రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో ఇష్టారాజ్యం

ABN , First Publish Date - 2022-05-22T06:34:12+05:30 IST

జిల్లాలోని సబ్‌ రిజిస్ర్టేషన్‌ కార్యాలయాలు దళారులకు అడ్డాగా మారుతున్నాయి. ఈ సబ్‌ రిజిస్ర్టేషన్‌ కార్యాలయాల్లో దళారులు లేనిదే ఒక రిజిస్ర్టేషన్‌ కాదు. ప్లాటు.. వ్యవసాయ భూములు.. వివాహాల రిజిస్ర్టేషన్‌ కావాలంటే బ్రోకర్ల ద్వారా పోతేనే పనిఅయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో ఇష్టారాజ్యం
కామారెడ్డి సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయం

- సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో బ్రోకర్లదే హవా

- ప్లాటుకు ఒక రేటు.. ఎకరానికి మరో రేటుగా ఫిక్స్‌

- దళారులతో పోతే కాని రిజిస్ర్టేషన్‌లు కాని పరిస్థితి

- ఏళ్లుగా పాతుకుపోయిన డాక్యుమెంట్‌ రైటర్లు

- అక్రమ మార్గంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ భూముల రిజిస్ట్రేషన్‌లు

- జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా వెలుస్తున్న వెంచర్లు

- బ్రోకర్లతో అధికారుల మిలాకత్‌.. దొడ్డి దారిన రిజిస్ర్టేషన్‌లు

- జిల్లాలో ఐదు సబ్‌ రిజిస్ర్టేషన్‌ కార్యాలయాలు


కామారెడ్డి, మే 21(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని సబ్‌ రిజిస్ర్టేషన్‌ కార్యాలయాలు దళారులకు అడ్డాగా మారుతున్నాయి. ఈ సబ్‌ రిజిస్ర్టేషన్‌ కార్యాలయాల్లో దళారులు లేనిదే ఒక రిజిస్ర్టేషన్‌ కాదు. ప్లాటు.. వ్యవసాయ భూములు.. వివాహాల రిజిస్ర్టేషన్‌ కావాలంటే బ్రోకర్ల ద్వారా పోతేనే పనిఅయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కేవలం నాలుగైదు రకాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలు తెలిస్తే చాలు ఈజీగా మనీ సంపాదించవచ్చనే ఆలోచన చేస్తూ డాక్యుమెంట్‌ కార్యాలయాలు తెరుస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ భూములను అక్రమ మార్గంలో రిజిస్ట్రేషన్‌లు జరిగేలా చూస్తూ రూ. లక్షలు వెనకేసుకుంటున్నారు. కనీసం పదో తరగతి పాస్‌ కాని, అసలు రిజిస్ట్రేషన్‌లు ఎలా చేయాలనే తెలియని వ్యక్తులు డాక్యుమెంట్‌ రైటర్లుగా చెలామణి అవుతూ డబుల్‌ రిజిస్ట్రేషన్‌లు, ప్రభుత్వ, అసైన్‌మెంట్‌ భూములను కబ్జా కోరలకు దారాదత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సర్వే నెంబర్‌ 6 ప్రభుత్వ భూమిని రూ.లక్షల్లో డబ్బులు తీసుకుని ఓ వ్యక్తిపైకి రిజిస్ట్రేషన్‌ చేసేందుకు ఓ డాక్యుమెంట్‌ రైటర్‌ చేసిన పనికి రూ.కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జారాయుళ్ల సొంతం అయ్యేది. స్థానికులు, ప్రతిపక్ష నాయకులు అడ్డుకునే ప్రయత్నాలు చేసి రెవెన్యూ, మున్సిపల్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో సర్వే నిర్వహించిన అధికారులు ఆ భూమి ప్రభుత్వ భూమిగా నిర్ధారించారు.

బ్రోకర్లదే హవా

జిల్లాలోని ప్రతీ రిజిస్ర్టేషన్‌ కార్యాలయంలో బ్రోకర్లతో వెళితే కానీ పని కాని పరిస్థితి ఏర్పడుతోంది. భూముల అమ్మకాలు, కొనుగోలు జరుగుతున్నందున రిజిస్ర్టేషన్‌ సంఖ్య పెరగడం, అంత ఆన్‌లైన్‌ కావడంతో కొనేవారు, అమ్మేవారు అంత బ్రోకర్లనే ఆశ్రయిస్తున్నారు. పని తొందరగా కావాలన్నా ఉద్దేశ్యంతో వినియోగదారుడు ఆన్‌లైన్‌ ఖర్చులతో పాటు వీరికి ఇచ్చే డబ్బులు కూడా పెరిగిపోతున్నాయి. బ్రోకర్లు, అధికారులు మిలాఖత్‌ కావడంతో ఎవరైన నిబంధనల ప్రకారం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని సమయానికి కార్యాలయానికి వచ్చినప్పటికీ వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఇదే అదునుగా భావిస్తున్న సబ్‌ రిజిస్ర్టేషన్‌ కార్యాలయాల సమీపంలో దస్తా విలేకర్లతో పాటు బ్రోకర్ల ఆగడాలు సైతం వెలుస్తున్నాయి. కామారెడ్డి సబ్‌ రిజిస్ర్టేషన్‌ కార్యాలయంలో 30 మందికి పైగా దస్తావేజులేఖర్లు ఉండగా బాన్సువాడ సబ్‌ రిజిస్ర్టేషన్‌ కార్యాలయ పరిధి సమీపంలో 20కి పైగా దస్తావేజు లేఖర్ల కార్యాలయాలు వెలిశాయి. అదేవిధంగా దోమకొండ, బిచ్కుంద, సబ్‌ రిజిస్ర్టేషన్‌ కార్యాలయం పరిధిలోనూ దస్తావేజులేఖర్ల కార్యాలయాలు ఉన్నాయి. వీరితో పాటు బ్రోకర్ల అడ్డాలు సైతం ఉన్నాయి. సబ్‌ రిజిస్ర్టేషన్‌లో ఏ పని కావాలన్నా వీరితో వెళితే ఇట్టే పని అవుతోంది. ప్లాటుకు ఓ రేటు, ఎకరం భూమి రిజిస్ర్టేషన్‌ మరో రేటుగా ఫిక్స్‌ చేస్తూ వినియోగదారుల నుంచి వసూళ్లు చేస్తున్నారు. బ్రోకర్లను కాదని రిజిస్ర్టేషన్‌ కార్యాలయాలకు వెళితే గంటల తరబడి వేచి చూడాల్సిందే. అధికారులు సైతం బ్రోకర్ల  వత్తాసు పలుకుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి.

