రిలయన్స్‌ లాభంలో 15 శాతం క్షీణత

ABN , First Publish Date - 2020-10-31T06:58:28+05:30 IST

సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి (క్యూ2) రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) లాభం 15 శాతం క్షీణించి రూ.

రిలయన్స్‌ లాభంలో 15 శాతం క్షీణత

క్యూ2లో రూ.9,567 కోట్లకు పరిమితం 

రూ.1.2 లక్షల కోట్లకు తగ్గిన ఆదాయం

గండికొట్టిన ఇంధన విభాగ వ్యాపారం

న్యూఢిల్లీ:  సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి (క్యూ2) రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) లాభం 15 శాతం క్షీణించి రూ.9,567 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి కంపెనీ లాభం రూ.11,262 కోట్లుగా నమోదైంది. రిటైల్‌, జియో వ్యాపారాలు మెరుగైన పనితీరు కనబర్చినప్పటికీ.. రిలయన్స్‌కు కీలకమైన ఆయిల్‌ టు కెమికల్‌ (ఓ2సీ) వ్యాపారంపై ఒత్తిడి లాభాలకు గండి కొట్టింది.


గడిచిన మూడు నెలలకు గాను ఆర్‌ఐఎల్‌ మొత్తం ఆదాయం రూ.1.2 లక్షల కోట్లకు తగ్గింది. క్రితం ఏడాదిలో ఇదే సమయానికి నమోదైన రూ.1.56 లక్షల కోట్ల ఆదాయంతో పోలిస్తే భారీగా తగ్గింది. రెండో త్రైమాసికంలోనూ కరోనా సంక్షోభం కంపెనీ వ్యాపారాలపై ప్రభావం చూపిందని రిలయన్స్‌ పేర్కొంది. 


అప్పులు.. నిల్వలు

సెప్టెంబరు 30 నాటికి ఆర్‌ఐఎల్‌పై స్థూల రుణ భారం రూ.2,79,251 కోట్లు. కంపెనీ వద్దనున్న నగ దు నిల్వలు రూ.1,85,711 కోట్లు. ఈ మధ్య వాటాల విక్రయం ద్వారా లభించిన మరో రూ.30,210 కోట్లతోపాటు త్వరలో లభించనున్న రూ.73,586 కోట్లు. వాటాల విక్రయం ద్వారా సమకూరనున్న మొత్తం సొమ్ముకు నగదు నిల్వలనూ కలిపితే రిలయన్స్‌ వద్ద రుణభారం కంటే రూ.10,250 కోట్ల అదనపు నిధులున్నట్లు లెక్క. 




ఓ2సీ 

జూలై-సెప్టెంబరు కాలానికి పెట్రోకెమికల్స్‌ వ్యాపార ఆదాయం వార్షిక ప్రాతిపదికన 23 శాతం తగ్గి రూ.29,665 కోట్లకు జారుకుంది. పన్నులు చెల్లించక ముందు లాభం 33 శాతం క్షీణించి రూ.5,964 కోట్లుగా ఉంది. 

చమురు శుద్ధి వ్యాపార నిర్వహణ లాభం లేదా ఎబిటా (వడ్డీ, పన్ను, తరుగుదల మినహాయించని లాభం) 36 శాతం క్షీణించి రూ.3,002 కోట్లకు పడిపోయింది. 

గడిచిన మూడు నెలల్లో ఒక్కో పీపా ముడి చమురు శుద్ధి ద్వారా మార్జిన్‌ 5.7 డాలర్లకు పడిపోయింది. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో నమోదైన 6.3 డాలర్ల మార్జిన్‌ కంటే తగ్గింది. గత ఏడాది సెప్టెంబరు త్రైమాసికంలో రిఫైనింగ్‌ మార్జిన్‌ 9.4 డాలర్లుగా ఉంది. 




జియో

సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రిలయన్స్‌ జియో నికర లాభం మూడింతలై రూ.2,844 కోట్లకు చేరుకుంది. క్రితం ఏడాదిలో ఇదే కాలానికి ఈ విభాగ లాభం రూ.990 కోట్లు. 

గడిచిన మూడు నెలల్లో జియో ఆదాయం వార్షిక ప్రాతిపదికన 33 శాతం పెరిగి రూ.17,481 కోట్లకు ఎగబాకింది. 

సమీక్షా కాలానికి జియో నెట్‌వర్క్‌లో 73 లక్షల మంది కొత్త కస్టమర్లు చేరారు. ఒక్కో వినియోగదారుపై ఆదాయం (ఏఆర్‌పీయూ) రూ.145కు చేరుకుంది. 

జియో సహా అన్ని డిజిటల్‌ సేవలను ఒకే గూటికి చేర్చుతూ ఏర్పాటు చేసిన జియో ప్లాట్‌ఫామ్‌ స్థూల లాభం 53 శాతం వృద్ధి చెంది రూ.8,345 కోట్లుగా నమోదైంది. 




రిటైల్‌ 

సెప్టెంబరు త్రైమాసికంలో రిలయన్స్‌ రిటైల్‌ ఆదాయం రూ.39,199 కోట్లుగా నమోదైంది. నిర్వహణ లాభం లేదా ఎబిటా వార్షిక ప్రాతిపదికన 14 శాతం తగ్గి రూ.2,009 కోట్లకు పరిమితమైంది. 

సమీక్షా కాలానికి ఈ విభాగానికి చెందిన 85 శాతం రిటైల్‌ స్టోర్లు తెరిచి ఉన్నాయి. కొత్తగా 232 స్టోర్ల ప్రారంభం ద్వారా మొత్తం సంఖ్య 11,931కి చేరుకుంది. 



ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంతో పోలిస్తే గడిచిన మూడు నెలల్లో కంపెనీ పటిష్ఠమైన పనితీరు కనబర్చింది. పెట్రోకెమికల్స్‌, రిటైల్‌ వ్యాపారాలు మరింత మెరుగయ్యాయి. డిజిటల్‌ సేవల వ్యాపారం నిలకడగా వృద్ధి కనబరుస్తోంది. ఓ2సీ వ్యాపారానికి దేశీయంగా డిమాండ్‌ శరవేగంగా పుంజుకుంది.

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ సడలింపులతో రిటైల్‌ వ్యాపారం మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంది. గడిచిన ఆర్నెల్లలో జియో, రిటైల్‌ వ్యాపారాల్లో పెట్టుబడులు విక్రయం ద్వారా పలువురు వ్యూహాత్మక పెట్టుబడిదారులు రిలయన్స్‌ కుటుంబంలో భాగస్వాములయ్యారు. ప్రతి వ్యాపార విభాగంలోనూ వృద్ధికి దోహదపడే చర్యలను కొనసాగిస్తాం. 

- ముకేశ్‌ అంబానీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌, ఎండీ 



Updated Date - 2020-10-31T06:58:28+05:30 IST