తిరోగమన చర్య

ABN , First Publish Date - 2022-06-28T06:21:10+05:30 IST

అబార్షన్ హక్కులకు సంబంధించి అమెరికా సుప్రీంకోర్టు ఇటీవల ప్రకటించిన తీర్పు మరిన్ని దేశాలను ప్రభావితం చేసే ప్రమాదం ఉన్నదని చాలామంది భయం...

తిరోగమన చర్య

అబార్షన్ హక్కులకు సంబంధించి అమెరికా సుప్రీంకోర్టు ఇటీవల ప్రకటించిన తీర్పు మరిన్ని దేశాలను ప్రభావితం చేసే ప్రమాదం ఉన్నదని చాలామంది భయం. దాదాపు యాభైయేళ్ళుగా అమలులో ఉన్న అబార్షన్ హక్కులకు రాజ్యాంగపరమైన రక్షణలేమీ లేవని తేల్చేసింది ఈ తీర్పు. రాజ్యాంగం అబార్షన్ హక్కును ఇవ్వలేదనీ, దానికి సంబంధించి నిర్ణయాలు చేసే అధికారం ప్రజాప్రతినిధులకు ఉన్నదని సుప్రీంకోర్టు ప్రకటించి, అమెరికన్ మహిళలకు అబార్షన్ హక్కును కల్పించిన 1973నాటి  చరిత్రాత్మక రో వర్సెస్ వీడ్ కేసులో తీర్పును కొట్టివేసింది. ఈ తీర్పును సమర్థించిన 1992నాటి కేసీ తీర్పుపై కూడా సర్వోన్నత న్యాయస్థానం వ్యతిరేక అభిప్రాయాన్ని ప్రకటించడంతో అమెరికాలోని ప్రతీ మహిళా తన శరీరంపైనా, పునరుత్పత్తిపైనా హక్కులను కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడింది. 


హక్కుల పరిరక్షణ విషయంలో అన్ని దేశాలకంటే ముందుందే అమెరికాలో ఇలా జరగడమేమిటని న్యాయనిపుణులు సైతం ఆశ్చర్యపోతున్నారు. రాజ్యాంగం దఖలు పరిచిందన్న ఓ హక్కును యాభైయేళ్ళు అనుభవించి ఇప్పుడు దానిని కాదనుకోవడం వల్ల ఈ ప్రజాస్వామ్య దేశానికి అదనంగా ఒనగూరే మేలు ఏమిటో తెలియదు. రిపబ్లికన్ల ఆధిపత్యంలో ఉన్న న్యాయస్థానం తన రహస్య ఎజెండాను సాధించిందనీ, పునరుత్పత్తి విషయంలో ఈ దేశ మహిళలకు ఉన్న హక్కులను లాక్కుందని అధికారపక్షనాయకులు మండిపడుతున్నారు. ఈ ఒక్క తీర్పుతో నూటయభైయేళ్ళ వెనక్కుపోయామనీ, అభివృద్ధిచెందిన దేశాల జాబితానుంచి అమెరికా తొలిగిపోయిందనీ అధ్యక్షుడు జో బైడెన్ ఆవేదనతో వ్యాఖ్యానించారు. అ యాభైయేళ్ళక్రితం ఒక నిరుద్యోగ, అవివాహిత మహిళ టెక్సస్‌లో అబార్షన్ కోసం ప్రయత్నించి, చట్టాలు ఒప్పుకోకపోవడంతో మూడేళ్ళపాటు సర్వోన్నత న్యాయస్థానంలో పోరాడి సాధించుకున్న హక్కు ఇది. అప్పట్లో నాలుగు రాష్ట్రాల్లో మాత్రమే గర్భస్రావానికి అనుమతి ఉండి, దాదాపు ముప్పై రాష్ట్రాల్లో నిషేధమే ఉన్నందున ఈ కేసులో సుప్రీంకోర్టు అబార్షన్‌ను రాజ్యాంగబద్ధమైన హక్కుగా వ్యాఖ్యానించడంతో రాష్ట్రాల వేర్వేరు రకాల చట్టాలన్నీ వెనక్కుపోయాయి. తల్లీబిడ్డల ఆరోగ్యం దృష్ట్యా ఏవో కొన్ని నియంత్రణలు పెట్టే అధికారం మాత్రమే వాటికి మిగిలింది. ఈ తీర్పుతో వ్యవహారం మళ్ళీ మొదటికి వచ్చినట్టయింది. నాలుగేళ్ళక్రితం రిపబ్లికన్ల చేతిలో ఉన్న మిసిసిపి రాష్ట్రం గర్భం దాల్చిన 15వారాల తరువాత మహిళలకు గర్భస్రావం హక్కులేదని చట్టం చేయడం నుంచి ఇప్పుడు ఏకంగా రాజ్యాంగహక్కే లేదని ప్రకటించడం వరకూ రిపబ్లికన్ల ప్రణాళికాబద్ధమైన కుట్ర ఉన్నదని ఆరోపణ. నవంబరులో జరిగే మధ్యంతర ఎన్నికలపై ఈ తీర్పు ప్రభావం ఉండబోతున్నదనీ అంటున్నారు.


