Advertisement
Advertisement
Abn logo
Advertisement

రిజిస్ర్టేషన్‌ కష్టాలు

ఇన్‌చార్జి సబ్‌రిజిస్ర్టార్‌తో ఇబ్బందులు

సమయపాలన పాటించని మిగతా సిబ్బంది

స్లాట్‌ బుక్‌ చేసుకున్నా దినమంతా వేచి ఉండాల్సిందే

ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి

మంచిర్యాల, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ల సంఖ్య గణనీయంగా పడిపోయింది. దాదాపు నెల రోజులుగా ఇదే పరిస్థితి నెలకొన్నా పట్టించుకునేవారు కరువయ్యారు. ఇక్కడ రెగ్యులర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ లేకపోవడమే కారణం. అధికారి పర్యవేక్షణ లేకపోవడంతో కిందిస్థాయి సిబ్బంది సమయపాలన పాటించడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. ఉదయం పదకొండున్నరకు కూడా కార్యాలయానికి రావట్లేదని తెలుస్తోంది. సిబ్బంది వైఖరి కారణంగా వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చే వారు ఇబ్బందులు పడక తప్పడం లేదు. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే వారి బాధలు వర్ణణాతీతం. ముందస్తుగా ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకున్నప్పటికీ రోజంతా కార్యాలయం వద్దనే గడపాల్సి వస్తోందని వాపోతున్నారు. సబ్‌రిజిస్ర్టార్‌ సీటులో ఎవరు కూర్చుంటారో, అతను ఎప్పుడు వస్తాడో తెలియని పరిస్థితి నెలకొంది.    

నెల రోజులుగా పోస్టు ఖాళీ

ఇక్కడ రెగ్యులర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌గా పనిచేసిన రాంబాబు 2019 జూలై ఉద్యోగ విరమణ పొందారు. అనంతరం కరీంనగర్‌ స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రే షన్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న శ్రీధర్‌రాజుకు బాధ్యతలు అప్పగించగా దాదాపు ఏడాది పాటు విధులు నిర్వహించారు. అనంతరం ఆదిలాబాద్‌ జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రవికాంత్‌కు పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగించగా 2021 ఫిబ్రవరి వరకు విధులు నిర్వహించారు. అనంతరం మార్చిలో గ్రూప్‌-2 అధికారి అయిన అప్పా రావును రెగ్యులర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌గా నియమించినప్పటికీ మూడు నెలల  కాలంలోనే అవినీతి ఆరోపణలపై ఆయన సస్పెన్షన్‌కు  గురయ్యారు. దీంతో ఆదిలాబాద్‌లో పనిచేస్తున్న మురళికి అదనపు బాధ్యతలు అప్ప గించగా ఆయన సుమారు మూడు నెలలపాటు పనిచేశారు. అనంతరం హైద్రాబాద్‌ ఐజీ కార్యాలయంలో సబ్‌ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న హరిత కుమారి ఎస్‌ఆర్వోగా డిప్యూటేషన్‌పై సెప్టెంబర్‌ 20న మంచిర్యాలకు వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన కేవలం రెండు రోజుల్లోనే తిరిగి వెనక్కి వెళ్లిపోయారు. ఇక అప్పటి నుంచి సుమారు నెల రోజులుగా ఇక్కడ సబ్‌ రిజిస్ట్రార్‌గా ఎవరు పనిచేస్తున్నారో, ఎవరు సీటులో కూర్చుంటున్నారో తెలియని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. 

ఆది నుంచి అపవాదులు...

మంచిర్యాల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం ఆది నుంచి అపవాదులు మూటగట్టుకుంటోంది. ఇక్కడ   కార్యాలయం గోడలకు సిటిజన్‌ చార్టర్‌లు ఏర్పాటు చేసినప్పటికీ అందులో పేర్కొన్న విధంగా ఏనాడు అమలైన దాఖలాలు లేవు. సిబ్బంది సమయ పాలన పాటించకపోవడంతో అవి అలంకారప్రాయంగా మారిపోయాయి. సిటిజన్‌ చార్టులో ఒక్కో పనికి ఎంత సమయం పడుతుందనేది స్పష్టంగా పేర్కొన్నారు. అయితే  నిబంధనలన్నీ ప్రభుత్వం నిర్ణయించిన అసలు చార్జీలు పోను అదనంగా ఇచ్చే వారికి మాత్రమే వర్తిస్తాయి. లేకుంటే రోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిరగాల్సిందే. ఇదిలా ఉండగా ప్రతి పనికీ ఓ రేటంటూ అదనంగా వసూళ్లు చేయడం ఇక్కడ పరిపాటిగా మారింది. 

రిజిస్ట్రేషన్లకు జంకుతున్న జనం...

మంచిర్యాల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేయిం చుకునేందుకు జనం భయపడిపోతున్నారు. ఇన్‌చార్జిలు, కిందిస్థాయి సిబ్బంది సమయపాలన పాటించకపోవడంతో గంటల తరబడి వేచి ఉం డాల్సి వస్తోందని వాపోతున్నారు. కార్యాలయంలో ఇన్‌చార్జి సబ్‌ రిజి స్ట్రార్‌గా పనిచేస్తున్న అధికారి ఈ నెల 21న సాయంత్రం సమయంలో కార్యాలయానికి వచ్చిన ఆయన హడావుడిగా డాక్యుమెంట్లు పూర్తిచేసిన ట్లు తెలుస్తోంది. ఉదయం స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారు సాయంత్రం దాకా కార్యాలయం వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఇలా దిన మంతా ఉండాల్సి రావడంతో ఇప్పట్లో రిజిస్ట్రేషన్లు చేయించుకోకూడదనే నిర్ణయానికి వినియోగదారులు వచ్చారు. ఇన్‌చార్జి ఉన్నప్పటికీ ఆయన పేరుతో కిందిస్థాయి సిబ్బంది రిజిస్ట్రేషన్‌లు పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇలాగే లక్షెట్టిపేట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో కిందిస్థాయి ఉద్యోగులు రిజిస్ట్రేషన్లు చేయడంతో అక్రమాలు జరిగి అక్కడి సబ్‌ రిజిస్ట్రార్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. అక్రమంగా చేసిన రిజిస్ట్రేషన్లను సైతం ఉన్నతాధికారులు రద్దు చేశారు. దీంతో ప్రస్తుత సమయంలో రిజిస్ట్రేషన్‌లకు వెళ్లకపోవడమే మంచిదని ప్రజలు భావిస్తున్నారు. దీంతో రిజిస్ట్రేషన్లు తగ్గి ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. 

దినమంతా అక్కడే ఉన్నాం...

ముల్కల్ల తిరుపతిరెడ్డి, మంచిర్యాల

ప్లాటు రిజిస్ట్రేషన్‌ కోసం ఈ నెల 21న మంచిర్యాల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లాం. కొనుగోలుదారులతోపాటు ఇద్దరు సాక్షులు  ఐదుగురం దినమంతా కార్యాలయం వద్ద పడిగాపులు కాశాం. ఉదయం స్లాట్‌ బుక్‌ చేసుకున్నా సాయంత్రం 6 తరువాత ఇన్‌చార్జి అధికారి వచ్చి రిజిస్ట్రేషన్‌ పూర్తి చేశారు. అధికారుల వైఖరి కారణంగా రిజిస్ట్రేషన్లు చేయిద్దామంటేనే భయం వేస్తుంది.  

Advertisement
Advertisement