దసరా నుంచి రిజిస్ట్రేషన్లు

ABN , First Publish Date - 2020-10-18T09:14:24+05:30 IST

భూ రికార్డులకు సంబంధించి ధరణి వెబ్‌సైట్‌లో ఏ డేటా ఉంటే ఆ వివరాల ఆధారంగానే రిజిస్ట్రేషన్లు చేయాలని, ఇతర రికార్డులను పరిశీలించడానికి వీల్లేదని ..

దసరా నుంచి  రిజిస్ట్రేషన్లు

25న ధరణి పోర్టల్‌ ప్రారంభం.. రిజిస్ట్రేషన్లకు అందులోని రికార్డే ప్రామాణికం

తొలుత 4 రకాలైన డాక్యుమెంట్లకే అవకాశం

25 నుంచే 570 మండలాల్లో రిజిస్ట్రేషన్లు

వ్యవసాయేతర రిజిస్ట్రేషన్‌పై స్పష్టత కరువు

వర్షాలతో హైదరాబాద్‌లో నమోదు నిలిపివేత

తొలుత వీటికే..

సేల్‌

పార్టిషన్‌

సక్సెషన్‌

గిఫ్ట్‌ డీడ్‌


హైదరాబాద్‌, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): భూ రికార్డులకు సంబంధించి ధరణి వెబ్‌సైట్‌లో ఏ డేటా ఉంటే ఆ వివరాల ఆధారంగానే రిజిస్ట్రేషన్లు చేయాలని, ఇతర రికార్డులను పరిశీలించడానికి వీల్లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దసరా నుంచి అంటే, ఈనెల 25వ తేదీన ధరణి పోర్టల్‌ అందుబాటులోకి వస్తుంది. ఆ  రోజు నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లను హైదరాబాద్‌ మినహా రాష్ట్రవ్యాప్తంగా 570 మండలాల్లో జరుగుతుతాయి. అయితే తొలిదశలో రిజిస్ట్రేషన్లకు సంబంధించి నాలుగు డాక్యుమెంట్లను మాత్రమే చేయడానికి తహసీల్దార్లకు అవకాశం ఇచ్చారు.


ఆ మేరకు భూముల విక్రయాలకు సంబంధించిన సేల్‌ డీడ్‌,  కుటుంబసభ్యులు/ఇతర భూముల యాజమానులు పంచుకునే పార్టిషన్‌, కటుంబసభ్యులు సమర్పించే సక్సెషన్‌ (వారసత్వ) డీడ్‌, గిఫ్ట్‌ డీడ్‌లు చేయడానికే తహసీల్దార్లకు అవకాశం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. శనివారం ధరణి(వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌)పై తహసీల్దార్లు, నాయబ్‌ తహసీల్దార్లు, అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ, స్థానిక సంస్థలు), కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అనుమానాలు వ్యక్తం చేయగా.. కొన్నింటికీ యంత్రాంగం జవాబు ఇచ్చింది. 


ప్రశ్న:రిజిస్ట్రేషన్‌ కోసం రైతులు తహసీల్‌కు వస్తే... ఖాస్రా, సేత్వార్‌ రికార్డులను పరిశీలించాకే రిజిస్ట్రేషన్‌ చేయాలా? 

అధికారులు: ఖాస్రా, సేత్వార్‌లను పరిశీలించడానికి వీల్లేదు. ధరణిలో ఏ వివరాలుంటే... వాటి ఆధారంగా రిజిస్ట్రేషన్‌ చేయాల్సిందే. ఇతర రికార్డులను అసలే చూడవద్దు. ధరణినే ప్రామాణికం చేసుకోండి. 


ప్రశ్న:    రికార్డుల్లో ఉన్న విస్తీర్ణానానికి, వాస్తవ విస్తీర్ణంలో తేడాలున్నాయి. ఒక సర్వేనంబర్‌లో 100 ఎకరాలుంటే, రికార్డుల్లో 110 ఎకరాలు ఉంది. వీటిరి ఏ విధంగా రిజిస్ట్రేషన్‌ చేయాలి? 

అధికారులు: త్వరలో మార్గదర్శకాలు ఇస్తాం. 


