రిలయన్స్‌ లాభం రూ.13,101 కోట్లు

ABN , First Publish Date - 2021-01-23T06:06:10+05:30 IST

గడిచిన మూడు నెలలకు రిలయన్స్‌ రిటైల్‌ స్థూల లాభం వార్షిక ప్రాతిపదికన 11.80 శాతం వృద్ధితో రూ.3,102 కోట్లకు చేరుకుంది.

రిలయన్స్‌ లాభం రూ.13,101 కోట్లు

కొనసాగిన జియో, రిటైల్‌ దూకుడు 

మెరుగైన ఆయిల్‌ టు కెమికల్‌ వ్యాపారం


న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికానికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) కన్సాలిడేటెడ్‌ నికర లాభం 12 శాతం వృద్ధి చెంది రూ.13,101 కోట్లకు చేరుకుంది. రిలయన్స్‌ రిటైల్‌, జియో వ్యాపారాల జోరుతో పాటు ఆయిల్‌ టు కెమికల్‌ (ఓ2సీ) బిజినెస్‌ పనితీరు కూడా మెరుగుపడటం ఇందుకు దోహదపడింది. గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఆర్‌ఐఎల్‌ లాభం రూ.11,640 కోట్లుగా ఉంది. గడిచిన మూడు నెలల్లో గ్రూప్‌ మొత్తం ఆదాయం మాత్రం రూ.1,28,450 కోట్లకు తగ్గింది. అంతక్రితం ఏడాదిలో ఇదే సమయానికి రూ.1,60,447 కోట్ల ఆదాయం ఆర్జించింది. మరిన్ని ముఖ్యాంశాలు.. 


అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో రిలయన్స్‌ ఓ2సీ వ్యాపార విభాగ స్థూల లాభం వార్షిక ప్రాతిపదికన 28.1 శాతం తగ్గి రూ.8,756 కోట్లకు పరిమితమైంది. ముడిచమురు ధరలు తగ్గడం, కరోనా సంక్షోభంతో ఇంధన డిమాండ్‌ తగ్గడం ఈ వ్యాపార విభాగ పనితీరుపై ప్రభావం చూపింది. జూలై-సెప్టెంబరు త్రైమాసికంతో పోలిస్తే మాత్రం మెరుగుపడింది. 

ఆర్‌ఐఎల్‌ ఆదాయ లాభాల్లో జియో, రిటైల్‌ వాటా గణనీయంగా పెరిగింది. గ్రూప్‌ ఆదాయంలో ఈ రెండింటి వాటా 51 శాతానికి పెరగగా.. స్థూల లాభంలో 56 శాతానికి చేరుకుంది. 

2020 మార్చిలో రిలయన్స్‌ స్థూల రుణ భారం రూ.3,36,294 కోట్లుగా ఉండగా.. డిసెంబరు చివరి నాటికి రూ.2,57,413 కోట్లకు తగ్గింది. ఇదే కాలానికి కంపెనీ వద్దనున్న నగదు నిల్వలు రూ.1,75,259 కోట్ల నుంచి రూ.2,20,524 కోట్లకు పెరిగాయి. 


జియో లాభంలో 15.5 శాతం వృద్ధి 

గత డిసెంబరుతో ముగిసిన మూడు నెలల్లో ఆర్‌ఐఎల్‌ డిజిటల్‌, టెలికాం సేవల విభాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌ నికర లాభం 15.5 శాతం వృద్ధితో రూ.3,489 కోట్లకు పెరిగింది. అంతక్రితం సంవత్సరంలో ఇదే కాలానికి కంపెనీ లాభం రూ.3,020 కోట్లుగా ఉంది. గడిచిన త్రైమాసికంలో జియో ఆదా యం రూ.22,858 కోట్లుగా నమోదైంది. డిసెంబరు చివరి నాటికి కంపెనీ మొత్తం వినియోగదారుల సంఖ్య 41.08 కోట్లు దాటిం ది. అంతేకాదు, గత త్రైమాసికంలో ఒక్కో వినియోగదారు నుంచి ఆర్జించిన నెలవారీ ఆదాయ సగటు (ఏఆర్‌పీయూ) రూ.151కు పెరిగింది. క్రితం సంవత్సరంలో ఇదే కాలానికి ఏఆర్‌పీయూ రూ.145గా ఉంది.


రిలయన్స్‌ రిటైల్‌ స్థూల లాభం రూ.3,102 కోట్లు 

గడిచిన మూడు నెలలకు రిలయన్స్‌ రిటైల్‌ స్థూల లాభం వార్షిక ప్రాతిపదికన 11.80 శాతం వృద్ధితో రూ.3,102 కోట్లకు చేరుకుంది. ఆదాయం మాత్రం వార్షిక ప్రాతిపదికన 22.94 శాతం తగ్గి రూ.36,887 కోట్లకు పరిమితమైంది. కరోనా ప్రభావంతో విక్రయాలు తగ్గడంతో పాటు ఇంధన రిటైల్‌ వ్యాపారాన్ని ఆర్‌ఐఎల్‌-బీపీ జాయింట్‌ వెంచర్‌కు బదిలీ చేయడం ఆదాయ తగ్గుదలకు కారణమైంది. గడిచిన మూడు నెలల్లో మరో 327 రిటైల్‌ స్టోర్లను ప్రారంభించడంతో మొత్తం కేంద్రాల సంఖ్య 12,201కి పెరిగింది. కరోనా సంక్షో భం మొదలైనప్పటి నుంచి తమ సంస్థ 50,000కు పైగా కొత్త ఉద్యోగాలు కల్పించిందని వెల్లడించింది. 

Updated Date - 2021-01-23T06:06:10+05:30 IST