పెంచిన భూవిలువలు నేటి నుంచి అమలు

ABN , First Publish Date - 2020-08-10T10:45:34+05:30 IST

రిజిస్ట్రేషన్‌- స్టాంపులశాఖ జిల్లాలో పెంచిన భూవిలువలు సోమవారం నుంచి అమలులోకి వస్తాయి.

పెంచిన భూవిలువలు నేటి నుంచి అమలు

పెంపుదలకు ఆమోదం తెలిపిన కమిటీ

10 శాతం వరకు పెరుగుదల


నెల్లూరు(హరనాథపురం); ఆగస్టు 9: రిజిస్ట్రేషన్‌- స్టాంపులశాఖ జిల్లాలో పెంచిన భూవిలువలు సోమవారం నుంచి అమలులోకి వస్తాయి.  ఈ శాఖ పెంచిన మార్కెట్‌ విలువలకు ఆదివారం జిల్లా మార్కెట్‌ విలువల పెంపు కమిటీ ఆమోదముద్ర వేసింది.   ప్రజల అభ్యంతరాలు స్వీకరణ తరువాత తుది విలువల నివేదికకు కమిటీ ఆమోదం తెలిపింది.


10 శాతం వరకు పెరుగుదల

భూములు, స్థలాల విలువలను సున్న నుంచి 10 శాతం వరకు పెంచారు. నాలుగు కేటగిరీలుగా విభజించి ఈ విలువల పెంపునకు పూనురేన్నారు. మొదటి కేటగిరీలో అర్భన్‌ ప్రాంతాల్లో గృహ సమూదాయాలు,  రెండో కేటగిరిలో వ్యాపారసమూదాయాలు, మూడో కేటగిరీలో  శివారు వ్యవ సాయ భూములు, మెట్ట, మాగాణి భూములు, నాలుగో కేటగిరిలో జాతీయ రహదారి పక్కన భూములుగా విభజించి భూ, స్థలాల విలువలు పెంచారు. ఈ పెంపును ఖరీదైన ప్రాంతాలు, ధరతక్కువ ఉన్న ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని పెంచారు. భూములు, స్థలాలు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల విలువలను నిర్ణీత కాలవ్యవధిలో సవరిస్తుంటారు. బహిరంగ మార్కెట్‌లో ఉన్న ధరలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్‌ విలువల్లో సవరణ చేస్త్తుంటారు.   


అపార్టుమెంట్ల విలువల పెంపు

అపార్టుమెంట్ల విలువలను, భవనాల విలువలను కూడా ఈ సారి పెంచారు.  అపార్టుమెంట్లకు సంబంధించి చదరపు అడుగు నిర్మాణ ప్రాంతానికి నిర్ణయించిన ధరతోపాటు దానికి సంబంధించిన స్థలం విలువను కలిపారు. దీన్ని కాంపోజిట్‌ విలువ అంటారు. అపార్టుమెంటు రిజిస్ట్రేషన్‌ విలువ పెరిగినందున ఈ కాంపోజిట్‌ విలువకూడా పెరిగింది.. భూముల విలువ పెంచడంతో ఈ కాంపోజిట్‌ విలువలు కూడా పెరిగాయి.  వీటి చదరపు అడుగు విలువలు పెంచితే ప్రభుత్వానికి ఆదాయం బాగా పెరుగుతుందని భావించి వాటి విలువలు కూడా పెంచారు.పెంచిన విలువలు రిజస్ట్రేషన్‌ శాఖ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.


నేటి నుంచి అమలు చేస్తాం.. కే. అబ్రహం , డీఐజీ స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ

రిజిస్ట్రేషన్‌శాఖ పెంచిన విలువలకు మార్కెట్‌ విలువల పెంపు కమిటీ ఆమోదముద్ర వేసింది.  పెరిగిన విలువలను సోమవారం నుంచి అమలులోకి తెస్తాం.

Updated Date - 2020-08-10T10:45:34+05:30 IST