‘క్రమబద్ధీకరణ’కు రెవెన్యూ అధికారులు వద్దు!

ABN , First Publish Date - 2022-05-26T10:57:07+05:30 IST

హైదరాబాద్‌, మే 25 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూ శాఖపై, ఆ శాఖలోని ఉద్యోగులపై సాక్షాత్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, భూపరిపాలన ప్రధాన కమిషనర్‌

‘క్రమబద్ధీకరణ’కు రెవెన్యూ అధికారులు వద్దు!

-ఇతర శాఖల అధికారులకే బాధ్యతలు

-జిల్లా కలెక్టర్లకు సీసీఎల్‌ఏ ఆదేశాలు

-యాప్‌ సహాయంతో దరఖాస్తుల పరిశీలన

హైదరాబాద్‌, మే 25 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూ శాఖపై, ఆ శాఖలోని ఉద్యోగులపై సాక్షాత్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ)కు నమ్మకం పోయిందా...? ఆ శాఖలో తప్ప మిగతా శాఖల్లోని అధికారులే వారికి సమర్థులుగా, నిజాయతీపరులుగా కనిపిస్తున్నారా...? భూముల క్రమబద్ధీకరణ విషయంలో ఆయా ఉన్నతాధికారుల నిర్ణయాలను పరిశీలిస్తే వీటికి అవుననే సమాధానం వస్తుంది. ప్రభుత్వ భూములను ఉచితంగా, నామమాత్రపు విలువతో క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం 58, 59 జీవోలను తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ జీవోల కింద వచ్చిన దరఖాస్తుల పరిశీలనకు బృందాలను ఏర్పాటుచేయాలని సీసీఎల్‌ఏ, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అదనపు బాధ్యతలు చూస్తున్న సోమేశ్‌ కుమార్‌ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అయితే ఈ బృందాలకు సారథులను నియమించే విషయంలో రెవెన్యూ శాఖతో సంబంఽధం లేనివారికే ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. దాంతో పలు జిల్లాల్లో రెవెన్యూయేతర అధికారులనే సారథులుగా  నియమించారు. హైదరాబాద్‌కు పొరుగున ఉన్న ఓ జిల్లాలో 27 బృందాలను ఏర్పాటు చేస్తే... వాటి లీడర్లలో 19 మంది రెవెన్యూ శాఖతో సంబంధం లేని అధికారులే ఉన్నారు. వీరంతా దరఖాస్తుల వెరిఫికేషన్‌ ప్రక్రియను ప్రారంభించారు. ఈ బృందాల్లో డిప్యూటీ తహసీల్దార్లతోపాటు సర్వేయర్‌లను కూడా నియమించారు. దరఖాస్తుల పరిశీలనకు సీసీఎల్‌ఏ కార్యాలయం ప్రత్యేకంగా ఒక యాప్‌ను తయారుచేసింది. ఈ యాప్‌లో టీమ్‌ లీడర్లు, అందులోని సభ్యుల ఫోన్‌ నెంబర్లను నమోదుచేస్తారు. వీళ్లు మండలం వివరాలు, గ్రామం, ఐడీ వివరాలు ఎంటర్‌ చేస్తే చాలు... ఆటోమేటిగ్గా దరఖాస్తులన్నీ వారి లాగిన్‌లోకి వెళ్తాయి. రెండు జీవోల కింద వచ్చిన దరఖాస్తులనూ ఏకకాలంలో పరిశీలిస్తారు.

జీవో 58 దరఖాస్తుల పరిశీలన ఇలా...

దరఖాస్తుదారుల ఆదాయ పరిస్థితిని... అంటే దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారా, ఎగువన ఉన్నారా అనేది చూస్తారు. ప్రభుత్వ ఉద్యోగులా, ఇతరులా అనేది పరిశీలిస్తారు. భూమి ఏ క్యాటగిరీ (ప్రభుత్వ అభ్యంతరాల్లేని లేదా అభ్యంతరాలున్న భూమి, మిగులు భూమి, ఇతర శాఖలకు చెందిన భూమి) కిందకు వస్తుందో తేలుస్తారు. అలాగే సదరు భూమి ఖాళీగా ఉందా, నిర్మాణంలో ఉందా అనేది నిర్థారించుకుంటారు. అదేవిధంగా భూమి ఎప్పటి నుంచి కబ్జాలో ఉంది, దానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా, కోర్టు కేసులేమైనా ఉన్నాయా వంటి విషయాలను పరిశీలిస్తారు. వీటన్నిటి ఆధారంగా క్రమబద్ధీకరణపై నిర్ణయం తీసుకుంటారు. దరఖాస్తుదారులు దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్నా, భూమి 125 గజాల కంటే ఎక్కువగా ఉన్నా... దరఖాస్తును జీవో 59 కిందికి కన్వర్ట్‌ చేస్తారు.

జీవో 59 దరఖాస్తుల వెరిఫికేషన్‌...

మొదటగా దరఖాస్తుదారులు నోటిఫైడ్‌ మురికివాడలో ఉన్నారా లేదా అనేది పరిశీలిస్తారు. తర్వాత జీవో 58 మాదిరిగానే భూమి ఏ క్యాటగిరీ కిందకు వస్తుందో చూస్తారు. అదేవిధంగా... నిర్మాణ స్వభావం, మొత్తం విస్తీర్ణం ఎంత, నిర్మాణం ఎంత విస్తీర్ణంలో ఉంది, కబ్జాలో ఉన్న ఖాళీ స్థలం ఎంత. వంటి అంశాలను నిర్థారిస్తారు. సంబంధిత ఫోటోలను కూడా చెక్‌ చేస్తారు. ఇవన్నీ పరిశీలించాక... అభ్యంతరాలు ఉన్న భూమిగా తేలితే సదరు దరఖాస్తును తిరస్కరిస్తారు. అలాగే... భూమి విలువ ఎక్కువగా ఉన్నా, నిర్మాణం లేకున్నా, భూమి కబ్జాలో ఉన్నట్లు తగిన పత్రాలు లేకున్నా దరఖాస్తులను తిరస్కరిస్తారు. ఈ నిబంధన రెండు జీవోలకు వర్తిస్తుంది.


Updated Date - 2022-05-26T10:57:07+05:30 IST