ఇప్పుడు రాష్ట్రాలకు అబార్షన్‌పై ఏ నిర్ణయమైనా తీసుకొనే హక్కు దఖలుపడటంతో, ఈ తీర్పు వెలువడగానే కొన్ని రాష్ట్రాలు దానిని నిషేధిస్తున్నట్టు ప్రకటించాయి. అమెరికాలో సగానికిపైగా రాష్ట్రాలు ఇదే దారిలో నడుస్తాయనీ, మరికొన్ని తీవ్రమైన ఆంక్షలు విధిస్తాయని అంటున్నారు. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిమితుల కారణంగా ఏటా వేలాదిమంది మహిళలు అబార్షన్లు చేయించుకోలేకపోతున్నారని మహిళా హక్కుల సంస్థలు అంటున్నాయి. ఈ తీర్పు తరువాత అమెరికాలోని కొన్ని పెద్ద కంపెనీలు ఇతర రాష్ట్రాలకు పోయి అబార్షన్ చేయించుకొనే తమ ఉద్యోగుల శ్రేయస్సు పట్టించుకుంటామని ప్రకటించాయి. నిజానికి, యాభైయేళ్ళనాటి రో వెర్సస్ వేడ్ తీర్పు దేశం మొత్తానికి వర్తించే సమాఖ్యచట్టంగా మారలేదు. రాజకీయాంశంగా మారిన నేపథ్యంలో ఇప్పటి తీర్పు మీద కూడా సెనేట్ ఏకాభిప్రాయాన్ని సాధిస్తుందని అనుకోలేం. 


నియంత్రణలేని అబార్షన్లు మహిళల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నమాట నిజమే కానీ, పేదలు, మరీ ముఖ్యంగా నల్లజాతిమహిళలపై ఈ తీర్పు ప్రభావం చాలా ఉంటుంది. ప్రసూతిమరణాల రేటు అమెరికాలో అత్యధికం. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో గర్భవిచ్ఛిత్తి చట్టబద్ధంగా జరగనందున, ఇకపై వాటిసంఖ్య మరింత పెరిగి మహిళల ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశమూ ఉన్నది. ప్రమాదవశాత్తూ గర్భస్రావం జరిగిపోయిందని అబద్ధాలు చెప్పడం, దానితో కేసులూ శిక్షలూ ఎదుర్కోవలసి రావడం, విధిలేక బిడ్డలకు జన్మనివ్వడం, వారిని వదిలించుకోవడం వంటివి అనేకం రాబోయే రోజుల్లో చూడవలసి రావచ్చు. ఆపరేషన్ల ద్వారా కంటే మాత్రలతో అత్యధిక అబార్షన్లు జరిగిపోయే అమెరికాలో వాటిని నిషేధించిన పక్షంలో ఆ స్థానంలో ప్రమాదకరమైన ఇతర రసాయనాల వినియోగం పెరిగే అవకాశం ఉంది.

Updated Date - 2022-06-28T06:21:10+05:30 IST