దశమి తర్వాతే ‘ధరణి’

ABN , First Publish Date - 2020-10-24T07:57:19+05:30 IST

సమగ్ర భూ రికార్డుల నిర్వహణ కోసం రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ధరణి విజయదశమి తర్వాత అందుబాటులోకి రానుంది.

దశమి తర్వాతే  ‘ధరణి’

29వ తేదీ 12:30 గంటలకు సీఎం చేతుల మీదుగా పోర్టల్‌ 

వ్యవసాయేతర ఆస్తులు మీసేవలోనూ నమోదు చేసుకోవచ్చు


సమగ్ర భూ రికార్డుల నిర్వహణ కోసం రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ధరణి విజయదశమి తర్వాత అందుబాటులోకి రానుంది. 29వతేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు (నిజ ఆశ్వయుజ మాసం మకరలగ్నంలో ఉత్తరాభాద్ర నక్షత్రం) దీనిని ప్రారంభించనున్నారు. ఇదివరకు ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం విజయదశమి(25వ తేదీ) నాడే ధరణి ప్రారంభంకావాల్సి ఉంది. అయితే, ఆ రోజు ముహూర్తాలు బాగాలేవని పండితులు చెప్పడంతో 29న ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. 


హైదరాబాద్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): పాక్షిక వివరాలతో ధరణి వెబ్‌సైట్‌ను లైవ్‌లో శుక్రవారం పెట్టారు. 29వ తేదీ నుంచే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ జరుగనుంది. తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా 474 తహసీల్దార్‌ కార్యాలయాల్లో ఈ వెబ్‌పోర్టల్‌ ఆధారంగా వ్యవసాయ భూములను తహసీల్దార్లు రిజిస్ట్రేషన్‌ చేసేసి, ఆ వెనువెంటనే రికార్డుల్లో మ్యుటేషన్‌ చేయనున్నారు. 


ఆరు అంశాలతో...

ఆరు అంశాలతో ధరణి వెబ్‌సైట్‌ను శుక్రవారం ప్రారంభించారు. అందులో స్లాట్‌ బుకింగ్‌ ఫర్‌ సిటిజన్‌, రాష్ట్రంలో భూముల వివరాల గ్రాఫ్‌(1. 55 కోట్ల వ్యవసాయ భూములు, 42.53 లక్షల ఎకరాల అటవీ భూమి, 49 వేల ఎకరాల దేవాదాయ శాఖ భూమి, 15.45 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమితో పాటు ఇతర భూముల వివరాలున్నాయి), ఇక రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్‌ యాక్ట్‌-1908 ప్రకారం నిషేధిత జాబితాలో పొందుపరిచిన భూముల వివరాలు, ఇంకబరెన్స్‌ వివరాలు(భూముల క్రయవిక్రయాల లావాదేవీల సమాచారం), రాష్ట్రమంతటా సర్వే నంబర్ల వారీగా ఏ భూములకు ఏ విలువ ఉంది, స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు ఎంత విలువకు కట్టాల్సి ఉంటుందనే సమాచారం పొందుపరిచారు.


ల్యాండ్‌ డిటైల్స్‌ పరిశీలించండి అనే ఆప్షన్‌ ఇవ్వగా... అందులో వికారాబాద్‌ జిల్లాలోని దోమ, కుల్కచర్ల, పరిగి, పూడురు మండలాల భూముల సమాచారం మాత్రమే ఉంది. అయితే పట్టాదారు పాస్‌పుస్తకం నమోదు చేశాకా... జిల్లా, డివిజన్‌, మండలం, గ్రామం వివరాలు పొందుపరిచాకా... ఖాతా/సర్వేనెంబర్‌/సబ్‌ డివిజన్‌ వివరాలు ఎంటర్‌ చేయగానే అక్కడ ఇచ్చిన కోడ్‌ను పొందుపరచాలని వెబ్‌సైట్‌లో పెట్టారు. 


