కొల్లేరు.. కన్నీళ్లు..!

ABN , First Publish Date - 2021-11-28T05:20:07+05:30 IST

మంచినీటి సరస్సు కొల్లేరు.. ఉప్పు మయం కాకుండా చాన్నాళ్ల క్రితమే రెగ్యులేటర్ల ప్రతిపాదన చేశారు. కొల్లేరు సరస్సుకు పూర్వ వైభవం వచ్చేలా ఓ వైపు టూరిజం, మరోవైపు రెగ్యులేటర్ల నిర్మాణాన్ని తెరముందుకు తెచ్చారు.

కొల్లేరు.. కన్నీళ్లు..!
ఉప్పుటేరు సముద్రంలో కలిసే ప్రాంతం

తేలని మూడు రెగ్యులరేటర్ల హామీ

పరిశీలనలు.. నివేదికలు.. సమీక్షలతోనే సరి

రూ.230 కోట్లతో పర్యాటకాభివృద్ధి అన్నారు..

మాటలకే పరిమితమైన జగన్‌ సర్కార్‌

నోరు మెదపని ఎమ్మెల్యేలు.. మంత్రులు

ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు

ఇదీ ఉనికి కోల్పోతున్న మంచినీటి సరస్సు కథ


కొల్లేరు.. ఆసియాలోనే పేరెన్నికగన్న మంచినీటి సరస్సు. ఆక్రమణలు, దురాక్రమణలు, కాలుష్యం కారణంగా సరస్సు ఉనికి కోల్పోయే పరిస్థితుల్లో సుప్రీం సాధికారిక కమిటీ జోక్యం చేసుకుంది. 65 వేల ఎకరాల్లో ఆక్రమణలు తొలిగాయి. కొల్లేరు టూరిజం తెర ముందుకు వచ్చింది. జగన్‌ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలో ‘ఇక సరస్సు ఉప్పు నీటిమయ మయ్యే ప్రశ్నే లేదు. సరస్సు, పరివాహక ప్రాంతాల రైతులను, మత్స్యకారులను ఆదుకుంటాం. సరస్సు పరిరక్షణకు చర్యలు తీసుకుంటూనే మూడు రెగ్యులేటర్లను కడతామంటూ’ మంత్రి వర్గం సాక్షిగా హామీ ఇచ్చినా.. కాలుష్యం తొలగలేదు. ఉప్పు నీటి సాంద్రత తగ్గనూ లేదు. రెగ్యులేటర్ల నిర్మాణానికి చిల్లి గవ్వ ఇవ్వలేదు. మరి కొల్లేరుకు పట్టిన గ్రహణం ఎప్పుడు వదిలేనో..?


