పురపోరుకు పటిష్ట బందోబస్తు

ABN , First Publish Date - 2021-02-26T04:18:27+05:30 IST

మునిసిపల్‌ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు ఎస్పీ రాజకుమారి చెప్పారు.

పురపోరుకు పటిష్ట బందోబస్తు

 ఎస్పీ రాజకుమారి వెల్లడి

విజయనగరం క్రైం, ఫిబ్రవరి 25: మునిసిపల్‌ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు ఎస్పీ రాజకుమారి చెప్పారు. మునిసిపల్‌ ఎన్నికల నిర్వహణపై గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ మందిరంలో పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా  ఉండేందుకు పార్వతీపురానికి అదనపు ఎస్పీ సత్యనారాయణ రావు, సాలూరుకి ఓఎస్‌డీ చంద్రరావు, బొబ్బిలికి డీఎస్పీ మోహనరావు, విజయనగరానికి డీఎస్పీ అనిల్‌కుమార్‌, నెల్లిమర్లకు సీసీఎస్‌ డీఎస్పీ పాపారావులను ప్రత్యేక పర్యవేక్షణ అధికారులుగా నియమించామన్నారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక వార్డుల్లో డీఎస్పీలు, సీఐలు  అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. గత మునిసిపల్‌ ఎన్నికల్లో వివాదాలు జరిగిన ప్రాంతాలను, ఆయా వివాదాల్లో పాల్గొన్న నిందితులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. ప్రశాంత ఎన్నికలకు, వార్డుల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు ప్రత్యేకంగా కొద్ది మంది పోలీసు సిబ్బందిని నియమించి సమాచారం సేకరించాలన్నారు. సెక్షన్‌-30   అమలులో ఉన్నందున పోలీసుశాఖ నుంచి ముందస్తు అనుమతి లేకుండా ఎటువంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకూడదని తెలిపారు. సమావేశంలో ఏఎస్‌పీ సత్యనారాయణరావు, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.    జిల్లాలో ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో ఘర్షణలు, అల్లర్లు చోటుచేసుకోకుండా విధుల్లో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ప్రశంసాపత్రం, నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.   కరోనా వారియర్‌గా జాతీయ స్థాయి పురస్కారం అందుకున్నందుకు ఎస్పీ రాజకుమారిని జమాతే ఇస్లామీ హింద్‌ జిల్లా శాఖ మహిళా విభాగం ప్రతినిధులు సత్కరించారు. ఆమెను కలిసిన వారిలో నజామా, లీనా, షబ్నా, ఇల్మా, న్యూజహో, రోమిణి తదితరులు ఉన్నారు. 

 

Updated Date - 2021-02-26T04:18:27+05:30 IST