హమ్మయ్య !

ABN , First Publish Date - 2021-12-05T06:35:10+05:30 IST

జావద్‌ తుపాను ముప్పుతో జిల్లాలోను భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయనే వాతావరణశాఖ హెచ్చరికలు అధికారులను పరుగులు తీయించాయి.

హమ్మయ్య !

జిల్లాకు తుపాను ముప్పు తప్పింది.. ఉత్తరాంధ్ర తీరం వైపు దూసుకు వచ్చిన జవాద్‌ తుపాను ఒక్కసారిగా బలహీనపడింది. దిశ మార్చుకుని కోల్‌కతా వైపు పయనించడంతో జిల్లా అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. రెండు రోజులుగా వణికిపోయిన అన్నదాతలు కొంతలోకొంత తెరిపిన పడ్డారు. తుపాను తీవ్రత జిల్లాపై అధికంగా ఉంటుందన్న హెచ్చరికలతో అధికారులు హైఅలర్ట్‌ ప్రకటించారు. శనివారం అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్న హెచ్చరికలతో అన్నిశాఖలు అప్రమత్తమయ్యాయి. తీరా తుపాను బలహీనపడిందని శనివారం సాయంత్రం సమాచారం రావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కానీ తుపాను ప్రభావంతో ఉప్పాడ వద్ద సముద్ర ఉగ్రరూపం దాల్చింది. రాకాసి అలల ధాటికి బీచ్‌రోడ్డు పలుచోట్ల ధ్వంసమైంది. 

