ఉత్తుత్తి వ్యాక్సినేషన్‌!

ABN , First Publish Date - 2022-01-25T08:00:13+05:30 IST

‘‘రాష్ట్రంలో కోట్ల మందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసేశాం. టీకా ప్రక్రియలో మనమే టాప్‌...’’ అంటూ ఆరోగ్యశాఖ అధికారులు ఊదరగొడుతున్నారు.

ఉత్తుత్తి వ్యాక్సినేషన్‌!

  • టీకాలు వేయకుండానే కొవిన్‌లో నమోదు 
  • తప్పు లెక్కలతో మాయ చేస్తున్న సిబ్బంది
  • తమకు టీకా వేయలేదన్న 29 శాతం మంది
  • ఆరోగ్యశాఖ ఐవీఆర్‌ఎస్‌ సర్వేతో వెలుగులోకి 
  • తూర్పులో 36 శాతం తప్పుడు వ్యాక్సినేషన్‌ 
  • ప్రకాశం, విశాఖ, కర్నూలు, నెల్లూరుల్లోనూ 
  • 30 శాతానికి పైగా ఫేక్‌ ఉన్నట్లు గుర్తింపు 
  • ఈ వ్యవహారంపై సమాధానం చెప్పండి 
  • జిల్లా అధికారులకు ఆరోగ్యశాఖ మెమోలు


(అమరావతి-ఆంధ్రజ్యోతి) : ‘‘రాష్ట్రంలో కోట్ల మందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసేశాం. టీకా ప్రక్రియలో మనమే టాప్‌...’’ అంటూ ఆరోగ్యశాఖ అధికారులు ఊదరగొడుతున్నారు. అయితే అదంతా ఉత్తుత్తి ప్రచారమేనని తేలిపోయింది. అధికారుల మాటలు కోటలు దాటుతున్నా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే అసలు గుట్టు బయటపడింది. తప్పుడు లెక్కలతో సిబ్బంది మాయ చేస్తున్నట్లు తేటతెల్లమైంది. లబ్ధిదారులకు అసలు వ్యాక్సినే వేయకపోయినా కొవిన్‌ వెబ్‌సైట్‌లో మాత్రం డోసు లు వేసినట్లుగా నమోదు చేసేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తం గా దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఈ విధంగా మాయ చేసినట్లు ఆరోగ్యశాఖ చేపట్టిన ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో వెలుగు చూసింది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికం గా ఫేక్‌ వ్యాక్సినేషన్‌ జరిగినట్లు తేల్చారు. ప్రకాశం, విశాఖ, కర్నూలు, నెల్లూరు జిల్లాలు సైతం ఇదే బాట లో ఉన్నాయని గుర్తించడం చర్చనీయాంశంగా మారిం ది. రాష్ట్రంలో కొవిడ్‌ టీకా వేయకుండానే కొవిన్‌లో నమోదు చేస్తున్నారంటూ ‘ఆంధ్రజ్యోతి’ కథనాలు ప్రచురించింది. వాటిపై స్పందించిన ఆరోగ్యశాఖ అధికారులు వాస్తవాలను తేల్చేందుకు ఐవీఆర్‌ఎస్‌ సర్వే చేపట్టారు. రెండు నెలలుగా ఇదే పనిలో ఉన్నా సర్వే వివరాలను గోప్యంగా ఉంచారు. అయితే ఐవీఆర్‌ఎస్‌ సర్వే లో గుర్తించిన కొన్ని కీలకమైన అంశాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ పూర్తయిన 5లక్షల మంది లబ్ధిదారులను సర్వే కోసం ఎంపిక చేశారు. వారిలో దాదాపు 12వేల మందికి ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయం నుంచి నేరుగా ఫోన్లు చేశారు. అందులో 71శాతం మంది తమకు టీకా వేసినట్లు చెప్పగా, మరో 29శాతం మంది తమకు అసలు వ్యాక్సినేషన్‌ జరగలేదని చెప్పారు. ఇలాంటి వారందరికీ టీకా డోసులు వేయకుండానే కొవిన్‌లో నమోదు చేసిన ట్లు వెల్లడైంది. తూర్పుగోదావరిలో అత్యధికంగా 36ు, ప్రకాశంలో 35ు, విశాఖలో 34ు, కర్నూలులో 32ు, నెల్లూరులో 30ు, కృష్ణాలో 17ు, పశ్చిమగోదావరిలో 20ు, కడపలో 21% చొప్పున ఫేక్‌ వ్యాక్సినేషన్‌ మూ లాలు వెలుగులోకి వచ్చాయి. ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో బయటపడిన లెక్కలే ఇలా ఉంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఫోన్‌ చేస్తే ఈ శాతాలు మరింత పెరిగే అవకాశం ఉంది. 


ఒత్తిడే కారణమా...

ప్రతి పీహెచ్‌సీకి రోజుకు 200 నుంచి 300 డోస్‌ల వ్యాక్సిన్‌ పంపించేవారు. ఆ రోజు ఆ డోసులన్నీ పూర్తి చేయాల్సిందే. ఈ టార్గెట్‌ పూర్తి చేయడానికి మెడికల్‌ ఆఫీసర్‌ నుంచి ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు అనేక ఇబ్బందులు పడేవారు. జనం వద్దన్నా సూది గుచ్చేసేవారు. రేషన్‌ కార్డులు ఆపేస్తామని భయపెట్టి మరీ కొన్నిచోట్ల వ్యాక్సిన్లు వేశారు. అప్పటికీ డోస్‌లు మిగిలిపోవడంతో లబ్ధిదారులు లేకపోయినా కొవిన్‌లో నమోదు చేసేవా రు. ఇదిలాఉండగా, ఫేక్‌ వ్యాక్సినేషన్‌ ఎక్కువగా జరిగి న జిల్లాల్లో వ్యాక్సినేషన్‌ అధికారులకు ఆరోగ్యశాఖ మెమోలు ఇచ్చింది. 

Updated Date - 2022-01-25T08:00:13+05:30 IST