ఉప్పుటేరుపై రెగ్యులేటర్ల నిర్మాణం సాగేనా..?

ABN , First Publish Date - 2022-09-21T05:36:22+05:30 IST

ఉప్పుటేరుపై రెగ్యులేటర్ల ఏర్పాటు కలగా మారుతోంది.

ఉప్పుటేరుపై రెగ్యులేటర్ల నిర్మాణం సాగేనా..?

కొలిక్కిరాని నిర్మాణాలు.. స్పందించని కాంట్రాక్టర్లు 

కొత్త ప్రతిపాదనలతో మళ్లీ ప్రభుత్వం వద్దకు ఫైల్‌

ఆమోదిస్తేనే మళ్లీ టెండర్లు.. ఏం జరిగేనో..?


(భీమవరం–ఆంధ్రజ్యోతి)

ఉప్పుటేరుపై రెగ్యులేటర్ల ఏర్పాటు కలగా మారుతోంది. కొల్లేరు, యనమదుర్రు డ్రెయిన్‌లకు ఉప్పు నీరు ఎగదన్నకుండా  ఉప్పుటేరుపై మూడుచోట్ల రెగ్యులేటర్‌లు నిర్మించాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. గత ఏడాది ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రెండు పర్యాయాలు టెండర్లు పిలిచింది. కానీ, కాంట్రాక్టర్‌లు ముఖం చాటేశారు. రెగ్యులేటర్‌ల నిర్మాణంలో ప్రభుత్వ హడావుడి నీరుగారి పోయింది. గతంలో మూడు రెగ్యులేటర్‌లకు రూ.420 కోట్లతో అంచనాలు రూపొందించారు. ఏడాది గడిచిపోవడంతో కొత్త ధరలు అమలులోకి వచ్చాయి. దీనికనుగుణంగా ఇప్పుడు మళ్లీ ప్రతిపాదనలు రూపొందించారు. సుమారు రూ.460 కోట్లతో కొత్త ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ప్రభుత్వ ఆమోదానికి వాటిని పంపారు. అంటే కథ మళ్లీ మొదటికొచ్చింది. ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాతే మళ్లీ టెండర్‌లు పిలవనున్నారు. అప్పుడు కాంట్రాక్టర్‌లు స్పందిస్తేనే పనులు నిర్వహించేందుకు అవకాశం ఉంటుంది. డెల్టా ప్రజలు దశాబ్దాలుగా కలలు కంటున్న రెగ్యులేటర్‌ల నిర్మాణం నెరవేరనుంది. 


పాపం ప్రభుత్వానిదే

రెగ్యులేటర్‌ల నిర్మాణానికి కాంట్రాక్టర్‌లు ముందుకు రాకపోవడానికి ప్రభుత్వమే తప్పిదమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. నీటిపారుదల శాఖలో బిల్లులు చెల్లించడం లేదు. రైతులు చెల్లించే నీటి తీరువాతో చేపట్టే పనులకు బిల్లులు పెండింగ్‌లో పెట్టింది. గడచిన మూడేళ్ల నుంచి బిల్లులు మంజూరు కావడం లేదు. అదే ఇప్పుడు నీటి పారుదల శాఖకు శాపంగా మారిపోయింది. కాంట్రాక్టర్‌లు అటు వైపు కన్నెత్తి చూడడం లేదు. వేసవి పనులు నిర్వ హించేందుకు అధికారులు నానా తంటాలు పడుతున్నారు. పూడిక తీసే పనులు నిర్వహించేందుకు కాంట్రాక్టర్‌లు ఆసక్తి చూపడంలేదు. గడచిన వేసవిలో చేయాల్సిన పనులను ఇప్పటికీ నిర్వహిస్తున్నారంటే నీటిపారుదల శాఖ దుస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. వేసవి పనులకు ఏటా ఇదే పరిస్థితి ఎదురవుతోంది. వేసవి వచ్చిందంటే అధికారులు హడలిపోతున్నారు. డ్రెయినేజీ, సాగు నీటిశాఖల పరిధిలో రూ.20 కోట్ల విలువైన పనులు చేయించలేని నిస్సహాయ స్థితిని ఎదుర్కొంటున్నారు.  


కొత్త ప్రతిపాదనల్లేవ్‌

నీటిపారుదల శాఖలో కొత్త ప్రతిపాదనలు లేవు. డెల్టా ఆధునికీకరణ కొండెక్కింది. రెండేళ్ల క్రితం రూ.250 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వా నికి పంపారు. ఉమ్మడి పశ్చిమ గోదావరిలో ఆధుని కీకరణ పనులు పూర్తయ్యేలా పంపిన ప్రతిపాద నలను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం మొగ్గలోనే తుంచేసింది. సాంకేతిక కొర్రీలు పెట్టి ప్రతిపాదనలను తిప్పి పంపింది. అప్పటి నుంచి ఆధునికీకరణపై కొత్తగా ప్రతిపాదనలు చేయడం లేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే తప్ప పంపే పరిస్థితి కనిపిం చడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపుతున్న రెగ్యులేటర్ల నిర్మాణానికి కాంట్రాక్టర్‌లు స్పందించడం లేదు. దీంతో కొత్త ధరలతో మరోసారి ప్రతిపాదనలు చేశారు. అంతకుమించి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నీటి పారుదల శాఖ కొత్త ప్రతిపాదనలు చేసే సాహసం చేయలేకపోతోంది.

Updated Date - 2022-09-21T05:36:22+05:30 IST