జిల్లాకు తప్పిన తుపాను ముప్పు

ఊపిరిపీల్చుకున్న అన్నదాతలు, అధికార యంత్రాంగం

కానీ అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు పడతాయన్న వాతావరణశాఖ

తుపాను ప్రభావంతో శనివారం ఉప్పాడలో సముద్రం అల్లకల్లోలం

 కెరటాల తీవ్రతకు పలుచోట్ల బీచ్‌రోడ్డు ధ్వంసం, ఎగిరిపడ్డ రాళ్లు

 కాకినాడ పోర్టులో కొనసాగుతున్న నాలుగో నెంబర్‌ ప్రమాద హెచ్చరిక

విదేశాలకు బియ్యం ఎగుమతులు నిలిపివేత: 89 బార్జీలు పోర్టులోనే

 ముప్పు తప్పినా కలెక్టరేట్‌సహా మిగిలినచోట్ల కంట్రోల్‌రూంలు కొనసాగింపు

 కానరాని రెండు బోట్ల జాడ.. ఆచూకీ కోసం కోస్టుగార్డుకు మత్స్యశాఖ లేఖ

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

జావద్‌ తుపాను ముప్పుతో జిల్లాలోను భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయనే వాతావరణశాఖ హెచ్చరికలు అధికారులను పరుగులు తీయించాయి. 13 తీరప్రాంత మండలాల్లో గురు, శుక్రవారంలో అప్రమత్తత ప్రకటించిన రెవెన్యూశాఖ లోతట్టు ప్రాంతాల ప్రజలను 126 సురక్షిత స్థావరాలకు తరలించారు. ట్రాన్స్‌కో వెయ్యి స్తంభాలు, 250 ట్రాన్స్‌ఫార్మర్లు సిద్ధంచేసింది. ఎక్కడికక్కడ అన్ని కీలక శాఖల అధికారులకు సెలవులు రద్దుచేశారు. ముఖ్యంగా శనివారం ఉదయం నుంచి తుపాను ప్రభావం జిల్లాపై ఉంటుందని అంచనా వేశారు. అయితే అనుహ్యంగా ఇది దిశ మార్చుకుని ఒడిశా-కోల్‌కతా వైపు పయనించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తుపాను నష్టం ఏస్థాయిలో ఉంటుం దోననే బెంగ నుంచి కొంతవరకు బయటపడ్డారు. అటు అన్నదాతలు సైతం వణికిపోయారు. పంట చేతికి వచ్చే దశలో ఇప్పటికే నష్టపోగా, మళ్లీ తాజా తుపానుతో రోడ్డున పడిపోతామని ఆందోళన చెందారు. ధాన్యం తడిచిపోతాయనే భయంతో హడావుడిగా కొందరు పంటలు కోయగా, మరికొందరు నూర్పిళ్లు చేశారు. గండం దాటిపోవడంతో హమ్మయ్య అని ఊపిరిపీల్చుకున్నారు. తుపాను ముప్పు తొలగిపోయినా ఆదివారం అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోపక్క తుపాను ప్రభావంతో ఉప్పాడ వద్ద సముద్రం భయానకంగా మారింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి అలల తీవ్రత పెరిగి బీచ్‌ రోడ్డుపైకి సముద్రపు నీరు వచ్చింది. శనివారం ఉదయం ఏకంగా 100 మీటర్ల వరకు ముందుకు వచ్చింది. కొమరగిరి దాటిన తర్వాత దాదాపు ఆరు మీటర్ల ఎత్తులో కెరటాలు ఎగసిపడ్డాయి. దీనికితోడు అడ్డంగా వేసిన రక్షణగోడకు సైతం కెరటాలు తగలడంతో పెద్దపెద్ద రాళ్లు బీచ్‌రోడ్డుపై పడ్డాయి. శనివారం సాయంత్రం నాటికి నాలుగు కిలోమీటర్ల మేర బీచ్‌ రోడ్డు కెరటాల తాకిడికి ధ్వంసమైంది. పలుచోట్ల గోతులు పడ్డాయి. ఉప్పాడకు సమీపంలోని బీచ్‌రోడ్డుపై వేసిన బ్రిడ్జికి బలమైన కెరటాలు తగడంతో ఓ వైపు కొంతమేర దెబ్బతింది. దీంతో రోజంతా బీచ్‌రోడ్డులో పోలీసులు రాకపోకలను నిలిపివేశారు. అటు తుఫాను ముప్పు తొలగినా సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో కాకినాడ పోర్టులో నాలుగో ప్రమాద హెచ్చరికను ఇంకా ఉపసంహరించలేదు. శుక్రవారం రాత్రి నుంచి విదేశాలకు వెళ్లాల్సిన బియ్యం ఎగుమతులు నిలిపివేశారు. శనివారం 89 బార్జీలు బియ్యం లోడుతో నౌకల వద్దకు ప్రయాణం అయినా సముద్రంలో గాలుల తీవ్రతకు వీటిని నిలిపివేశారు. ఆది వారం ఉదయం నుంచి యథాతథంగా ఎగుమతులు కొనసాగుతాయని పోర్టు అధికారులు వివరించారు. ఇక ముప్పు తొలగినా వర్షాలు పడే అవకాశం ఉండ డంతో రెవెన్యూశాఖ అప్రమత్తతను కొనసాగిస్తోంది. తీర మండలాలు, నదీపరీవాహక ప్రాంతాల మండలాల్లో అధికారులు, ఉద్యోగులకు సెలవులు రద్దు చేసింది. కలెక్టరేట్‌, ఆర్డీవో కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూంలు కొనసాగించాలని నిర్ణయించారు. సోమవారం నుంచి మత్స్యకారులు మాత్రం యథావిథిగా సముద్రంలో వేటకు వెళ్లవచ్చని మత్స్యశాఖ ప్రకటించింది. తుపాను ముప్పుతో 2,500 బోట్లు వేట నుంచి వెనక్కురాగా, కాకినాడలోని ఉప్పలంక, పగడాలపేటకు చెందిన రెండు బోట్ల ఆచూకీ దొరక లేదు. ఇందులో 15 మంది మత్స్యకారులు ఎక్కడున్నారనేది తెలియడం లేదు. దీంతో జిల్లా మత్స్యశాఖ కాకినాడ కోస్టుగార్డు సాయం కోరింది. 




Updated Date - 2021-12-05T06:35:10+05:30 IST