మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ అధికారులకు సీఎం ఆదేశాలు
హైదరాబాద్, జూలై 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టు సూపర్వైజర్లకు శుభవార్త. 143 కాంట్రాక్టు సూపర్వైజర్ పోస్టుల్ని ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. క్రమబద్ధీకరణకు సంబంధించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిని సీఎం ఆదేశించారు. కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వారిని రెగ్యులరైజ్ చేయాలని రాష్ట్ర హైకోర్టు కూడా ఇదివరకే ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాల నేపథ్యంలో సూపర్వైజర్ల క్రమబద్ధీకరణకు సంబంధించిన ప్రతిపాదనల్ని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి పంపించారు. ఫైల్ పరిశీలించిన సీఎం క్రమబద్ధీకరణకు ఉత్తర్వులు జారీ చేశారు. తమను క్రమబద్ధీకరించినందుకు కాంట్రాక్టు సూపర్వైజర్లు బుధవారం సాయంత్రం మంత్రి సత్యవతి రాథోడ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, కోర్టు ఆదేశాల తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు సంబంధించి సీఎం వద్దకు వెళ్లిన తొలి ఫైల్ ఇదేనని అధికారులు చెబుతున్నారు. 2003, 2006 సంవత్సరాల్లో రెండు దఫాల్లో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో సుమారు 150 కాంట్రాక్ట్ సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేశారు.
సూపర్వైజర్లు తమ పోస్టుల రెగ్యులరైజేషన్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి, ఉన్నతాధికారులను కలిసి విన్నవిస్తూనే ఉన్నారు. ఎట్టకేలక ు వారి నిరీక్షణకు తెరపడింది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఆయా ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు, లెక్చరర్లను క్రమబద్ధీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2016లో జీవో నంబరు 16 జారీ చేసింది. 2014, జూన్ 2వ తేదీకి ముందు పూర్తిస్థాయి కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై అభ్యంతరం తెలుపుతూ కొందరు కోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం న్యాయస్థానం ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధిస్తూ కాంట్రాక్ట్ సిబ్బంది క్రమబద్ధీకరణకు ఉత్తర్వులు జారీ చేసింది.
గ్రేడ్-2 సూపర్వైజర్ పోస్టులకు లైన్ క్లియర్..
మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అంగన్వాడీ కేంద్రాల్లో గ్రేడ్-2 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి జనవరి 2న ప్రవేశ పరీక్ష నిర్వహించింది. 433 పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షకు 16815 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ప్రస్తుతం ఆయా జిల్లాల్లో ధ్రువపత్రాల పరిశీలన కొనసాగుతోంది. కాంట్రాక్ట్ సూపర్వైజర్ పోస్టులకు సంబంధించిన అంశం కొలిక్కి రాకపోడంతో ఇప్పటి వరకు కొత్తవారి నియామకంలో జాప్యం జరుగుతూ వచ్చింది. క్రమబద్ధీకరణకు ప్రభుత్వ ఆమోదం లభించిన నేపథ్యంలో కొత్త పోస్టుల భర్తీకి మార్గం సుగమం అయింది.