నాలుగో త్రైమాసికంలోనూ దుమ్మురేపిన రిలయన్స్

ABN , First Publish Date - 2022-05-07T02:41:12+05:30 IST

ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) నాలుగో త్రైమాసిక ఫలితాలు వచ్చేశాయి.

నాలుగో త్రైమాసికంలోనూ దుమ్మురేపిన రిలయన్స్

న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) నాలుగో త్రైమాసిక ఫలితాలు వచ్చేశాయి. మార్చి 31తో ముగిసిన మూడు నెలల కాలంలో ఏకీకృత నికర లాభం 22 శాతం పెరిగి రూ.16,203 కోట్లకు చేరుకుంది. బంపర్ ఆయిల్ రిఫైనింగ్ మార్జిన్‌లు, టెలికం, డిజిటల్ సేవలలో స్థిరమైన వృద్ధి నమోదు చేసింది. కాగా, గతేడాది ఇదే కాలంలో రిలయన్స్ నికర ఆదాయం రూ.13,227 కోట్లుగా ఉంది. 


ఆయిల్ నుంచి  టెలికం వరకు విస్తరించిన రిలయన్స్ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 37 శాతం పెరిగి రూ. 2.11 లక్షల కోట్లకు చేరుకుంది. దేశంలోనే అత్యంత విలువైన సంస్థగా ఖ్యాతిగాంచిన రిలయన్స్ 2022 ఆర్థిక సంవత్సరంలో 100 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 7.92 లక్షల కోట్లు) వార్షిక ఆదాయాన్ని అధిగమించి ఆ ఘనత సాధించి ఏకైక సంస్థగా రికార్డులకెక్కింది. ‘బ్లూమ్‌బర్గ్’ అంచనా ప్రకారం రిలయన్స్ నికర లాభం రూ. 16,800 కోట్లు కాగా, ఆదాయం రూ. 2.15 లక్షల కోట్లుగా ఉంది. 


శుక్రవారం రిలయన్స్ స్క్రిప్ ఎన్ఎస్ఈలో 0.77 శాతం తగ్గి రూ. 2,620 వద్ద ముగిసింది. ఇటీవల ఈ స్టాక్ రూ. 2,856 ఆల్‌టైం హైకి చేరుకుంది. కాగా, కంపెనీ బోర్డు మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ. 8 డివిడెంట్‌ను సిఫార్సు చేసింది. ఈ సందర్భంగా రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి, పెరిగిన భౌగోళిక, రాజకీయ అనిశ్చితి కారణంగా కొనసాగుతున్న సవాళ్లు ఉన్నప్పటికీ 2021-21 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ బలమైన పనితీరును కనబరిచినట్టు చెప్పారు. డిజిటల్ సేవలు, రిటైల్ విభాగాలలో బలమైన వృద్ధి సాధించినందుకు సంతోషంగా ఉందన్నారు. 

Read more