రిలయన్స్‌ చేతికి టిక్‌టాక్‌!?

ABN , First Publish Date - 2020-08-14T07:56:56+05:30 IST

ప్రముఖ వీడియో షేరింగ్‌ యాప్‌ టిక్‌టాక్‌ భారత కార్యకలాపాలను చేజిక్కించుకునేందుకు ముకేశ్‌ అంబానీ ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. టిక్‌టాక్‌ భారత వ్యాపారంలో పెట్టుబడుల కోసం అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌...

రిలయన్స్‌ చేతికి టిక్‌టాక్‌!?

  • ఈ యాప్‌ భారత కార్యకలాపాలను  ఆర్‌ఐఎల్‌ చేజిక్కించుకునే అవకాశం!! 
  • ఇరువర్గాల మధ్య మొదలైన చర్చలు 


ప్రముఖ వీడియో షేరింగ్‌ యాప్‌ టిక్‌టాక్‌  భారత కార్యకలాపాలను చేజిక్కించుకునేందుకు ముకేశ్‌ అంబానీ ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. టిక్‌టాక్‌ భారత వ్యాపారంలో పెట్టుబడుల కోసం అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌)తో బైట్‌డ్యాన్స్‌ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. గతనెల చివర్లోనే ఇరువర్గాల మధ్య చర్చలు మొదలయ్యాయని, ఇంకా కొలిక్కి రావాల్సి ఉందని ఓ టెక్నాలజీ వెబ్‌సైట్‌ కథనం పేర్కొంది. అయితే, ఈ వార్తలపైౖ రిలయన్స్‌, బైట్‌డ్యాన్స్‌, టిక్‌టాక్‌ ప్రతినిధులెవరూ స్పందించలేదు. చైనా ఇంటర్నెట్‌ టెక్నాలజీ దిగ్గజాల్లో ఒకటైన బైట్‌డ్యాన్స్‌.. టిక్‌టాక్‌ మాతృసంస్థ. 


భారత్‌లో టిక్‌టాక్‌పై నిషేధం 

టిక్‌టాక్‌ సహా 59 చైనా యాప్‌లను భారత ప్రభుత్వం జూన్‌లో నిషేధించింది. చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో మోదీ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. గతవారం అమెరికాలోని ట్రంప్‌ ప్రభుత్వం సైతం టిక్‌టాక్‌, విచాట్‌ సహా పలు చైనా యాప్‌లపై నిషేధం విధించింది. 


మైక్రోసా్‌ఫ్టతోనూ బైట్‌డ్యాన్స్‌ చర్చలు 

టిక్‌టాక్‌ అమెరికా కార్యకలాపాలను చేజిక్కించుకునేందుకు మైక్రోసాఫ్ట్‌ ప్రయత్నిస్తోంది. ఇందుకు సంబంధించి మైక్రోసా్‌ఫ్ట-బైట్‌డ్యాన్స్‌ మధ్య ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయి. ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ట్విటర్‌ సైతం ఈ యాప్‌పై ఆసక్తిగా ఉంది. 


Updated Date - 2020-08-14T07:56:56+05:30 IST