ప్రశ్న:అభ్యంతర భూముల జాబితా 22(ఏ)పై అనుమానాలున్నాయి. ఒక సర్వేనంబర్‌లో 100 ఎకరాలుంటే... అందులో 10 ఎకరాలు ప్రభుత్వ భూమి... అయితే ఆ సర్వేనంబర్‌ అంతా ప్రొహిబిషన్‌లో ఉంది. ఈ భూములు ఏం చేయాలి?

అధికారులు: త్వరలో చెబుతాం. 


ప్రశ్న:సక్సెషన్‌ చేసేటప్పుడు కుటుంబసభ్యుల మధ్య వివాదం ఉంటుంది. తండ్రి చనిపోతే తల్లిపై ఒత్తిడి తెచ్చి... కొందరు కుటుంబసభ్యులను వదిలేసి సక్సెషన్‌ చేయాలని వస్తారు. ఇక సదరు చనిపోయున రైతుకు ఇద్దరు భార్యలుంటే ఒక భార్య మాత్రమే తన పిల్లలపై రికార్డులను రాసుకోవాలని ప్రయత్నిస్తే ఏం చేయాలి? సుప్రీం తీర్పుకు విరుద్ధంగా ఆడపిల్లలకు ఆస్తులు ఇవ్వడానికి సిద్ధపడకుండా సక్సెషన్‌కు వస్తే ఏం చేయాలి? క్షేత్రస్థాయి విచారణ జరపాలా వద్దా?

అధికారులు: త్వరలో మార్గదర్శకాలు ఇస్తాం. 


ప్రశ్న:రిజిస్ట్రేషన్‌పై న్యాయస్థానంలో ఎవరైనా కేసు దాఖలు చేసి... ఆ రిజిస్ట్రేషన్‌ను, పట్టాదారు పాస్‌పుస్తకాన్ని రద్దు చేయాలని తీర్పులు వస్తే ఏం చేయాలి?

అధికారులు:  ఆ సమాచారం తొలుత జిల్లా కలెక్టర్‌కు అందిం చి..  వారి సూచనల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి.


ప్రశ్న:రద్దయిన చట్టం ఆధారంగా సాదా బైనామాల క్రమబద్ధీకరణ ఎలా చేయాలి?

అధికారులు: త్వరలో దీనిపై తగిన మార్గదర్శకాలు జారీ చేస్తాం. 


ప్రశ్న:ఆ డాక్యుమెంట్ల సంగతేంటి? 

అధికారులు: ధరణి భూముల రిజిస్ట్రేషన్‌ ఈనెల 25వ తేదీన ప్రారంభించనుండగా... వ్యవసాయ భూములతో ముడిపడిన ఇతర డాక్యుమెంట్ల పరిస్థితి ఏంటి అనేది తేలడం లేదు. వీలునామా, జీపీఏ, ఎన్‌ఆర్‌ఐ పట్టాదారులు ఉంటే... స్పెషల్‌ జీపీఏ ఆధారంగా జరిగే రిజిస్ట్రేషన్లు, రిజిస్ట్రేషన్‌ చట్టంలోని సెక్షన్‌-32 ప్రకారం పట్టాదారులు రిజిస్ట్రేషన్‌కు రాలేకపోతే.. ఇతరులకు ప్రత్యేక అధికారాలు ఇవ్వడం, పట్టాదారులు అనారోగ్యంతో ఉంటే... ఇంటికే వెళ్లి రిజిస్ట్రేషన్‌ చేయించడం వంటి అంశాలపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు.


ప్రశ్న:వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు ఎప్పుడు?

అధికారులు: వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ ఎప్పటి నుంచి అన్న దానిపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటనా చేయలేదు. అయితే తమ ఆస్తులను ధరణిలోకి ఎక్కించుకోకముందే విక్రయించుకోవచ్చా? లేదా? అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. అయితే సాగుయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు కూడా ధరణి ఆధారంగానే జరగనున్నట్లు ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ఆ మేరకు ఆస్తులను ఆన్‌లైన్‌ చేసుకున్న తర్వాతే విక్రయించుకునే వెసులుబాటు ఉంటుందని సమాచారం. 

Updated Date - 2020-10-18T09:14:24+05:30 IST