షరా మామూళ్లే!

ABN , First Publish Date - 2022-01-12T06:49:13+05:30 IST

జిల్లాలో ఎక్కడ చూసినా కల్తీ జోరుగా సాగుతోంది. బియ్యం మొదలు నెయ్యి, పాలు, నూనె ఇతరత్రాల్లో యథేచ్ఛగా మాయ చేస్తున్నారు.

షరా మామూళ్లే!
ఒంగోలు రాంగనర్‌లోని ఆహార తనిఖీ కార్యాలయం, ఒంగోలులో పట్టుబడిన కల్తీ నెయ్యి (ఫైల్‌)

ప్రమాదంలో ప్రజారోగ్యం 

ఆహార తనిఖీల్లో డొల్లతనం

యథేచ్ఛగా పాలు, నెయ్యి కల్తీ కేంద్రాలు

పదకొండు మండలాలకు ఒక్కరే గజిటెడ్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌

పదేళ్లలో 2,921 తనిఖీలు, 321 కేసులు

ఏసీబీకి పట్టుబడిన ఓ అధికారి 

ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కదలిక కరువు

నాణ్యత లేని ఆహారంపై చర్యలు శూన్యం

వరుసగా ఘటనలు.. అయినా స్పందించరు

గతేడాది జూలై 17న కందుకూరుకు చెందిన ఓ హోటల్‌ నిర్వాహకుడు లైసెన్స్‌ను రెన్యువల్‌ చేసుకునేందుకు ఒంగోలులోని ప్రధాన కార్యాలయానికి రాగా అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ రూ.2వేలు డిమాండ్‌ చేశారు.   బాధితుడి నుంచి డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

నాలుగు నెలల క్రితం సంతమాగులూరు మండలం కొప్పరంలోని చిల్లర వ్యాపారితోపాటు బల్లికురవలోని కొందరు వ్యాపారులను బెదిరించి ఒంగోలుకు చెందిన ఓ అధికారి రూ.10వేల చొప్పున వసూలు చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది.

ఒంగోలు బస్టాండ్‌ సమీపంలోని ఓ హోటల్‌లో భోజనం చేసిన దాదాపు 20 మందికి ఫుడ్‌ పాయిజన్‌ అయి ఆస్పత్రిపాలయ్యారు. దానిపై ఆ తర్వాత ఎటువంటి చర్యలూ లేవు.

మినీ స్టేడియం ఎదురుగా ఉన్న ఓ హోటల్‌లో కల్తీ ఆహారంపై కొందరు కస్టమర్లు రాతపూ ర్వకంగా ఫిర్యాదు చేసినా స్పందన లేదు.

ఐదునెలల క్రితం ఒంగోలు జక్రయ్య ఆసుపత్రి సెంటర్‌లో కల్తీ పాలు విక్రయిస్తున్నారని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. దాని గురించి పట్టించుకోలేదు.

ఇటీవల ఒంగోలులో నడుస్తున్న కల్తీ నెయ్యి తయారీ కేంద్రంపై పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. తయారీదారు నగరంలోని పేరున్న హోటళ్లు, స్వీట్‌ దుకాణాలకు నెయ్యి సరఫరా చేస్తున్నట్లు చెప్పడంతో  అంతా అవాక్కయ్యారు. 

ఇదీ జిల్లాలో ఆహార తనిఖీ అధికారుల తీరు. ఒంగోలులో భారీ ఎత్తున కల్తీ నెయ్యి, దర్శి, తాళ్లూరు మండలాల్లో కల్తీ పాలు తయారీ కేంద్రాలు నడుస్తుండటమే కాకుండా బహిరంగంగా అమ్మకాలు చేస్తున్నా కనీసం అటువైపు కన్నెత్తి చూడలేదంటే మామూళ్లు ఏ స్థాయిలో అందుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.

