రిజిస్ట్రేషన్స్‌ రాబడి తగ్గింది!

ABN , First Publish Date - 2020-06-03T10:09:18+05:30 IST

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం గణనీయంగా తగ్గింది. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా కొత్త ఆర్థిక సంవత్సరం ..

రిజిస్ట్రేషన్స్‌ రాబడి తగ్గింది!

ఆదాయంపై కరోనా దెబ్బ

ఏప్రిల్‌లో నిల్‌, మే నెలలో రూ.19 కోట్లు మాత్రమే రాక

గత ఆర్థిక సంవత్సరం మొదటి

రెండు నెలలతో పోల్చితే రూ.67 కోట్లు తక్కువ

లాక్‌డౌన్‌తో రియల్‌ ఎస్టేట్‌ మందగమనం

భవన నిర్మాణ కార్మికుల వలసలతో ఆగిన నిర్మాణాలు

పుంజుకునేందుకు మరింత సమయం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం గణనీయంగా తగ్గింది. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా కొత్త ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఏప్రిల్‌ నెల మొత్తం కార్యాలయాలు మూతపడ్డాయి. రూపాయి ఆదాయం రాలేదు. మే నెల మూడో తేదీ నుంచి భౌతిక దూరం పాటిస్తూ, స్లాట్‌ బుకింగ్స్‌ ద్వారా రిజిస్ట్రేషన్లు ప్రారంభించారు. గతంలో విశాఖపట్నం అర్బన్‌ జిల్లాలో రోజుకు 200 నుంచి 250 డాక్యుమెంట్‌లు రిజిస్టర్‌ అయితే ఇప్పుడు సగటున 70 నుంచి 100 మాత్రమే అవుతున్నాయి. లాక్‌డౌన్‌కు ముందు నగరంలోని ఎనిమిది సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు కలిపి సగటున రోజుకు రూ.2.5 కోట్లు ఆదాయం రాగా...ఇప్పుడు రూ.70 లక్షల నుంచి రూ.80 లక్షలు వస్తోంది. అంటే ఆదాయం మూడో వంతుకు పడిపోయింది. 


ఇలా తగ్గింది..

గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌లో 3,796 డాక్యుమెంట్‌లు రిజిస్టర్‌ కాగా రూ.41 కోట్ల ఆదాయం వచ్చింది. మే నెలలో 4,688 డాక్యుమెంట్ల ద్వారా రూ.45 కోట్లు వచ్చింది. అంటే గత ఏడాది మొదటి రెండు నెలల్లో (ఏప్రిల్‌, మే) రూ.86 కోట్లు వచ్చింది. ఈ ఏడాది చూసుకుంటే ఏప్రిల్‌ నెల ఆదాయం సున్నా. మే నెలలో 2,046 డాక్యుమెంట్ల ద్వారా రూ.19 కోట్లు మాత్రమే వచ్చింది. గత ఏడాదితో పోల్చుకుంటే రూ.67 కోట్లు తక్కువ. 


ఆదాయం పెరిగే అవకాశం ఉందా?

లాక్‌డౌన్‌ సడలింపులతో కార్యాలయాలు తెరిచాక జరుగుతున్న రిజిస్ట్రేషన్లలో ఎక్కువ శాతం గతంలో చేసుకున్న ఒప్పందాలవేనని తెలుస్తోంది. సంక్రాంతి తరువాత చాలామంది బిల్డర్లు స్థలాలను డెవలప్‌మెంట్‌కు తీసుకుంటూ ఒప్పందాలు చేసుకున్నారు. అలాగే కొన్ని స్థలాలు కొనుగోలు చేశారు. లాక్‌డౌన్‌ వల్ల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. వాటిని ఇప్పుడు చేసుకుంటున్నారు. మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో లాక్‌డౌన్‌ వల్ల కొత్త ఒప్పందాలు జరగలేదు. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. మనీ సర్క్యులేషన్‌ తగ్గిపోయింది. దీంతో స్థిరాస్తుల కొనుగోళ్లు జరగడం లేదు. కొత్త ఒప్పందాలు కూడా లేవు. పైగా కొత్త నిర్మాణాలు చేపట్టే పరిస్థితులు కనుచూపుమేర కనిపించడం లేదు.


నిర్మాణ రంగంలో కూలీలు అంతా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన వారే. వారంతా కరోనా నేపథ్యంలో సొంత జిల్లాలకు వెళ్లిపోయారు. మరోవైపు ఇక్కడ కరోనా తీవ్రత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వారు సంక్రాంతి వరకు తిరిగి ఇక్కడి పనులకు వచ్చే అవకాశం లేదు. అందువల్ల నిర్మాణాలు ఊపందుకోవు. దీంతో నిర్మాణ రంగం ఇంకో ఆరు నెలలు వేగంగా అడుగులు వేసే అవకాశం లేదు. ఇక ఇప్పటికే నిర్మించిన గృహాలు అందుబాటులో ఉన్నా, బిల్డర్లు చెబుతున్న ధరలకు సామాన్యులు కొనే పరిస్థితి లేదు. ఆ స్థాయిలో డబ్బులు అందుబాటులో లేవు. బ్యాంకులు ఇంతకు ముందులా రుణాలు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో రిజిస్ట్రేషన్లు క్రమంగా తగ్గుముఖం పడతాయని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.


ఇదీ ఆదాయం లెక్క

విశాఖ జిల్లా అర్బన్‌ పరిధిలోని ఎనిమిది సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో మే నెల డాక్యుమెంట్‌లు, ఆదాయం వివరాలు..


కార్యాలయం       డాక్యుమెంట్‌లు     ఆదాయం(రూ.కోట్లు) 

ఆనందపురం          222           1.81

భీమునిపట్నం         201           1.65

ద్వారకానగర్‌          242           2.39 

గాజువాక             246           1.99

గోపాలపట్నం         137            1.13 

మధురవాడ          353            4.34 

పెందుర్తి             299            1.95 

విశాఖపట్నం ఆర్‌ఓ    346            3.76 

మొత్తం            2,046            19.02 


సేల్‌ డాక్యుమెంట్ల ఆదాయం 85 శాతం ..కె.మన్మథరావు, జిల్లా రిజిస్ట్రార్‌

ప్రస్తుతం రోజుకు 70 నుంచి 80 రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా, వాటిలో సేల్‌ డాక్యుమెంట్‌లు 45 నుంచి 50 ఉంటున్నాయి. మిగిలినవి వివాహాలు, తనఖాలు వంటివి. ఆదాయంలో 85 శాతం ఈ సేల్‌ డాక్యుమెంట్ల ద్వారానే వస్తోంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తే జూలై నుంచి రిజిస్ట్రేషన్లు పెద్దగా ఉండవని అనిపిస్తోంది. మళ్లీ పుంజుకోవడానికి నాలుగైదు నెలలు పడుతుంది.

Updated Date - 2020-06-03T10:09:18+05:30 IST