ఏఎమ్మార్పీ ఆయకట్టుకు నీటి విడుదల

ABN , First Publish Date - 2022-08-11T05:57:50+05:30 IST

ఏఎమ్మార్పీ ఆయకట్టు, నల్లగొండ పట్టణవాసుల తాగునీటి అవసరాల నిమిత్తం ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వ నుంచి ఉదయ సముద్రానికి అధికారులు బుధవారం నీటిని విడుదల చేశారు.

ఏఎమ్మార్పీ ఆయకట్టుకు నీటి విడుదల
నీటిని విడుదల చేస్తున్న అధికారులు

పెద్దఅడిశర్లపల్లి, ఆగస్టు10: ఏఎమ్మార్పీ ఆయకట్టు, నల్లగొండ పట్టణవాసుల తాగునీటి అవసరాల నిమిత్తం ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వ నుంచి ఉదయ సముద్రానికి అధికారులు బుధవారం నీటిని విడుదల చేశారు. ఉన్నతాధికారు ల ఆదేశాల మేరకు ఏఎమ్మార్పీ డీఈ నాగయ్య 500 క్యూసెక్కుల నీటిని ఉదయ సముద్రానికి విడుదల చేశారు. గురువారం నుంచి రోజుకు వెయ్యి క్యూసెక్కుల చొప్పున నీటి విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఏఎమ్మార్పీ పుట్టగండి నుంచి నాలుగు మోటర్ల ద్వారా 2400 క్యూసెక్కుల నీటిని ఏకేబీఆర్‌కు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఏకేబీఆర్‌ నుంచి ఉదయ సముద్రానికి 500 క్యూసెక్కు లు, జంటనగరాల అవసరాలకు 525 క్యూసెక్కులు, మిషన్‌ భగీరథకు 30క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వెంకటయ్య, రాము, గణేష్‌, గౌస్‌ తదితరులున్నారు. 


డీ-40 కాల్వకు నీటి విడుదల 

నల్లగొండ అర్బన్‌: ఏఎమ్మార్పీ ప్రాజెక్టు పరిధిలోని డీ-40 కాల్వకు బుధవారం నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సాగునీటిని విడదుల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాలుగు సం వత్సరాలుగా క్రమం తప్పకుండా డీ-39, డీ-40 కాల్వల ద్వారా రైతుల కు సకాలంలో నీరు విడుదల చేసినట్లు తెలిపారు. తిప్పర్తి, నల్లగొండ, కనగల్‌ మండలంలోని చెరువులు నిండడంతో భూగర్భజలాలు కూడా పెరుగుతున్నాయన్నారు. డిమాండ్‌ ఉన్న పంటలు వేసి రైతులు అధిక ఆదాయం పొందాలని సూచించారు. కార్యక్రమంలో తిప్పర్తి ఎంపీపీ నాగులవంచ విజయలక్ష్మీలింగారావు, నల్లగొండ మునిసిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి, వైస్‌ చైర్మన్‌ అబ్బగోని రమేష్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ సంపత్‌రెడ్డి ఉన్నారు. 


చెత్త డంపింగ్‌ యార్డును పరిశీలించిన ఎమ్మెల్యే

నల్లగొండ మండల పరిధిలోని చందనపల్లి గ్రామంలో ఉన్న మునిసిపల్‌ చెత్త డంపింగ్‌ యార్డును నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సందర్శించారు. చెత్త ద్వారా వ్యర్థ పదార్థాల ద్వారా వర్మి కంపోస్టు తయారీని ఎమ్మెల్యే ప్రారంభించారు.  


పుష్కరఘాట్‌ వద్దకు చేరిన కృష్ణా బ్యాక్‌ వాటర్‌ 

నేరేడుగొమ్ము:  నేరేడుగొమ్ము మండలం పెద్దమునిగల్‌లోని పుష్కరఘాట్‌ వద్దకు కృష్ణా బ్యాక్‌వాటర్‌ నీరు చేరింది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు వర్షపునీరు శ్రీశైలంలోకి చేరుకోవడంతో శ్రీశైలం గేట్లు ఎత్తి నాగార్జుసాగర్‌కు నీటివిడుదల చేస్తుండడంతో నాగార్జునసాగర్‌ బ్యాక్‌ వాటర్‌ పెద్దమునిగల్‌, కాచరాజుపల్లి పుష్కరఘాట్ల వద్దకు చేరుకుంది. దీంతో విహరయాత్రకు వచ్చే వారు కృష్ణానది ఒడ్డను చేరిన నీటిని చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  

నేడు ‘సాగర్‌’నుంచి నీటి విడుదల

సాగర్‌ ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీ స్థాయిలో వరద వస్తుండటంతో గురువారం ఉదయం 6.30 గంటలకు సాగర్‌ ప్రాజెక్టు ఎస్‌ఈ ధర్మానాయక్‌ క్రస్ట్‌ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. ఎగువనుంచి వరద రాక మూడు లక్షల క్యూసెక్కుల పైచిలుకు ఇలాగే కొనసాగితే 5 క్రస్ట్‌ గేట్లను 10 అడుగుల మేరకు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తామని ఎస్‌ఈ తెలిపారు. గతేడాది ఆగస్టు 1వ తేదీన సాగర్‌ (నాడు 586 అడుగులకు సాగర్‌ నీటిమట్టం చేరుకుంది) క్రస్ట్‌ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయగా ఈ ఏడాది 10 రోజులు ఆలస్యంగా నీటిని విడుదల చేయనున్నారు.

Updated Date - 2022-08-11T05:57:50+05:30 IST