Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Mon, 24 Jan 2022 00:03:03 IST

రిజిస్ట్రేషన్‌ బాదుడు

twitter-iconwatsapp-iconfb-icon
రిజిస్ట్రేషన్‌ బాదుడు

సామాన్యుడి సొంతటి కల కల్లయే..
భూముల ధరలకు రెక్కలు
30 శాతం పెంచితే రూ.170.72 కోట్లు
50 శాతం పెరిగితే రూ. 283.86 కోట్లు
చుక్కలనంటనున్న రిజిస్ట్రేషన్‌ చార్జీలు


భూముల మార్కెట్‌ ధరలను భారీగా పెంచడం ద్వారా ఆ మేరకు రిజిస్ట్రేషన్‌ ఆదాయం పెంచుకునేందుకు రాష్ట్రప్రభుత్వం తీసుకోబోతున్న నిర్ణయం సామాన్య, మధ్య తరగతి ప్రజలపై పెనుభారం పడనున్నది. ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ చార్జీలు గణనీయంగా పెరిగాయి. మరింత పెంచాలని సర్కారు నిర్ణయం తీసుకోవడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ చర్యవల్ల సామాన్య ప్రజలు ఇంటి స్థలాన్ని లేదా, అపార్టుమెంట్‌ను గానీ, భూమిని గానీ కొనలేని పరిస్థితి ఏర్పడనున్నది. సొంత ఇంటి కల కలగానే మిగిలిపోనుంది.


హనుమకొండ, జనవరి 23 (ఆంధ్రజ్యోతి):
ఇటీవల కాలంలో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. వరంగల్‌ నగర శివారులలో, మండల కేంద్రాలకు దూరంగా ఉన్న స్థలం సైతం చదరపు గజం రూ.15వేల నుంచి రూ.20వేలకు తక్కువ దొరకడం లేదు. ఇక నగరం నడిబొడ్డున లేదా మండల కేంద్రంలో అయితే చ.గ. రూ.30వేల దాకా ధర పలుకుతోంది. విపరీతంగా పెరుగుతున్న ఇంటి అద్దెలను తట్టుకోలేక అప్పు చేసైనా చిన్నపాటి ఇల్లును నిర్మించుకోవాలనో, లేదా సింగిల్‌ లేదా డబుల్‌ బెడ్‌రూమ్‌ ప్లాట్‌నైనా కొనుక్కోవాలనో అనుకుంటున్న పేద, మధ్య తరగతి వారికి పెరిగిన ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. అయి నా సాహసం చేసి కొనుకుందామనుకుంటే రిజిస్ట్రేషన్‌ చార్జీల పెంపునకు ప్రభుత్వ కసరత్తు పిడుగులా పడనున్నది. ఈ ప్రభుత్వ చర్యవల్ల వారు సొంతింటి ప్రయత్నాలను వాయిదా వేసుకోవలసి వస్తోంది.

భారీ భారం
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని 12 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల ద్వారా గత డిసెంబర్‌లో మొత్తం రూ.47.31కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. స్థిరాస్తులపై మార్కెట్‌ విలువను ప్రభుత్వం 30 శాతం పెంచినట్లయితే  నెలకు ఆదనంగా రూ.14.19కోట్లు, ఏడాదికి రూ.170.72 కోట్ల భారం పడనుంది. 50శాతం పెంచినట్లయితే నెలకు రూ.23.65కోట్లు, ఏడాదికి రూ.283.86కోట్ల భారం పడుతుంది. ఈ పెంపు వల్ల ప్రభుత్వానికి ఏడాదిలో మొత్తం 30శాతం పెరుగుదలతో రూ.738.03 కోట్లు, 50 శాతం పెరుగుదలతో రూ.851 కోట్లు ఆదాయం సమకూరుతుందని అంచనా.

ఆరు నెలలకే..

