బాదుడే.. బాదుడు...

ABN , First Publish Date - 2022-04-18T05:12:48+05:30 IST

కొత్త జిల్లా వచ్చిందనే సంబరం ఇంకా తొలగిపోకముందే.. రాష్ట్ర ప్రభుత్వం రాయచోటి వాసులకు గట్టి షాక్‌ ఇచ్చింది.

బాదుడే.. బాదుడు...
రాయచోటి సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయం

రిజిస్ర్టేషన్‌ చార్జీల భారం

రెండింతల నుంచి మూడింతలు పెంపు

పేదలకు సొంతిళ్లు కలేనా..?


(రాయచోటి - ఆంధ్రజ్యోతి) :

కొత్త జిల్లా వచ్చిందనే సంబరం ఇంకా తొలగిపోకముందే.. రాష్ట్ర ప్రభుత్వం రాయచోటి వాసులకు గట్టి షాక్‌ ఇచ్చింది. భూముల కొనుగోళ్లు, అమ్మకాలకు సంబంధించి రిజిస్ర్టేషన్‌ చార్జీలు ఇప్పటి వరకు ఉన్న దాని కంటే... ఒకసారిగా రెండింతల నుంచి మూడింతల వరకు భూమి మార్కెట్‌ విలువను బట్టి పెంచేశారు. సాధారణంగా గతంలో ప్రతి ఏటా భూముల విలువ.. గతం కంటే.. పది శాతం వరకు పెరిగేది.. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలకు అధికారం రాష్ట్ర ప్రభుత్వం కట్టబెట్టేది. అయితే కొత్తగా రాయచోటి జిల్లా కేంద్రం కావడంతో.. ఇక్కడ భూముల కొనుగోళ్లు, అమ్మకాలు జోరుగా సాగాయి. కడప, ప్రొద్దుటూరు, పులివెందుల, కదిరి, మదనపల్లె, పీలేరు, తిరుపతి  బెంగుళూరు వంటి ప్రాంతాల నుంచి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు రాయచోటిలో వాలిపోయారు. ఎకరాలకు ఎకరాలు కోట్ల రూపాయలు పెట్టి భూములు కొన్నారు. జిల్లా కేంద్రం ప్రకటించిన తర్వాత.. రిజిస్ర్టేషన్లు, అగ్రిమెంట్లతో సుమారు రెండు నెలల పాటు.. రిజిస్ర్టేషన్‌ కార్యాలయం కళకళలాడింది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం గతానికి భిన్నంగా.. కేవలం ఆదాయం పెంచుకునే ఆలోచనతో.. స్థానికంగా భూమలకు ఉన్న మార్కెట్‌ విలువను బట్టి.. రిజిస్ర్టేషన్‌ చార్జీలు పెంచుకునే అధికారాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని సబ్‌ రిజిస్ర్టార్‌లకు ఇచ్చింది. ఈ నేపధ్యంలో రాయచోటితో పాటు.. రాయచోటి మునిసిపాలిటీని ఆనుకుని ఉన్న మాసాపేట, దిగువ అబ్బవరం, కస్పాగొల్లపల్లె, చెన్నముక్కపల్లె గ్రామాలలో కూడా భూముల విలువను బట్టి రిజిస్ర్టేషన్‌ చార్జీలను పెంచింది. పెంచిన విలువ రెండింతల నుంచి మూడింతల వరకు ఉండడం విశేషం.  గతంలో చదరపు గజం రూ.2200గా ఉండేది.. ప్రస్తుతం రూ.7300గా పెంచారు. ఇంకా కొన్ని ప్రాంతాలలో ప్రస్తుతం చదరపు గజం రూ.5270గా ఉండేది.. ప్రస్తుతం రూ.10,300గా పెంచారు. 


పేదలపై పెనుభారం

రాష్ట్ర ప్రభుత్వం పెంచిన రిజిస్ర్టేషన్‌ చార్జీల వల్ల పేదలపై పెనుభారం పడనుంది. ఇప్పటికే కొంతమంది రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్ల మాయాజాలం వల్ల.. రాయచోటి పట్టణం, చుట్టుపక్కల సరం రూ.4 లక్షలకు తక్కువకు అందుబాటులో లేదు. ఐదు సరాల (30 అడుగులు వెడల్పు, 50 అడుగులు పొడవు) స్థలం కొనాలంటే.... ఎంత తక్కువ అనుకున్నా.. రూ.20 లక్షలు పెట్టాల్సిందే. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్‌ విలువను బట్టి రిజిస్ర్టేషన్‌ చార్జీలు పెంచితే.. పేదలపై పెనుభారం పడుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కేవలం ఆదాయ మార్గమే ధ్యేయంగా కాకుండా.. పేదలను దృష్టిలో ఉంచుకుని పెంచిన రిజిస్ర్టేషన్‌ చార్జీలను తగ్గించాలని పలువురు కోరుతున్నారు. 


రెండు, మూడింతలు పెరిగింది

- పురం రెడ్డెయ్య, కొత్తపేట రామాపురం

గతంలో ఉన్న రిజిస్ర్టేషన్‌ చార్జీలతో పోల్చుకుంటే.. ఇప్పుడు రెండింతలు, మూడింతలు పెరిగింది. దీనివల్ల పేదలకు చాలా భారమవుతుంది. మార్కెట్‌ విలువ ప్రకారం కాకుండా.. గతంలో మాదిరే రిజిస్ర్టేషన్‌ చార్జీలు పెంచాలి. గతంలో ఐదు సరాల ప్లాటు ఒకటి రిజిస్ట్రేషన్‌ చేయడానికి సుమారు రూ.27 వేలు ప్రభుత్వ చలానా కట్టాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు అది రూ.70 వేలకు పెరిగింది. 

Updated Date - 2022-04-18T05:12:48+05:30 IST