అక్రమంగా వెలుస్తున్న వెంచర్లు

జిల్లాలో కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి పట్టణ కేంద్రాలతో పాటు మండలాల్లో, జాతీయ రహదారి వెంట నిబంధనలకు విరుద్ధంగా అక్రమ వెంచర్లు పుట్ట గొడుగుల్లా వెలుస్తున్నాయి. ప్రధానంగా కామారెడ్డి పట్టణ శివారులోని జాతీయ రహదారి వెంట నర్సన్నపల్లి, టేక్రియాల్‌ చౌరస్తా, అడ్లూర్‌ ఎల్లారెడి,్డ అబ్దుల్లాపూర్‌, స్నేహపురి, దేవునిపల్లి తదితర శివారు ప్రాంతాల్లో వందల ఎకరాలలో ఎలాంటి అనుమతులు లేకుండా వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చేస్తున్నారు. ఎకరానా రూ.కోటి నుంచి కోటి 50 లక్షల వరకు, గజం భూమి 15 వేల నుంచి 20వేల వరకు విక్రయాలు జరుపుతున్నారు. బాన్సువాడ, ఎల్లారెడ్డి పట్టణాల్లోనూ, శివారు ప్రాంతాల్లోనూ ఎకరాల చొప్పున వ్యవసాయ భూములను నింబధనలకు విరుద్ధంగా ప్లాట్లుగా మార్చేస్తున్నారు. అదేవిధంగా భిక్కనూరు, దోమకొండ, పిట్లం, బిచ్కుంద, సదాశివనగర్‌, గాంధారి, తాడ్వాయి, మాచారెడ్డి మండల కేంద్రాల్లోనూ నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు వెలుస్తున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. నాలా కన్వర్షన్‌ తీసుకోకుండా, లే అవుట్‌ అనుమతులు లేకుండానే ప్లాట్లుగా మార్చేస్తున్నారు. కనీసం వెంచర్లలో డ్రైనేజీ, విద్యుత్‌, మంచినీటి, రోడ్ల సౌకర్యాలు కల్పించకుండానే స్కీమ్‌ల పేరిట ప్లాట్‌లను విక్రయిస్తూ సామానుల్యను మోసం చేస్తున్నారు.

బ్రోకర్లతో కిందిస్థాయి సిబ్బంది మిలాకత్‌.. దొడ్డి దారిన రిజిస్ర్టేషన్‌లు

రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది కిందట మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ కొత్త చట్టాలను అమలులోకి తీసుకువచ్చింది. లేఅవుట్‌ లేని ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేయవద్దని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. నాలా కన్వర్షన్‌తో పాటు కొత్త చట్టాల ప్రకారం అన్ని వసతులు కల్పించాకే లేఅవుట్‌లకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ కామారెడ్డి పట్టణ శివారుతో పాటు బాన్సువాడ, ఎల్లారెడ్డిలోనూ అనుమతులు లేకుండా పుట్టగొడుగుల్లా అక్రమ వెంచర్లు వెలుస్తునే ఉన్నాయి. రియల్‌ వ్యాపారులు, బ్రోకర్లు, భూ కబ్జాదారులు సంబంధితశాఖల అధికారులతో కిందిస్థాయి సిబ్బందితో మిలాఖాత్‌ అయి అక్రమ వెంచర్లను ఏర్పాటు చేయడంతో పాటు నాన్‌ లేవుట్‌లకు దొడ్డిదారిన రిజిస్ట్రేషన్‌లు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అంతేకాకుండా ఒకే ప్లాట్‌ని డబుల్‌ రిజిస్ట్రేషన్‌లు చేస్తుండడంతో కొనుగోలుదారులు ఇబ్బందులు పడడమే కాకుండా నష్టపోతున్నారు. ప్రభుత్వ, అసైన్‌మెంట్‌ భూముల సర్వే నెంబర్లను తారుమారు చేస్తూ కొందరు డాక్యుమెంట్‌ రైటర్లతో దొంగ రిజిస్ట్రేషన్‌లు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల గాంధీగంజ్‌ సమీపంలో సర్వే నెంబర్‌ 6లో మార్కెట్‌ యార్డుకు చెందిన రూ.కోట్లు విలువ చేసే 1 ఎకరం 30 గుంటల భూమిని భూ కబ్జాదారుడికి గతంలో ఇక్కడ పని చేసిన ఓ అధికారి కనీసం పరిశీలన చేయకుండా డాక్యుమెంట్‌ రైటర్ల ద్వారా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కొనసాగించడం చూస్తేనే ఆ శాఖాధికారులు ఏ రకంగా పని చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

Updated Date - 2022-05-22T06:34:12+05:30 IST