క్షమాభిక్షతో విముక్తి

ABN , First Publish Date - 2020-11-28T07:04:47+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రత్యేక జీవో నెం 131 ప్రకారం క్షమాభిక్షతో రాజమహేంద్రవరం మహిళా కేంద్ర కారాగారం నుంచి శుక్రవారం 19 మంది మహిళా ఖైదీలు బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టారు.

క్షమాభిక్షతో విముక్తి
రాజమహేంద్రవరం మహిళా జైలు నుంచి విడుదలై బయటకు వస్తున్న మహిళా ఖైదీలు

  • విడుదలైన 19 మహిళా ఖైదీలు
  • గర్భిణిగా వెళ్లి నాలుగేళ్ల కుమార్తెతో బయటకు
  • జైలు వద్ద ఉద్వేగ క్షణాలు

రాజమహేంద్రవరం సిటీ, నవంబరు 27: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రత్యేక జీవో నెం 131 ప్రకారం క్షమాభిక్షతో రాజమహేంద్రవరం మహిళా కేంద్ర కారాగారం నుంచి శుక్రవారం 19 మంది మహిళా ఖైదీలు బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఏళ్లతరబడి వారంతా జైలుశిక్ష అనుభవిస్తూ క్షమాభిక్ష కోసం ఎదురుచూస్తున్నారు. ఒక్కొక్కరికి 50 వేల పూచీకత్తు పత్రాల సమర్పణతో విడుదల చేశారు. రాజమహేంద్రవరం మహిళా జైలు ప్రాంగణానికి ఖైదీల కుటుంబీకులు ఉదయాన్నే చేరుకుని తమ వారి కోసం ఎదురుచూశారు. జైలు అధికారిణిలు ఖైదీల విడుదలకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేసి ఉద యం ఖైదీల భోజనాలనంతరం 11:45కు వీరిని విడుదల చేశారు. ఆ సమయంలో జైలు వద్ద ఉద్వేగభరిత వాతవరణం నెలకొంది. ఈ సందర్భంగా సెంట్రల్‌ జైలు సూపరింటిండెంట్‌ ఎస్‌ రాజారావు, మహిళా జైలు సూపరింటెండెంట్‌ కృష్ణవేణి మాట్లాడారు. ఈ ఖైదీలను జైలులో సంస్కరించామని, టైలరింగ్‌ శిక్షణ ఇచ్చామని, అలాగే చదువు మీద ఆసక్తి ఉన్నవారిని డిగ్రీ చదివించామని చెప్పారు. ఇక గత నాలుగేళ్లుగా హైమావతి అనే మహిళ జైలులో శిక్ష అనుభవిస్తోంది. ఆమెకు శిక్షపడే సమయానికి గర్భిణి. జైలులోనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. క్షమాభిక్షపై నాలుగేళ్ల కుమార్తెతో విడుదలైంది. కుమార్తె చేయిపట్టుకుని బయటకు వస్తూ తమ వారిని చూసి కన్నీటి పర్యంతమైంది.


  • ఖైదీలకు కుట్టుమిషన్లు అందజేత 


జైలు నుంచి విడుదలైన మహిళలకు త్రిదండి చినజీయర్‌స్వామి ట్రస్టు కుట్టుమిషన్లను అందించింది. వాటిని వైసీపీ సీడబ్ల్యుసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి చేతుల మీదుగా అందించారు. అలాగే వికాశ్‌ తరంగణి ఆధ్వర్యంలో చీరలు పంచారు. మరోవైపు జైలు నుంచి విడుదలైన మహిళలతో ఎంపీ భరత్‌రామ్‌ వీడియో కాల్‌లో మాట్లాడారు. విడుదలైన వారికి ఆయన తరపున నెలకు సరిపడా కిరాణా సరుకులు, చార్జీలకు రూ.500 చొప్పున అజ్జరపు వాసు, చందన నాగేశ్వర్‌లు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కేసీ సాగర్‌, మజ్జి అప్పారావు, మాజీ కార్పొరేటర్‌ మజ్జి నూకరత్నం పాల్గొన్నారు.

Updated Date - 2020-11-28T07:04:47+05:30 IST