స్తంభించిన రిజిస్ట్రేషన్లు

ABN , First Publish Date - 2020-09-25T09:01:26+05:30 IST

రాష్ట్రంలో భూ సంబంధిత రిజిస్ట్రేషన్లన్నీ స్తంభించిపోయాయి. క్రయ విక్రయదారులు లేక.. పక్షం రోజులుగా సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లలో అక్రమాలు, అవకతవకలను అడ్డుకోవడానికి ప్రభుత్వం ‘ధరణి (సమగ్ర భూ రికార్డుల యాజమాన్య విధానం)’ పోర్టల్‌ను...

స్తంభించిన రిజిస్ట్రేషన్లు

  • 15 రోజులుగా కార్యాలయాలు వెలవెల
  • పెళ్లిళ్లు, ఈసీలు, సీసీల సేవల కొనసాగింపు
  • ధరణి పోర్టల్‌ ప్రారంభమైతేనే మళ్లీ రిజిస్ట్రేషన్లు

హైదరాబాద్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భూ సంబంధిత రిజిస్ట్రేషన్లన్నీ స్తంభించిపోయాయి. క్రయ విక్రయదారులు లేక.. పక్షం రోజులుగా సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లలో అక్రమాలు, అవకతవకలను అడ్డుకోవడానికి ప్రభుత్వం ‘ధరణి (సమగ్ర భూ రికార్డుల యాజమాన్య విధానం)’ పోర్టల్‌ను అమల్లోకి తెస్తున్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్నింటినీ నిలిపివేసింది. ప్రస్తుతం ఏ కార్యాలయంలోనూ భూములు, స్థలాలు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. ఇవే కాదు.. బ్యాంకుల్లో ఆస్తులను తాకట్టు పెట్టి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో చేసుకునే డిపాజిట్‌ ఆఫ్‌ టైటిల్‌ డీడ్‌(మార్ట్‌గేజ్‌) రిజిస్ట్రేషన్లు కూడా కావడం లేదు. చిన్న చిన్న సేవలు మాత్రమే కొనసాగుతున్నాయి.


రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ‘తెలంగాణ భూమి హక్కులు, పట్టాదార్‌ పాస్‌పుస్తకాల చట్టం-2020’ని అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖల్లో పలు సంస్కరణలతో ఈ చట్టాన్ని తెచ్చింది. ఇదివరకు వ్యవసాయ పట్టా భూములను సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ చేయగా, రెవెన్యూ దస్త్రాల్లో యజమాని పేరు మార్పు కోసం చేసే మ్యుటేషన్ల బాధ్యతలను మాత్రం తహసీల్దార్లు నిర్వహించేవారు. ఇలా భూ యాజమాన్య హక్కుల మార్పులో రెండు శాఖల భాగస్వామ్యం ఉండేది. అయితే.. రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల సందర్భాల్లో అక్రమాలు చోటుచేసుకుంటున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశంతో ‘ధరణి’ పోర్టల్‌ను సమగ్రంగా రూపొందించింది. ఇకపై వ్యవసాయ భూములను ఈ పోర్టల్‌ ద్వారానే నిర్వహించాలని నిర్ణయించింది.


రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల బాధ్యతలు తహసీల్దార్‌లకే..

వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల బాధ్యతలు రెండింటినీ తహసీల్దార్లకే అప్పగిస్తూ ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టంలో నిబంధన పెట్టింది. వ్యవసాయేతర భూములు, ఇళ్ల స్థలాలు, అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్లు వంటి ఆస్తుల రిజిస్ట్రేషన్‌ బాధ్యతలను మాత్రమే సబ్‌రిజిస్ట్రార్లకు అప్పగించనుంది. అందుకే ధరణి పోర్టల్‌లో అగ్రికల్చరల్‌, నాన్‌-అగ్రికల్చరల్‌ ఆప్షన్లు పెట్టింది. ఈ పోర్టల్‌ ఇంకా ప్రారంభం కాకపోయినా.. ఈ లోపు అక్రమాలు చోటు చేసుకుంటాయనే ఉద్దేశంతో ప్రభుత్వం మొత్తం రిజిసే్ట్రషన్లను నిలిపివేసింది. పెళ్లిళ్లు, వీలునామాల రిజిస్ట్రేషన్లు, ఫ్రాంకింగ్‌ సేవలకు మాత్రం అనుమతించింది. దీంతో జిల్లాల్లోని కార్యాలయాలతోపాటు నగరంలో ఎప్పుడూ బిజీగా ఉండే సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయాలు కూడా బోసిపోతున్నాయి. పెళ్లిళ్లు, వీలునామా వంటి రిజిస్ట్రేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు 50 వరకు జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. సర్టిఫైడ్‌ కాపీలు, ఈసీల జారీ యథాతథంగా కొనసాగుతోంది. ఇటీవల ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌కు అనుమతి ఇవ్వడంతో సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయాల నుంచి మార్కెట్‌ వాల్యూ సర్టిఫికెట్లు పొందడం ఎక్కువైంది. ఇక రాష్ట్రంలోని అన్ని కార్యాలయాల్లో స్టాంపు పేపర్ల విక్రయాలు కూడా నిలిచిపోయాయి. అయితే.. ధరణి పోర్టల్‌ ప్రారంభం కాగానే రిజిస్ట్రేషన్‌ సేవలను పునరుద్ధరిస్తారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ పోర్టల్‌ అక్టోబర్‌ మొదటి వారంలో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. 

Updated Date - 2020-09-25T09:01:26+05:30 IST