రిలయన్స్ జియో నుంచి మరో సంచలనం.. తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్లు!

ABN , First Publish Date - 2020-09-23T02:08:15+05:30 IST

టెలికం రంగంలో సంచలనాలకు మారుపేరుగా నిలిచిన రిలయన్స్ జియో మరోమారు మార్కెట్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతోంది. 4జీ ఫీచర్

రిలయన్స్ జియో నుంచి మరో సంచలనం.. తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్లు!

ముంబై: టెలికం రంగంలో సంచలనాలకు మారుపేరుగా నిలిచిన రిలయన్స్ జియో మరోమారు మార్కెట్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతోంది. 4జీ ఫీచర్ ఫోన్లతో ఓ ఊపు ఊపిన జియో.. ఈసారి అతి తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్లను అందించేందుకు రెడీ అవుతోంది. ఇందుకోసం దేశీయ స్మార్ట్‌ఫోన్ మేకర్లతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. వచ్చే రెండేళ్లలో 200 మిలియన్ స్మార్ట్‌ఫోన్లు ఉత్పత్తి చేసేందుకు రెడీ కావాలంటూ స్థానిక ఫోన్ మేకర్లను కోరినట్టు సమాచారం.


చవక ఫోన్లతో భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను వశపరుచుకున్న చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ షియోమీ వంటి వాటికి జియో నిర్ణయం ఎదురుదెబ్బ అవుతుందని భావిస్తున్నారు. గూగుల్ ఆండ్రాయిడ్‌పై పనిచేసేలా రూ. 4 వేల ధర (54 డాలర్లు)తో అందుబాటులో ఉండేలా స్మార్ట్‌ఫోన్లను సిద్ధం చేయాలని దేశీయ స్మార్ట్‌ఫోన్ మేకర్లను జియో కోరినట్టు సమాచారం. రిలయన్స్ జియో లోకాస్ట్ వైర్‌లెస్ ప్లాన్ల ద్వారా ఈ ఫోన్లను మార్కెట్ చేయనున్నారు. జియో నిర్ణయం దేశీయ స్మార్ట్‌ఫోన్ మేకర్లు అయిన డిక్సన్ టెక్నాలజీస్ ఇండియా, లావా ఇంటర్నేషనల్, కార్బన్ మొబైల్స్‌కు పెద్ద ఊతం కాగలదని భావిస్తున్నారు. 


వచ్చే రెండేళ్లలో 150 నుంచి 200 మిలియన్ ఫోన్లను విక్రయించాలని రిలయన్స్ లక్ష్యంగా పెట్టుకుంది. మార్చితో ముగిసిన సంవత్సరానికి దేశంలో 165 మిలియన్ స్మార్ట్‌ఫోన్లు అసెంబుల్ అయ్యాయి. అదే సంఖ్యలో బేసిక్ ఫీచర్ ఫోన్లు కూడా అసెంబుల్ అయ్యాయి. మొత్తం స్మార్ట్‌ఫోన్లలో దాదాపు ఐదోవంతు ఫోన్ల ధర 7 వేల రూపాయల లోపే ఉన్నాయి.  రిలయన్స్ ప్రత్యర్థి భారతి ఎయిర్‌టెల్ కూడా సొంత 4జీ స్మార్ట్‌ఫోన్లను తీసుకురావాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం స్థానిక ఉత్పత్తిదారులతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.


రిలయన్స్ కనుక కొత్త స్మార్ట్‌ఫోన్లతో ప్రజలను కనుక ఆకర్షించగలితే ఈ-కామర్స్, సోషల్ మీడియా, గేమ్స్‌లలో తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించాలన్న అంబానీ కల నెరవేరుతుంది. దేశంలో స్మార్ట్‌ఫోన్‌కు దూరంగా ఉంటున్న దాదాపు 50 కోట్ల మందిని రిలయన్స్ లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ విషయంపై జియో అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Updated Date - 2020-09-23T02:08:15+05:30 IST