పాత విలువలే

ఏ భూములను ఏ విలువతో రిజిస్ట్రేషన్‌ చేయాలనే అంశంపై ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించడంతో భూముల వివరాలన్నీ అమాంతంగా పెరుగుతాయనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ పాత విలువల సమాచారం మాత్రమే వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి ముందే ఆ విలువల సమాచారం తెలుసుకుంటే... ఏ మేర స్టాంప్‌ డ్యూటీ చెల్లించాలనే అంశంపై క్లారిటీ రానుంది. జిల్లా, మండలం, గ్రామం, సర్వేనెంబర్‌తో పాటు కోడ్‌ను ఎంటర్‌ చేస్తే... భూముల విలువల సమాచారం కళ్లముందు కానరానుంది. రైతులు భూములు కొనుగోలు చేయడానికి స్లాట్‌ బుకింగ్‌ చేస్తున్న క్రమంలోనే ఆటోమేటిగ్గా భూముల విలువలు/రిజిస్ట్రేషన్‌/స్టాం్‌ప డ్యూటీ వివరాలు జనరేట్‌ అయి... కొనుగోలుదారులకు కానరానుంది. 


 అప్రమత్తం చేసే స్లాట్‌ బుకింగ్‌

స్లాట్‌ బుకింగ్‌ చేసే క్రమంలో మొబైల్‌ నంబర్‌ నమోదు చేయగానే పాస్‌వర్డ్‌ను కూడా పొందుపరచాలి అని వెబ్‌సైట్‌లో ఉంది. అయితే పాస్‌వర్డ్‌ ఏ విధంగా నమోదు చేయాలనే మీమాంస రైతుల్లో ఉంది. పట్టాదారు పాస్‌పుస్తకాల కోసం ఆధార్‌కార్డుతో పాటు సమర్పించిన మొబైల్‌ నంబర్‌ను ఎంట్రీ చేయగా... ఆ నంబర్‌ రిజిస్టర్‌ కాలేదనే సమాచారం వెబ్‌సైట్‌లో వస్తోంది. మరో మార్గంలో స్ల్లాట్‌ బుకింగ్‌ ఫర్గెట్‌ పాస్‌వర్డ్‌ను క్లిక్‌ చేసి, మొబైల్‌ నంబర్‌, క్యాప్చర్‌కోడ్‌ను ఎంట్రీ చేసినప్పటికీ మొబైల్‌ నంబర్‌ నమోదు కాలేదనే సమాచారం వస్తోంది. దీనిపై ఈనెల 29వ తేదీలోగా ప్రభుత్వం స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. ఇక విక్రయించే రైతు అంగీకారం లేకుండా... అతని పాత్ర లేకుండా స్లాట్‌ను బుక్‌ చేసుకునే అవకాశం లేకుండా వెబ్‌సైట్‌ను కట్టడి చేయడం గమనార్హం. 


ధరణి అప్‌డేటెడ్‌ వెర్షన్‌

సాంకేతిక సమస్యలు, సర్వర్‌లో లోపాలు సరిచేస్తూ ప్రభుత్వం నిర్ణయం

ధరణి వెబ్‌సైట్‌ ఆధారంగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌తో ముడిపడిన డాక్యుమెంట్ల నమోదులో జాప్యం జరుగుతుండటంతో ప్రభుత్వం నష్టనివారణ చర్యలు తీసుకుంది. ఆదివారం నుంచి నమూనా డాక్యుమెంట్ల నమోదును యుద్ధప్రాతిపదికన చేపడుతుండగా... ఫలితాలు ఆశించిన స్థాయిలో రాలేదు. తాజాగా గురువారం తహసీల్దార్లు ఐదు డాక్యుమెంట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే రోజంతా కష్టపడినా ఫలితం కనిపించలేదు. శుక్రవారం జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు రంగంలోకి దిగి... డాక్యుమెంట్ల నమోదును దగ్గరుండి పరిశీలించారు. సర్వర్‌లో లోపాలు, సాంకేతిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయని నివేదించడంతో శుక్రవారం సాయంత్రం నవీకరించిన ధరణి వెర్షన్‌ను తహసీల్దార్లకు అందించారు. ధరణి ప్రాజెక్టును కూడా ప్రభుత్వం వాయిదావేయడంతో తహసీల్దార్లు ఊపిరిపీల్చుకున్నారు. 

Updated Date - 2020-10-24T07:57:19+05:30 IST