ఆరు నెలలు తిరక్కముందే మరోసారి భూముల మార్కెట్‌ విలువను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వరుసగా రెండుసార్లు రేట్లు పెరగడం వల్ల భూములు కొనేవాళ్లకు రిజిస్ట్రేషన్‌ చార్జీల భారం రెండింతలు కానున్నది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతీ రెండేళ్లకోసారి, పట్టణ ప్రాంతాల్లో ఏడాదికోసారి రిజిస్ట్రేషన్‌ విలువలను సమీక్షించి కొత్త విలువలను నిర్ధారించాలని చట్టంలో ఉంది. కానీ, ఇందుకు విరుద్ధంగా ఒకే ఏడాదిలో రెండుసార్లు పెంచేందుకు కసరత్తు సాగుతోండడం చర్చనీయాంశంగా మారింది. గత సంవత్సరం మార్కెట్‌ విలువతో పాటు రిజిస్ట్రేషన్‌ చార్జీలను ప్రభుత్వం పెంచింది. కొత్త చార్జీలు జూలై 22 నుంచి అమల్లోకి వచ్చాయి. గత ఏడాది వ్యవసాయ భూముల కనీస ధరను ఎకరాకు రూ.75 వేలుగా ప్రభుత్వం నిర్ణయించింది. తక్కువ విలువఉన్న భూమి మార్కెట్‌ ధరను రూ.50శాతానికి, ఎక్కువ విలువ ఉన్న భూమి ధరను 30 శాతానికి, మధ్యశ్రేణి భూముల ధరను 40శాతానికి పెంచింది. అలాగే స్టాంప్‌డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ చార్జీలను 6 శాతం నుంచి 7.5 శాతానికి పెంచింది.

కమిటీల్లేకుండానే..

సాధారణంగా భూముల విలువల సవరణకు ముందుగా సబ్‌ రిజిస్ట్రార్‌ కన్వీనర్‌గా, కలెక్టర్‌ చైర్మన్‌గా, అర్బన్‌లో మున్సిపల్‌ కమిషనర్‌, రూరల్‌లో జడ్పీ సీఈవో సభ్యులుగా కమిటీలను ఏర్పాటు చేసేవారు. ప్రాంతాన్ని బట్టి వారే వ్యవసాయ భూములు, ప్లాట్ల విలువను మదింపు చేసేవారు. జిల్లాకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి కలెక్టర్‌ పంపేవారు. కానీ, అలాంటి ఏర్పాటు ఏదీ లేకుండానే రాష్ట్రస్థాయిలోనే అధికారులు మార్కెట్‌ విలువలను సవరించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఎడాపెడా వసూళ్లు

ప్రభుత్వం ఓ పక్క స్థిరాస్తుల మార్కెట్‌ విలువను పెంచుకుంటూ పోతుండగా, మరోపక్క రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో ఎడాపెడా వసూళ్లు కొనసాగుతున్నాయి. అన్ని చార్జీలు గణనీయంగా పెరిగాయి. స్థిరాస్థి కొనుగోలుదారుడికి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేసుకోవడానికి రిజిస్ట్రేషన్‌ రుసుంతోపాటు సర్వీస్‌ చార్జీల చెల్లింపుతో జేబుగుల్లవుతోంది. ఒకప్పుడు ఎంకబర్స్‌మెంట్‌ సర్టిఫికెట్‌ (ఈసీ) రుసుము రూ.16 ఉండేది. అది ఇప్పుడు రూ.250 పెరిగింది. ఇది వరకు గంటలో ఇచ్చేవారు. ప్రస్తుతం రెండు మూడు రోజులు పడుతోంది. సర్వీస్‌ చార్జీల పేరుతో ఎడాపెడా పిండుకుంటున్నారు. గతంలో రిజిస్ట్రేషన్‌ చార్జీలు 6 శాతం ఉండేది. ప్రస్తుతం స్టాంప్‌డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ చార్జీ, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ, యూజర్‌ చార్జీలు కలుపుకొని 7.5 శాతం వసూలు చేస్తున్నారు. మ్యూటేషన్‌ చార్జీ అదనం. రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో ఇటీవల కాలం ప్రతీ సర్వీ్‌సకు వసూలు చేసే చార్జీలు 100 నుంచి 200 శాతం పెరిగాయి. ఇవన్నీపోను ముడుపులు ఇస్తేగానీ పనికాదు. అడుగడుగునా లంచాలే. సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు అవినీతి కేంద్రాలుగా మారాయి. ఇటీవల పలువురు సబ్‌రిజిస్టార్లు అవినీతి కేసుల్లో సస్పెండ్‌  అయిన సంగతీ తెలిసిందే.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.