ఒంగోలు (కార్పొరేషన్‌), జనవరి 11 : జిల్లాలో ఎక్కడ చూసినా కల్తీ జోరుగా సాగుతోంది. బియ్యం మొదలు నెయ్యి, పాలు, నూనె ఇతరత్రాల్లో యథేచ్ఛగా మాయ చేస్తున్నారు. డబ్బు సంపాదనే ధ్యేయంగా అధికశాతం రెస్టారెంట్లు, టిఫిన్‌ సెంటర్లు, హోటళ్లు కనీస నాణ్యతా ప్రామాణాలు పాటించడం లేదు. ఫలితంగా ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతోంది. తక్కువ రకం నూనె, ఆహార పదార్థాలతోపాటు, పలు టిఫిన్‌ సెంటర్లలో చౌకధరల డిపోలలో లభ్యమయ్యే బియ్యాన్ని ఉపయోగించడంతో అధికశాతం ప్రజలు ఉదర సంబంధమైన వ్యాధుల బారిన పడుతున్నారు. ఇదిలా ఉండగా ఆహార కల్తీ అరికట్టాల్సిన ఫుడ్‌ ఇన్‌స్పెక్షన్‌ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. మొక్కుబడి తనిఖీలతో మమ అనిపిస్తుండపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో మునిసిపల్‌ అధికార యంత్రాంగం ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లుగా ఉండగా ప్రస్తుతం ఆహార భద్రత అధికారులకు ఆ బాధ్యతలు అప్పగించారు. దీంతో ఫిర్యాదులు వస్తే తప్ప కార్యాలయం నుంచి కాలు బయటపెట్టడం లేదు. అదనపు ఆదాయానికి అలవాటుపడి ప్రజారోగ్యాన్ని విస్మరిస్తున్నారు. నిబంధనల ప్రకారం నెలవారీగా ఏడాదిలో పన్నెండు తనిఖీలు నిర్వహించాలి. అయితే మొక్కుబడి తనిఖీలకు పరిమతమై, మామూళ్ల మత్తులో  మునిగితేలుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. 


ఫాస్ట్‌ఫుడ్‌కు పెరిగిన డిమాండ్‌ 

ప్రస్తుత రోజుల్లో అధికశాతం ఇంటి వంటను వదిలి హోటళ్ల బాటపడుతున్నారు. ఫాస్ట్‌ఫుడ్‌లు, రెస్టారెంట్లకు భారీగా వెళుతుండటంతో వీధికొక్క ఫాస్ట్‌ఫుడ్‌, రెస్టారెంట్లు, బిర్యానీ సెంటర్లు వెలుస్తున్నాయి. అదేవిధంగా కర్రీస్‌ పాయింట్లు కుప్పలుతెప్పలుగా దర్శనమిస్తున్నాయి. సాయంత్రమైతే చాలు రహదారుల్లో ఫుట్‌పాత్‌పై నూడిల్స్‌, చాట్‌బండ్లు, పుల్కా తయారీ, మొబైల్‌ టిఫిన్‌ సెంటర్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. తోపుడుబండ్లపై టిఫిన్‌ సెంటర్ల వద్దకు వచ్చేవారి సంఖ్య తక్కువేమీ కాదు. దీంతో వ్యాపారులకు ఆదాయం బాగున్నా, తిన్నవారికి మాత్రం అనారోగ్య సమస్యలు తప్పడం లేదు. కారణం వారు వాడే ఆహార పదార్థాలే. కల్తీ నూనెలు, నాసిరకం సరుకులు, తక్కువరకం కూరగాయలు వెరసి రుచి కోసం వెళితే రోగం కొనుగోలు చేయాల్సి వస్తోంది. 


చిత్తూరు జిల్లా అధికారికి ఇక్కడ ఇన్‌చార్జి బాధ్యతలు 

ఒంగోలు కేంద్రంగా నడిచే కార్యాలయంలో జిల్లా ఆహార భద్రత నియంత్రణ అధికారిగా చిత్తూరు జిల్లా అఽధికారి జి.ప్రభాకర్‌రావును, కడప, ప్రకాశం జిల్లాలకు కలిపి ఇన్‌చార్జిగా నియమించారు. అయితే మూడు జిల్లాలకు అధికారిగా బాధ్యత పెరగడంతో జిల్లాలో పూర్తిస్థాయిలో ఒంగోలు ఉండలేని పరిస్థితి.  రెండేళ్ల క్రితం ఒంగోలుకు బదిలీ అయిన గెజిటెడ్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఒక్కరే ప్రస్తుతం ఉన్నారు. మరో ముగ్గురు ఫుడ్‌ సేఫ్టీ అధికారులు ఉండగా, వారి ప్రొబెషనరీ పూర్తి కాలేదు. దీంతో గజిటెడ్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టరే తానే సీనియర్‌ అంటూ చక్రం తిపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయన పరిధిలో పదకొండు మండలాలకు సంబంధించి హోటళ్లు, రెస్టారెంట్‌లు, స్వీట్‌షాపులు, బేకరీలు ఉండగా ఆయన రూటే సప’రేటు’గా మారింది. కొత్త లైసెన్సులు మంజూరు నుంచి రెన్యువల్స్‌ వరకు, హోటల్స్‌ నుంచి రెస్టారెంట్ల వరకు ఆయన మాటే వేదం. అడిగినంత ఇచ్చుకోవాల్సిందే అని పలువురు వాపోతున్నారు. 


