సాయితేజ్ సోలోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ తన తాజా చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’ విడుదల తేదీని ప్రకటించారు. సాయి తేజ్ హీరోగా సుబ్బు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థ, జీ స్టూడియో అసోసియేషన్తో డిసెంబర్ 25న విడుదల చేస్తున్నట్లు నిర్మాత ప్రకటించారు. సాయితేజ్ మాట్లాడుతూ ‘‘గత ఎనిమిది నెలలుగా మనం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నామో అందరికీ తెలుసు. వాటన్నింటినీ మరచిపోయేలా వినోదం పంచడానికి మేం సిద్థమవుతున్నాం. అన్ని ఎమోషన్స్ ఉన్న సినిమా ఫుల్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ ఈ సినిమా’’ అని అన్నారు. నిర్మాత బీవీఎస్ఎన్ మాట్లాడుతూ ‘‘క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న సినిమాను విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. అన్నివర్గాల ప్రేక్షకుల్ని సినిమా ఆకట్టుకుంటుంది’’ అని తెలిపారు. సుబ్బు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నభా నటేశ్ కథానాయిక. తమన్ స్వరాలందించారు.