌ అంబానీతోపాటు అమెజాన్‌, వాల్‌మార్ట్‌లు సైతం ప్రయత్నిస్తున్నాయి. ఈ-కామర్స్‌లో అమెజాన్‌తో పాటు వాల్‌మార్ట్‌ చేతుల్లోకి వెళ్లిన ఫ్లిప్‌కార్ట్‌కు గట్టిపోటీనిచ్చేందుకు అంబానీ జియోమార్ట్‌ను ప్రారంభించారు. మే నెలలో సేవలను ప్రారంభించిన జియోమార్ట్‌.. తన కస్టమర్లను స్థానిక కిరాణా స్టోర్లతో అనుసంధానించేందుకు వాట్సా్‌పతో జట్టుకట్టింది. 


రిలయన్స్‌ గూటికి ‘ఫ్యూచర్‌’ వ్యాపారాలు

ఫ్యూచర్‌ గ్రూప్‌నకు చెందిన రిటైల్‌, హోల్‌సేల్‌, లాజిస్టిక్స్‌, వేర్‌హౌసింగ్‌ వ్యాపారాలను రిలయన్స్‌ రిటైల్‌ రూ.24,713 కోట్లకు కొనుగోలు చేయనుంది. ఇందుకు సంబంధించి గతనెలలో ఒప్పందం కుదుర్చుకుంది. దేశీయ వ్యవస్థీకృత రిటైలింగ్‌లో తిరుగులేని శక్తిగా అవతరించేందుకు రిలయన్స్‌కు ఈ డీల్‌ ఎంతగానో దోహదపడనుంది. 


ప్రపంచ నెం.1 టెక్‌ ఇన్వెస్టర్‌  

సిల్వర్‌ లేక్‌ పార్ట్‌నర్స్‌ ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ ఇన్వెస్టర్‌. ట్విటర్‌, ఎయిర్‌ బీఎన్‌బీ, అలీబాబా, డెల్‌ టెక్నాలజీస్‌, ఏఎన్‌టీ ఫైనాన్షియల్‌, ఆల్ఫాబెట్‌కు చెందిన వేమో, వెరిలీ వంటి  అంతర్జాతీయంగా పేరున్న కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది.  


జియో ఇన్వెస్టర్లందరికీ రిటైల్‌లో వాటా ఆఫర్‌

జియో ప్లాట్‌ఫామ్స్‌లో 32.84 శాతం వాటా విక్రయం ద్వారా ఆర్‌ఐఎల్‌ రూ.1,52,055.45 కోట్లు సమీకరించింది. తొలుత ఫేస్‌బుక్‌ 9.99 శాతం వాటాను రూ.43,573 కోట్లకు కొనుగోలు చేసింది. ఫేస్‌బుక్‌ తర్వాత జియోలో పెట్టుబడి పెట్టిన రెండో అమెరికన్‌ సంస్థ సిల్వర్‌ లేక్‌. రెండు విడతల్లో 2.08 శాతం వాటా కొనుగోలు చేసింది. ఇందుకోసం 135 కోట్ల డాలర్లు (రూ.10,202.55 కోట్లు) ఇన్వెస్ట్‌ చేసింది.   జియోలో పెట్టుబడులు పెట్టిన కంపెనీల జాబితాలో గూగుల్‌, ఇంటెల్‌, క్వాల్‌కామ్‌ వంటి టెక్నాలజీ కంపెనీలూ ఉన్నాయి. ప్రైవేట్‌ ఈక్విటీ రంగంలో సిల్వర్‌ లేక్‌ ప్రత్యర్ధులైన కేకేఆర్‌, విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్‌, జనరల్‌ అట్లాంటిక్‌ సైతం జియోలో వాటా చేజిక్కించుకున్నాయి.  జియో ప్లాట్‌ఫామ్స్‌లో వాటా కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లందరికీ రిలయన్స్‌ రిటైల్‌లోనూ వాటాలు ఆఫర్‌ చేస్తున్నట్లు తెలిసింది. 



సిల్వర్‌ లేక్‌తో భాగస్వామ్యాన్ని విస్తరించుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. దేశీయ రిటైల్‌ రంగంలోని లక్షలాది చిన్న వర్తకులతో సమగ్ర భాగస్వామ్యం ద్వారా వినియోగదారులకు విలువైన సేవలందించేందుకు రిలయన్స్‌ రిటైల్‌ ప్రయత్నిస్తోంది. మా లక్ష్యాల అమలులో సిల్వర్‌ లేక్‌ అమూల్యమైన భాగస్వామి కానుంది. 

- ముకేశ్‌ అంబానీ, ఆర్‌ఐఎల్‌ చైర్మన్‌ 



తాజా పెట్టుబడి ద్వారా రిలయన్స్‌తో బంధాన్ని విస్తృతం చేసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. కరోనా సంక్షోభంతో ప్రపంచమంతా పోరాడుతున్న తరుణంలో అతిస్వల్పకాలంలో జియోమార్ట్‌ సాధించిన విజయం అసాధారణ పరిణామం. భారత రిటైల్‌లో రిలయన్స్‌ లక్ష్యాల్లో భాగస్వామ్యమవుతున్నందుకు ఉత్సాహంగా ఉంది. 

- ఎగాన్‌ డర్బన్‌, సిల్వర్‌ లేక్‌  కో-సీఈఓ, ఎండీ 


Updated Date - 2020-09-10T06:57:37+05:30 IST