రిలీవ్‌ ప్లీజ్‌..!

ABN , First Publish Date - 2022-06-27T05:36:58+05:30 IST

రిలీవ్‌ ప్లీజ్‌..!

రిలీవ్‌ ప్లీజ్‌..!

బయటకు వెళ్లడానికి సిటీ పోలీసుల ఆసక్తి

సీఐడీతో పాటు ఇతర విభాగాలకు దరఖాస్తులు

రిలీవ్‌ చేయాలని ఉన్నతాధికారులపై ఒత్తిడి


స్పెషల్‌ బ్రాంచ్‌లో పనిచేసే ఓ హెడ్‌కానిస్టేబుల్‌ సిటీలో పనిచేసిన కాలం చాలనుకున్నారు. సీఐడీలో పనిచేయడానికి ఇష్టపడుతున్నారు. దరఖాస్తు చేసుకోగానే, సీఐడీ నుంచి అనుమతి వచ్చింది. అక్కడికి వెళ్లి విధుల్లో చేరాలంటే విజయవాడలోని కమిషనరేట్‌ నుంచి రిలీవ్‌ కావాలి. దీంతో తాను సీఐడీకి వెళ్తానని, విధుల నుంచి రిలీవ్‌ చేయాలని అధికారులకు వినతిపత్రం అందజేశారు.

దక్షిణ మండలంలో పనిచేసే మహిళా ఎస్‌ఐది ఇదే పరిస్థితి. సీఐడీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అక్కడి నుంచి విల్లింగ్‌ లెటర్‌ తెచ్చుకున్నారు. తనను విజయవాడ సిటీ నుంచి రిలీవ్‌ చేయాలని అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. 

కారణాలేమైనా.. తమను రిలీవ్‌ చేసి, ఇతర శాఖలకు పంపాలని ఇటీవల పోలీస్‌ కమిషనరేట్‌కు అధిక సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. నగరంలో పనిచేసిన సిబ్బంది వేరే విభాగాలకు తమను పంపాలంటూ అధికారుల వద్ద అభ్యర్థనలు పెట్టుకుంటున్నారు.


(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : ఇప్పటి వరకు పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో విధులు నిర్వర్తించిన పోలీసులు ఇతర విభాగాలకు వెళ్లడానికి మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా నగరంలో పనిచేసింది ఇక చాలనుకుంటున్నారు. ఈ తరహా అభిప్రాయం ఎక్కువ మందిలో వ్యక్తమవుతోంది. కానిస్టేబుల్‌ నుంచి ఇన్‌స్పెక్టర్‌ వరకు ఎవరికి వారు తమ మార్గాలను ఉపయోగించుకుని ఆయా విభాగాల నుంచి అనుమతి లేఖలు రప్పించుకుంటున్నారు. తమను విజయవాడ నుంచి రిలీవ్‌ చేయాలని వస్తున్న దరఖాస్తులతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కమిషనర్‌ కార్యాలయానికి రోజుకు ఒకటో, రెండో రిలీవింగ్‌లకు సంబంధించి దరఖాస్తులు వస్తున్నాయి. ఈ విషయంలో అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. 

కారణాలివీ..

ఇంతకాలం ఇక్కడ పనిచేసిన సిబ్బంది సీఐడీ, విజిలెన్స్‌, ఏపీ ట్రాన్స్‌కోలోని విజిలెన్స్‌ విభాగాలకు వెళ్లడానికి ఇష్టపడుతున్నారు. ఇలా వెళ్లడానికి వెనుక ఆర్థికపరమైన అంశాలతో పాటు పని ఒత్తిడికి సంబంధించిన కారణాలూ ఉన్నాయి. ఈ విభాగాల్లో పనిచేస్తే వేతనం పెరుగుతుంది. ప్రస్తుతం వస్తున్న వేతనానికి అదనంగా 40 శాతం అందుతుందనేది ఓ కారణం. పని ఒత్తిడి, బదిలీలు రెండో కారణంగా ఉన్నాయి. సాధారణ ఎన్నికలు 2024లోనే జరగనున్నా, దానికి సంబంధించిన వేడి మాత్రం ఇప్పుడే మొదలైపోయింది. మరోపక్క విజయవాడలో పని ఒత్తిడి తీవ్రంగా పెరిగింది. ఓపక్క ఆందోళనలు, నిరసనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఆయా సంఘాలు ఇచ్చిన పిలుపును బట్టి అధికారులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం ఇళ్ల వద్ద ఉన్న సిబ్బందినీ రప్పిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో విశ్రాంతి దొరకడం లేదన్న ఆవేదన ఉద్యోగుల్లో కనిపిస్తోంది. ఎన్నికల సమయం దగ్గరకు వస్తే మూడేళ్లు ఒకేచోట పనిచేస్తున్న వారిని బదిలీ చేయాలి. ఇక్కడి నుంచి పొరుగు జిల్లాలకు బదిలీ చేస్తే తిరిగి మళ్లీ ఇక్కడికి రావడానికి నానా కష్టాలు పడాలి. ఈ తలనొప్పులు ఎందుకులే.. అనుకుంటున్న పోలీసులు సీఐడీ, విజిలెన్స్‌ విభాగాల్లోకి వెళ్లాలనుకుంటున్నారు. ఒకసారి ఇక్కడికి వెళ్తే ఐదేళ్ల వరకూ బదిలీ ఉండదు. ఈ కారణంగా కొందరు వాటిని ఆప్షన్లుగా తీసుకుంటున్నారు. ఇక్కడి నుంచి రిలీవ్‌ చేస్తే ఆయా విభాగాలకు వెళ్తామని అభ్యర్థులు అధికారులకు దరఖాస్తులు చేసుకున్నారు. ఇలా ఒక్కొక్కరిని ఆయా విభాగాలకు పంపిస్తే తిరిగి ఇక్కడికి మరొకరిని పంపుతారన్న నమ్మకం లేదు. ఇప్పటికే ఉన్న ఖాళీల కారణంగా మిగిలిన ఉద్యోగులపై పనిభారం పడుతోంది. ఇప్పుడు ఆప్షన్లు తీసుకుని వెళ్లిపోతే ఆ భారమూ రెట్టింపు అవుతుందని అధికారులు భావిస్తున్నారు. 

Updated Date - 2022-06-27T05:36:58+05:30 IST