జియో సూపర్ సిక్స్.. తాజాగా మరో బిగ్ డీల్..!

ABN , First Publish Date - 2020-06-05T17:25:17+05:30 IST

రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ (ఆర్ఐఎల్) అనుబంధ సంస్థ, ముకేశ్ అంబానీ మానస పుత్రిక రిలయన్స్ ...

జియో సూపర్ సిక్స్.. తాజాగా మరో బిగ్ డీల్..!

ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ (ఆర్ఐఎల్) అనుబంధ సంస్థ, ముకేశ్ అంబానీ మానస పుత్రిక రిలయన్స్ జియోలోకి పెట్టుబడుల వరద కొనసాగుతూనే ఉంది. తాజాగా అబూదాబీకి చెందిన ముబదలా ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ జియో ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టుబడికి ముందుకొచ్చింది. 1.85 శాతం ఈక్విటీ వాటా కోసం రూ. 9,093.60 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. దీని ఈక్విటీ విలువ రూ. 4.91 కోట్లు కాగా.. ఎంటర్‌ప్రైస్ విలువ రూ.5.16 లక్షల కోట్లు అని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఓ ప్రకటనలో పేర్కొంది.


ముబదలా ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ (ముబదలా) అబుదాబికి చెందిన సావరిన్ గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ కంపెనీ. అబూదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ (ఏడీఐఏ) తర్వాత రెండో అతిపెద్ద ప్రభుత్వ ఇన్వెస్టర్ అయిన ముబదలా... దాదాపు 240 బిలియన్ డాలర్ల పోర్ట్‌ఫోలియోను నిర్వహిస్తుంది. ఇప్పటికే జియో ప్లాట్‌ఫాంలో ప్రముఖ టెక్ దిగ్గజం ఫేస్‌బుక్‌తో పాటు సిల్వర్ లేక్, విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్, జనరల్ అట్లాంటిక్, కెకెఆర్ కంపెనీలు జియోలో వాటాలు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ముబదలాతో జియో చేసుకున్న ఒప్పందంతో అంతర్జాతీయ సంస్థల నుంచి మొత్తం రూ. 87,655.35 కోట్ల పెట్టుబడులను సేకరించినట్టైంది. కేవలం ఆరు వారాల్లోపు జియో ఆరు భారీ డీల్స్‌ను సొంతం చేసుకోవడం గమనార్హం. 

Updated Date - 2020-06-05T17:25:17+05:30 IST