రిలయన్స్‌ కొత్త రికార్డు.. 10,000 కోట్ల డాలర్ల వార్షికాదాయాం

ABN , First Publish Date - 2022-05-07T06:47:12+05:30 IST

అపర కుబేరుడు ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) సరికొత్త రికార్డు సృష్టించింది. 10,000 కోట్ల డాలర్ల వార్షికాదాయాన్ని నమోదు చేసుకున్న తొలి భారత కంపెనీగా..

రిలయన్స్‌ కొత్త రికార్డు.. 10,000 కోట్ల డాలర్ల వార్షికాదాయాం

ఈ ఘనత సాధించిన తొలి భారత కంపెనీ

2021-22 మొత్తానికి రూ.60,705 కోట్ల లాభం

వాటాదారులకు ఒక్కో షేరుకు రూ.8 డివిడెండ్‌  

ముంబై: అపర కుబేరుడు ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) సరికొత్త రికార్డు సృష్టించింది. 10,000 కోట్ల డాలర్ల వార్షికాదాయాన్ని నమోదు చేసుకున్న తొలి భారత కంపెనీగా అరుదైన ఘనత ను నమోదు చేసుకుంది. గడిచిన ఆర్థిక సంవత్సరానికి (2021-22) కంపెనీ ఆదాయం రూ.7.92 లక్షల కోట్లకు పెరిగింది. అమెరికన్‌ కరెన్సీలో ఈ విలువ 10,200 కోట్ల డాలర్లకు సమానం. 2021-22కి గాను రిలయన్స్‌ రూ.60,705 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతేకాదు, వాటాదారులకు రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.8 డివిడెండ్‌ చెల్లించనున్నట్లు తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో అన్ని వ్యాపార విభాగాల్లో కలిపి కొత్తగా 2.1 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించినట్లు సంస్థ వెల్లడించింది. కరోనా సంక్షోభ సవాళ్లు, భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలోనూ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గత ఆర్థిక సంవ త్సరానికి సమృద్ధికరమైన పనితీరు కనబరచగలిగిందని ఆర్‌ఐఎల్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ పేర్కొన్నారు. 


క్యూ4 లాభం రూ.16,203 కోట్లు 

గత ఆర్థిక సంవత్సరంలో మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికానికి (క్యూ4) ఆర్‌ఐఎల్‌ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 24..5 శాతం వృద్ధి చెంది రూ.16,203 కోట్లకు పెరిగింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి కంపెనీ లాభం రూ.13,227 కోట్లుగా ఉంది. ఈ  జనవరి-మార్చి కాలానికి ఆర్‌ఐఎల్‌ ఆదాయం 37 శాతం ఎగబాకి రూ.2.11 లక్షల కోట్లకు చేరుకుంది. చమురు శుద్ధి వ్యాపారంలో బంపర్‌ మార్జిన్లతోపాటు టెలికాం, డిజిటల్‌ సేవల్లో నిలకడైన వృద్ధి, రిటైల్‌ వ్యాపారాల జోరు ఇందుకు దోహదపడ్డాయి. రిలయన్స్‌ ప్రధానంగా నాలుగు విభాగాల్లో (ఆయిల్‌ టు కెమికల్‌, రిటైల్‌, టెలికాం అండ్‌ డిజిటల్‌, పునరుత్పాదక ఇంధనం) వ్యాపారాలు నిర్వహిస్తోంది. ఆయిల్‌ టు కెమికల్‌ వ్యాపార ఆదాయం క్యూ4 లో రూ.1.46 లక్షల కోట్లకు పెరగగా.. నిర్వహణ లాభం రూ.12,386 కోట్లుగా నమోదైంది. 

రిలయన్స్‌ జియో

ఈ మార్చితో ముగిసిన మూడు నెలలకు గాను ఆర్‌ఐఎల్‌ టెలికాం సేవల విభాగమైన రిలయన్స్‌ జియో లాభం రూ.4,173 కోట్లకు చేరుకుంది. గత ఏడాదిలో ఇదే కాలానికి నమోదు చేసుకున్న రూ.3,360 కోట్ల లాభంతో పోలిస్తే దాదాపు 22.5 శాతం వృద్ధి కనబర్చింది. ఇక ఈ మార్చి త్రైమాసికంలో జియో ఆదాయం వార్షిక ప్రాతిపదికన 20 శాతం వృద్ధితో రూ.20,901 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం (2021 ఏప్రిల్‌-2022 మార్చి) మొత్తానికి జియో లాభం 23 శాతం పెరుగుదలతో రూ.14,854 కోట్లకు, ఆదాయం 10.3 శాతం వృద్ధితో రూ.77,356 కోట్లకు చేరుకుంది. సమీక్షా కాలానికి ఒక్కో టెలికాం వినియోగదారు నుంచి నెలవారీ సగటు ఆదాయం (ఏఆర్‌పీయూ) రూ.167.6కు పెరిగింది. మార్చి 31 నాటికి రిలయన్స్‌ జియో మొత్తం కస్టమర్ల సంఖ్య 41 కోట్లకు తగ్గింది. 

రిలయన్స్‌ రిటైల్‌ 

ఈ జనవరి- మార్చి రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఆర్‌వీఎల్‌) స్థూల లాభం 2.43 శాతం పెరిగి రూ.3,705 కోట్లకు చేరుకుంది. ఆదాయం రూ.58,019 కోట్లకు  పెరిగింది. సమీక్షా కాలానికి ఈ విభాగం 793 కొత్త రిటైల్‌ స్టోర్లను ప్రారంభించింది.     దాంతో మొత్తం స్టోర్ల సంఖ్య 15,196కు చేరుకుంది. 

Read more