డిగ్రీ విద్యార్థులకు ఉపకార వేతనాలు : రిలయన్స్ ఫౌండేషన్

ABN , First Publish Date - 2021-12-21T19:26:24+05:30 IST

సమాజం మేలు కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి

డిగ్రీ విద్యార్థులకు ఉపకార వేతనాలు : రిలయన్స్ ఫౌండేషన్

ముంబై : సమాజం మేలు కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి పరచడాన్ని ప్రోత్సహించేందుకు దేశంలోని 100 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వనున్నట్లు రిలయన్స్ ఫౌండేషన్ ప్రకటించింది. కృత్రిమ మేధాశక్తి (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), కంప్యూటర్ సైన్సెస్, గణితం, కంప్యూటింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఫస్ట్ ఇయర్ అండర్‌గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థినీ, విద్యార్థులు దరఖాస్తులు చేయవచ్చునని తెలిపింది. భారత దేశంలోని విద్యా సంస్థల్లో చదివేవారు దరఖాస్తు చేయడానికి అర్హులని తెలిపింది. 


ఉపకార వేతనంలో భాగంగా గ్రాంట్ అవార్డు, సమాజం మేలు కోసం టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి విద్యార్థుల కోసం పటిష్టమైన డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌ను అందించనున్నట్లు తెలిపింది. 60 మంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు రూ.4 లక్షలు చొప్పున, 40 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు రూ.6 లక్షలు చొప్పున మంజూరు చేయనున్నట్లు పేర్కొంది. 


ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్సెస్‌ చదువుతున్న ఫస్టియర్ యూజీ, పీజీ విద్యార్థులకు మొదటి రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌ను 76 మందికి 2021లో మంజూరు చేసినట్లు వివరించింది. భారత దేశపు భావి టెక్నాలజీ లీడర్స్‌ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ ఉపకార వేతనాలను ఇస్తున్నట్లు తెలిపింది. ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేయడానికి ఎటువంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేదని పేర్కొంది. 


రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్స్ దేశంలోని 21 టాప్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో ఫుల్ టైమ్ ఎన్‌రోల్ అయినట్లు తెలిపింది. వీరు ఇప్పటికే నిపుణులతో ప్రొఫెషనల్లీ ఎన్‌హాన్స్‌డ్ సెషన్స్‌లో భాగస్వాములైనట్లు వెల్లడించింది. 


ఎంపిక ప్రక్రియ 

కఠోరమైన, పోటీతత్వం నిండిన ఎంపిక ప్రకియ ద్వారా ఈ ఉపకార వేతనాల కోసం ఎంపిక జరుగుతుందని తెలిపింది. ఆన్‌లైన్ దరఖాస్తు, దేశ, విదేశీ నిపుణుల ప్యానెల్ ఇంటర్వ్యూలో ప్రతిభ కనబరచినవారిని ఎంపిక చేస్తారు. అన్ని రకాల సాంఘిక, ఆర్థిక నేపథ్యాలుగలవారు దరఖాస్తు చేయవచ్చునని వివరించింది. 


Updated Date - 2021-12-21T19:26:24+05:30 IST