అడ్రస్‌ లేని ఆహార తనిఖీ ఆఫీస్‌ 

ఎవరైనా ఆహార నాణ్యత, అపరిశుభ్రతపై ఫిర్యాదు చేయాలంటే ఆహార తనిఖీ కార్యాలయం కనిపించదు. జిల్లాలో నిత్యం ఇలాంటి ఫిర్యాదులు అందుతున్నా నేరుగా ఫిర్యాదు చేయాలంటే ఆ కార్యాలయాన్ని వెతుక్కోవాల్సిందే. ఒక్కమాటలో చెప్పాలంటే మూడున్నర లక్షలకుపైగా జనాభా ఉన్న ఒంగోలులో 80శాతం మందికి ఈ కార్యాలయం ఎక్కడ ఉందో తెలియదు. దీంతో ఫిర్యాదు చేయడానికి వీలుపడక, హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార నాణ్యతలో ఇబ్బందులు ఎదురైనా ఏమీ చేయలేని పరిస్థితి. అయితే ఆహార భద్రత కార్యాలయం ఒంగోలులోని రామనగర్‌ 6వ లైనులోని ఓ నివాస గృహంలో కొనసాగుతోంది. కనీసం బోర్డు కూడా లేని ఈ కార్యాలయంలో అధికారులు చెప్పిందే ఫైనల్‌. ఇదిలా ఉంచితే అక్కడ అధికారులు కనిపించరు. కనీసం కేసులు నమోదు కావు. ప్రజలకు ఇబ్బంది లేకుండా పౌరసేవలు సక్రమంగా అందించడం కోసం కలెక్టర్‌ వివిధ మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను అందరికీ అందుబాటులోని ప్రభుత్వ కార్యాలయాల కాంప్లెక్స్‌కు మార్చారు. అయినా ఆహార తనిఖీ కార్యాలయ అధికారులు మాత్రం అక్కడకు మార్చరు. చాటుమాటు వ్యవహారాలతో అక్రమార్జనకు అనువుగా ఉండటంతో వీరి సేవలు ప్రజలకు దక్కడం లేదు. 


పదేళ్లలో కేసుల నమోదు వందల్లోనే

జిల్లాలో అధికారుల లెక్కల ప్రకారం లైసెన్స్‌ కలిగినవి 50 రైస్‌మిల్లులు, హోటళ్లు 89 వరకు ఉన్నాయి. రెస్టారెంట్‌లు 301, బేకరీలు 24, క్యాటరింగ్‌లు 29 ఉండగా లైసెన్సులు లేనివి వందల్లోనే నడుస్తున్నాయి. కానీ అధికారుల మామూళ్లు షరామామూలే. 2012 నుంచి ఇప్పటి వరకు ఽఅధికారులు 2,921 తనిఖీలు నిర్వహించగా, జేసీ కోర్టుకు చేరింది 210 మాత్రమే. ఇవి కాకుండా జిల్లా కోర్టుకు చేరినవి 111 కేసులు. పదేళ్లుగా అధికారుల తనిఖీల లెక్కలు చూస్తే ప్రజారోగ్యం కోసం ఆహార నాణ్యత విషయంలో వారు చేస్తున్న తనిఖీలు, పెడు తున్న కేసులు మొక్కుబడిగానే కనిపిస్తున్నాయి. జనం మాత్రం  గ్యాస్‌ ట్రబుల్‌, కడుపునొప్పి, కడుపులో మంట, పేగు, పూత వంటి వ్యాధులు బారిన పడుతున్నారు. ఇటీవల ఇలాంటి  కేసులే అధికంగా కనిపిస్తున్నాయి.  




Updated Date - 2022-01-12T06:49:13+05:30 IST