రూ.21,930 కోట్ల రుణ ప్రణాళిక విడుదల

ABN , First Publish Date - 2022-06-24T04:49:19+05:30 IST

2022-23 ఆర్ధిక సంవత్సరానికి జిల్లాకు సంబంధించి వార్షిక రుణ

రూ.21,930 కోట్ల రుణ ప్రణాళిక విడుదల

  • పారిశ్రామిక రంగానికి అధిక కేటాయింపులు 
  • వ్యవసాయ రంగానికి రూ.5066 కోట్లు
  • సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రూ.7206కోట్లు
  • గృహ రుణాలకు రూ.1010 కోట్లు.. విద్యారంగానికి రూ. 94.5కోట్లు


2022-23 ఆర్ధిక సంవత్సరానికి జిల్లాకు సంబంధించి వార్షిక రుణ ప్రణాళికను అధికారులు విడుదల చేశారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రుణ ప్రణాళికలో వివిధ రంగాలకు కేటాయింపులు పెంచారు. వార్షిక రుణ ప్రణాళికలో పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేశారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అత్యధికంగా రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. వ్యవసాయరంగానికి  కూడా రుణాల కేటాయింపులో ప్రాధాన్యం ఇచ్చారు.


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి, జూన్‌ 23) : 2022-23 ఆర్ధిక సంవత్సరానికి సం బంధించి రూ. 21,930కోట్లతో  రూపొందించిన వార్షిక రుణ ప్రణాళికను అధికారులు విడుదల చేశారు. గత ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వార్షిక రుణ ప్రణాళికలో ఆయా రంగాలకు సుమారు రూ.5వేల కోట్లకుపైగా కేటాయింపులు పెం చారు. జిల్లా కలెక్టరేట్‌లో గురువారం జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ అధ్యక్షతన డీసీసీ, డీఎల్‌ఆర్‌సీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రూ.21,930 కోట్లతో రూపొందించిన వార్షిక రుణ ప్రణాళికను ప్రతీక్‌జైన్‌ విడుదల చేశారు. వార్షిక రుణ ప్రణాళికలో ప్రాధాన్యత రంగాలకు రూ.13,521కోట్లు కేటాయించగా ప్రాధాన్యేతర రంగాలకు రూ.8,409 కోట్లు కేటాయించారు. వార్షిక రుణ ప్రణాళికలో పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేశారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అత్యధికంగా రూ.7,206కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు కోసం రూ. 3,504.60 కోట్లు, మధ్యతరహా పరిశ్రమల కోసం 3,015 కోట్లు, సూక్ష్మతరహా పరిశ్రమల ఏర్పాటుకు రూ. 686.40 కోట్లు కేటాయించారు. అలాగే ఈఏడాది వ్యవసాయరంగానికి రూ.5066.78 కోట్ల రుణాలు కేటాయించారు. గతేడాది కంటే సుమారు రూ.1,700 కోట్లు అధికంగా రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించారు. అయితే గతఏడాది వ్యవసాయరంగానికి కేటాయించిన రుణాల్లో 76.78శాతం మాత్రమే బ్యాంకులు రుణాలు ఇవ్వడం గమనార్హం. ఈ ఏడాది వార్షిక రుణ ప్రణాళిక ప్రకారంగానైనా  బ్యాంకర్లు రైతులకు రుణాలు ఇస్తారా? అనేది అనుమానమే. వ్యవసాయరంగానికి రుణ కేటాయింపుల్లో వరిపంటకు రూ.389కోట్లు, మొక్కజొన్న పంటకు రూ.321కోట్లు, పత్తిపంటకు రూ.294కోట్లు,  జొన్నపంటకు రూ.122కోట్ల రుణాలు ఇవ్వనున్నారు. కూరగాయపంటలకు రూ.336 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇక ఈ ఏడాది గృహరుణాలు రూ. 1010.88 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. అలాగే సామాజిక మౌలికసదుపాయాల కల్పన కోసం రూ.125.60 కోట్లు కేటాయించారు.  


రైతులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి : ప్రతీక్‌జైన్‌

సన్న, చిన్నకారు రైతులతో పాటు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, కుటీర పరిశ్రమలు, చేతివృత్తుల వారిని బ్యాంకర్లు ప్రోత్సహించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ బ్యాంకర్లను ఆదేశించారు. జిల్లా వార్షిక రుణ ప్రణాళిక విడుదల చేసిన అనంతరం ప్రతీక్‌జైన్‌ మాట్లాడుతూ కొత్తగా  పంటలు వేసే రైతులు, చిన్న, సన్నకారు రైతులకు పంటరుణాలపై అవగాహన కల్పించి వారి ఆర్ధికాభివృద్ధికి తోడ్పాటునందించాలని బ్యాంకర్లకు, వ్యవసాయాఽధికారులకు సూచించారు. వీధి వ్యాపారులు, చిరువ్యాపారులకు రుణాలు అందించాలని బ్యాంకర్లను కోరారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్లో ఎంతోమంది పేదవారు ఉన్నారని బ్యాంకుల ద్వారా అమలు చేసే వివిధ పథకాల కింద సకాలంలో వారికి ఆర్ధిక సహాయం అందించినట్లయితే వారు అభివృద్ధి చెందే అవకాశం ఉందని, ఆ దిశగా బ్యాంకర్లు కృషిచేయాలన్నారు. పంటరుణాలు, వ్యవసాయకాలపరిమితి రుణాలు, అదేవిధంగా వ్యవసాయ అనుబంధరంగాలకు ఇచ్చే రుణాలు, పరిశ్రమలు, విద్యా రుణాలు, గృహ రుణాలు వంటి వాటి విషయంలో ఉదారతతో వ్యవహరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ నందకిశోర్‌,  వ్యవసాయశాఖ అధికారి గీతారెడ్డి, జిల్లా పరిషత్‌ సీఈఓ దిలీప్‌ కుమార్‌, పరిశ్రమల శాఖ అధికారి రాజేశ్వర్‌రెడ్డి, నాబార్డు అధికారులు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-24T04:49:19+05:30 IST