రికార్డుస్థాయిలో రిజిస్ట్రేషన్లు

ABN , First Publish Date - 2022-01-29T16:17:41+05:30 IST

భూములు, ఫ్లాట్ల మార్కెట్‌ ధరలు పెంచేందుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఆ లోపే రిజిస్ట్రేషన్లను పూర్తి చేసుకునేందుకు ...

రికార్డుస్థాయిలో రిజిస్ట్రేషన్లు

గండిపేటలో ఒకేరోజు 185 

ఇతర చోట్లా ఫుల్‌ 

రాత్రి 10 వరకు కార్యాలయాల్లో రద్దీ

ధరలు పెరగనుండడమే కారణం 


హైదరాబాద్‌ సిటీ: భూములు, ఫ్లాట్ల మార్కెట్‌ ధరలు పెంచేందుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఆ లోపే రిజిస్ట్రేషన్లను పూర్తి చేసుకునేందుకు కొనుగోలుదారులు కార్యాలయాలకు పరుగులు తీస్తున్నారు. దీంతో గ్రేటర్‌ పరిధిలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు రద్దీగా మారుతున్నాయి. సాయంత్రం 5 వరకు స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారందరి రిజిస్ర్టేషన్లు పూర్తిచేసేలా రాత్రి 10 వరకు పని చేస్తున్నామని ఎర్రగడ్డ సబ్‌రిజిస్ట్రార్‌ ప్రణయ్‌కుమార్‌ తెలిపారు. 


20 నుంచి 200కు..

వారం క్రితం వరకు ఎర్రగడ్డ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రోజుకు 20 మాత్రమే రిజిస్ర్టేషన్లు జరిగేవి. కానీ, రెండు రోజుల్లోనే 200కు పైగా రిజిస్ర్టేషన్లు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. రాజేంద్రనగర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో వారం రోజుల్లో 390 రిజిస్ర్టేషన్లు జరిగితే, గురు, శుక్రవారాల్లో 270కి పైగా జరిగినట్లు అధికారులు తెలిపారు. సూరారం కార్యాలయంలో రెండు రోజుల్లో 350 రిజిస్ర్టేషన్లు జరిగాయి. తర్వాత రిజిస్ర్టేషన్లు చేయించుకునేందుకు అడ్వాన్స్‌లు చెల్లించిన చాలామంది భూముల మార్కెట్‌ ధరలు పెరిగితే రిజిస్ర్టేషన్‌ చార్జీలు కూడా పెరుగుతాయని ఈ నెలలోనే పూర్తి చేసుకుంటున్నారు. దీంతో కార్యాలయాల వద్ద డాక్యుమెంట్‌ రైటర్లు కూడా రాత్రి 11 వరకు షాపులు తెరిచి ఉంచుతున్నారు.


శివారు ప్రాంతాల్లో..

నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోని గండిపేట, కుత్బుల్లాపూర్‌, రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి, ఎల్‌బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌, ఉప్పల్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు  కిక్కిరిసిపోతున్నాయి. గండిపేట కార్యాలయంలో శుక్రవారం ఒకేరోజు 185 రిజిస్ర్టేషన్లు జరిగాయి. చంపాపేట కార్యాలయంలో వారం రోజుల్లో 370 జరిగితే శుక్రవారం ఒక్కరోజు 130 జరిగాయి. ఎల్‌బీనగర్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో వారం రోజుల్లో 360 రిజిస్ర్టేషన్లు జరిగితే శుక్రవారం 130 జరిగాయి. పెద్ద అంబర్‌పేట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో వారం రోజుల్లో 520 రిజిస్ర్టేషన్లు జరిగితే గురు, శుక్రవారాల్లో 230 జరిగాయి. హయత్‌నగర్‌ కార్యాలయంలో వారం రోజుల్లో 252 డాక్యుమెంట్లు రిజిస్ర్టేషన్లు జరిగితే గురువారం ఒక్కరోజు 59 జరిగాయి. మల్కాజిగిరి కార్యాలయంలో వారం క్రితం రోజుకు 20 నుంచి 25 వరకు రిజిస్ర్టేషన్లు అయ్యేవని, మూడు రోజులుగా 60 నుంచి 90 వరకు చేస్తున్నట్లు సబ్‌రిజిస్ట్రార్‌ పలనీకుమారి తెలిపారు. 


చార్జీల పెంపు వాయిదా వేయాలి

రిజిస్ర్టేషన్‌ చార్జీల పెంపు వాయిదా వేయాలని వెస్ట్‌జోన్‌ బిల్డర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, జనరల్‌ సెక్రటరీ ఎం.సుబ్బయ్య, ఎం.ప్రేమ్‌కుమార్‌ కోరారు. ప్రస్తుతం నిర్మాణ రంగంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. కొనుగోలుదారుల మీద భారం పడటంతో పాటు నిర్మాణదారులకు పెట్టుబడులమీద వడ్డీలు  కూడా రావడం లేదన్నారు. బిల్డర్లు అధిక వడ్డీలకు డబ్బులు తెచ్చి నిర్మాణాలు చేస్తున్నారని, 80 శాతం పూర్తయిన తర్వాతే అమ్మకాలు జరుగుతుండడం వల్ల నిర్మాణదారులు నష్టాలు చవిచూస్తున్నారని వివరించారు. 


బోయినపల్లి, మారేడుపల్లిలో..

బోయినపల్లి, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): బోయినపల్లి, మారేడుపల్లి  సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు రెండు రోజులుగా వినియోగదారులు క్యూ కడుతున్నారు. ఈ రెండు కార్యాలయాల్లో వాస్తవానికి రోజూ 5 నుంచి 10 వరకు రిజిస్ర్టేషన్‌లు జరిగేవి. కానీ, శుక్రవారం బోయినపల్లి ఎస్‌ఆర్‌ఓలో 40, మారేడుపల్లిలో 45 నుంచి 50 వరకు రిజిస్ర్టేషన్‌లు జరిగినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. 


మొరాయిస్తున్న సర్వర్‌లు

మేడ్చల్‌: రిజిస్ట్రేషన్ల నిమిత్తం స్లాట్‌ బుకింగ్‌ల సంఖ్య పెరగడంతో సర్వర్‌లు మొరాయిస్తున్నాయి. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌కు చెందిన ధరణిపై ఎక్కువ లోడ్‌ పడటంతో సర్వర్‌ మొరాయించినట్లు తెలిసింది. మరోవైపు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో కూడా సర్వర్‌లు స్లో కావడంతో రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది.

Updated Date - 2022-01-29T16:17:41+05:30 IST