(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

మంచినీటి సరస్సు కొల్లేరు.. ఉప్పు మయం కాకుండా చాన్నాళ్ల క్రితమే రెగ్యులేటర్ల ప్రతిపాదన చేశారు. కొల్లేరు సరస్సుకు పూర్వ వైభవం వచ్చేలా ఓ వైపు టూరిజం, మరోవైపు రెగ్యులేటర్ల నిర్మాణాన్ని తెరముందుకు తెచ్చారు. రెండున్నరేళ్ల క్రితం రాష్ట్ర మంత్రి వర్గం కూడా కొల్లేరు పరిరక్షణకు వీలుగా తీర్మానం ఆమోదించింది. ఉప్పుటేరుపై మూడుచోట్ల రెగ్యులేటర్ల నిర్మాణానికి తలూపింది. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ మేరకు ప్రభుత్వాన్ని ఒప్పించారు. కొల్లేటి సరస్సునే నమ్ముకుని వున్న మత్స్యకారులు తమకూ మంచి రోజులు వచ్చినట్టే అనుకున్నారు. 2019 ఆగస్టులోనే కొల్లేరు రెగ్యులేటర్ల ప్రతిపాదన తెరముందుకు తెచ్చారు. మంత్రి ఆళ్ల నాని, ఎమ్మెల్యేలు అబ్బాయిచౌదరి, గ్రంధి శ్రీనివాస్‌, దూలం నాగేశ్వరరావు, జోగి రమేష్‌ సీఎం జగన్‌ను కలిశారు. ‘కొల్లేరు అంతం కాకుండా చూడాలంటే రెగ్యులేటర్లు ఒకటే శరణ్యం. గత ప్రభుత్వం ఇది ఎలాగూ చేయలేదు. మన ప్రభుత్వమైనా మూడుచోట్ల రెగ్యులేటర్లు నిర్మిస్తే తిరుగుండదు’ అంటూ విన్నవించారు. వీటిని ఆలకించిన సీఎం ఆనాడే రెగ్యులేటర్ల నిర్మాణానికి వీలుగా నిపుణులు సైతం ఆయా ప్రాంతాలకు వెళ్లి చూసి, చర్యలకు దిగాలని ఆదేశించారు. ఆ తరువాత వీలు చిక్కినప్పుడల్లా కొల్లేరుపై అడపాదడపా సమీక్షలు నిర్వహించడమే తప్ప కార్యరూపం లోకి తీసుకు రాలేకపోయారు. కొల్లేరులో ఉప్పుటేరు ముఖద్వారం, ఉప్పుటేరు సముద్రంలో కలిసే కృత్తివెన్ను మండలం పడతడిక వద్ద స్ట్ర్టెయిట్‌ కట్‌ ప్రాంతం, పెదలంక డ్రెయిన్‌పై రెగ్యులేటర్ల నిర్మాణానికి వీలుగా ప్రతిపాదించారు. నిపుణులు సైతం ఆయా ప్రాంతాలను సందర్శించారు. ప్రభుత్వానికి నివేదించారు. కొల్లేరు పరిరక్షణ, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల సరిహద్దు తీర ప్రాంత డెల్టా భూములకు ఉప్పు నీటి ముంపు తొలగించేందుకు రెగ్యులేటర్ల నిర్మాణం ఒక్కటే శరణ్యమని చెప్పారు. రెండేళ్ల వ్యవధిలో ఈ రెగ్యులేటర్ల నిర్మాణ సాధ్యాసాధ్యాలను వివరిస్తూనే తగిన వనరులు సమకూర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. అసలు రెగ్యులేటర్ల నిర్మాణానికి సంబంధించి దివం గత సీఎం రాజశేఖరరెడ్డి హయాంలోనే ఆమోదం తెలిపారు. అప్పట్లో ప్రభుత్వం స్పందించింది. అధికారులు కదిలారు. రూ.60 కోట్లతో అడుగు ముందుకే అన్నట్టు హడావుడి చేశారు. ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం రెగ్యు లేటర్ల నిర్మాణం, నిపుణుల సలహాలు, రైతుల డిమాండ్లు అంటూ పదేపదే నివేదికలు రాబడుతూనే వచ్చింది. ఇప్పటి ప్రభుత్వ హయాంలో ఆకివీడు జూకనుమ ప్రాంతాన్ని సందర్శించి ఇక్కడ రెగ్యులేటర్‌ నిర్మిస్తే ఎలా ఉంటుందనే దానిపై కొందరి నుంచి అభిప్రాయాలను సేకరించింది. ఇక్కడ రెగ్యులేటర్‌ నిర్మాణంపై భిన్నాభిప్రాయం బయటపడింది. జూకనుమ దగ్గర నిర్మిస్తే కొల్లేరు ముంపు కాస్తా ఆకివీడును ముట్టడిస్తుందనే భయం లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే స్థానిక ప్రజా ప్రతినిధులంతా రెగ్యులేటర్‌ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. రెగ్యులేటర్‌ను జాతీయ రహదారికి, రైలు వంతెనకు మధ్యలో నిర్మిస్తే బాగుంటుందంటూ కైక లూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. దీనిని దిగువకు మార్చాలని ఉండి ఎమ్మెల్యే రామరాజు తేల్చేశారు. ఇలా రెగ్యులేటర్‌ నిర్మాణం రకరకాల మలుపులు తిరుగుతూ అభ్యంతరాల సుడిలో అక్కడక్కడ ముందుకు సాగకుండానే ఆగిపోయింది.


అసలు ఇంతకీ వివాదం ఏమిటి ?

రెగ్యులేటర్ల నిర్మాణానికి సంబంధించి మూడుచోట్ల ప్రతిపాదనలు వచ్చినప్పటికీ అడుగు ముందుకు పడలేదు. కృష్ణా జిల్లాలో స్ట్రెయిట్‌ కట్‌ ముఖ ద్వారం వద్ద సమీపంలోని సీమోత్‌కు చేరువగా వున్న పడతడిక గ్రామ ప్రాంతాలను అప్పట్లోనే పరిశీలించారు. దీంతో ఎక్కడ నిర్మాణం చేస్తే అందరికీ అనువుగా ఉంటుందనే దానిపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.ఈ మధ్యనే సీఎం కార్యాలయ కార్యదర్శులు ముత్యాలరాజు, ధనుంజయరెడ్డి ,ఎంపీ కోటగిరి శ్రీధర్‌, ఎమ్మెల్యేలు దూలం నాగేశ్వరరావు, అబ్బాయిచౌదరితో భేటీ అయ్యారు. పరిస్థితిని సమీక్షించారు. రెగ్యులేటర్ల నిర్మాణం జరగబోతుందంటూ మళ్లీ ప్రచారం ఊపందుకుంది. కాని ఇప్పుడున్న పరిస్థితుల్లో రెగ్యులేటర్ల నిర్మాణంకు నిధులు కేటాయించే సత్తా ప్రభుత్వానికి ఉందా అనేది అందరి నోట వినిపిస్తున్న ప్రశ్న. రెగ్యులేటర్ల నిర్మాణం ఎలా సాధ్యమవు తుందో దేవుడికెరుక. టూరిజం అంటూ రూ.230 కోట్లతో పర్యాటకులను ఆకర్షించేలా ధూంధాం చేద్దామని పర్యాటక మంత్రి ప్రకటించారు. తట్టెడు మట్టి ఎత్తలేదు. అంగుళం స్థలం నిర్మాణం జరగలేదు. అంతటా మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు మాత్రం ఎక్కడికక్కడే!.



Updated Date - 2021-11-28T05:20:07+05:30 IST