53 శాతమే!

ABN , First Publish Date - 2021-04-10T05:47:43+05:30 IST

వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా నమోదు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ప్రకృతి విపత్తుల సమయంలో రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. కానీ క్షేత్రస్థాయిలో వ్యవసాయశాఖ సిబ్బంది అలసత్వం, సాంకేతిక సమస్యలు, రైతుల్లో అవగాహన లోపం కారణంగా ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. ఈ నెల 15లోగా రైతులు పంట బీమా నమోదు చేసుకోవాల్సి ఉంది. కానీ ఇప్పటివరకూ కేవలం 53 శాతం మంది రైతుల బయోమెట్రిక్‌ మాత్రమే పూర్తయింది.

53 శాతమే!
టెక్కలి మండలం నర్శింగపల్లిలో రైతులతో బయోమెట్రిక్‌ వేయిస్తున్న దృశ్యం.

నత్తనడకన వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా నమోదు

మరో ఐదు రోజులు మాత్రమే గడువు

వెంటాడుతున్న బయోమెట్రిక్‌ సమస్యలు 

(టెక్కలి)

వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా నమోదు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ప్రకృతి విపత్తుల సమయంలో రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. కానీ క్షేత్రస్థాయిలో వ్యవసాయశాఖ సిబ్బంది అలసత్వం, సాంకేతిక సమస్యలు, రైతుల్లో అవగాహన లోపం కారణంగా ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది.  ఈ నెల 15లోగా రైతులు పంట బీమా నమోదు చేసుకోవాల్సి ఉంది. కానీ ఇప్పటివరకూ కేవలం 53 శాతం మంది రైతుల బయోమెట్రిక్‌ మాత్రమే పూర్తయింది. ఇంకా ఐదురోజులు మాత్రమే గడువు ఉండడంతో సకాలంలో ప్రక్రియ పూర్తయ్యే సూచనలు కనిపించడం లేదు.  వైఎస్సార్‌ పంటల బీమా కింద రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు రూ.580 చొప్పున ఆంధ్రప్రదేశ్‌ అగ్రికల్చరల్‌ ఇన్స్యూరెన్స్‌ కంపెనీకి రూ.1,300 కోట్లు చెల్లించనుంది. గతంలో బ్యాంకుల్లో రుణం పొందినవారు మాత్రమే పంటల బీమాకు అర్హులుగా ఉండేవారు. ఈసారి ఇ-క్రాప్‌ బుకింగ్‌లో నమోదై వైఎస్సార్‌ ఉచిత పంటల బీమాలో బయోమెట్రిక్‌ అయితే చాలు.. పంటల బీమా వర్తిస్తుంది. రైతు, లేదా కౌలుదారుడు, సాగుదారుడు అయినా వారికి కూడా ఇన్స్యూరెన్స్‌ వర్తింపజేసేలా రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది అక్టోబరులో జీవో జారీ చేసింది. ఏప్రిల్‌ 15లోగా రైతుల బయోమెట్రిక్‌ (వేలిముద్రల సేకరణ) ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. జిల్లాలో గత ఖరీఫ్‌నకు సంబంధించి 4.80 లక్షల ఎకరాల్లో వరి, రాగులు, వేరుశెనగ ఇతర పంటలు సాగు చేశారు. 3,56,919 లక్షల మంది రైతుల వివరాలను ఈక్రాప్‌లో నమోదు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రైతులంతా తమ ఆధార్‌ నెంబర్‌కు బయోమెట్రిక్‌ చేయాల్సి ఉంది. ఇప్పటివరకూ 1,68,306 మంది రైతులకు  సంబంధించి బయోమెట్రిక్‌ను మాత్రమే గ్రామీణ వ్యవసాయ సహాయకులు పూర్తిచేశారు. మరో 1,88,613 మంది రైతుల బయోమెట్రిక్‌ ప్రక్రియ ఈ నెల 15 నాటికి పూర్తిచేయాల్సి ఉంది. జిల్లాలో వీరఘట్టం, సంతకవిటి, సంతబొమ్మాళి, ఇచ్ఛాపురం, బూర్జ, వజ్రపుకొత్తూరు మండలాల్లో మాత్రమే 60 శాతం మేర పంట బీమా నమోదు పూర్తయింది.  పాతపట్నం, కవిటి, కంచిలి, కోటబొమ్మాళి, శ్రీకాకుళం, గార, లావేరు, రణస్థలం తదితర మండలాల్లో 40శాతం లోపే నమోదు సాగింది. జిల్లావ్యాప్తంగా సగటున 53శాతం ప్రక్రియ మాత్రమే పూర్తయింది. సాంకేతిక సమస్యల కారణంగా నత్తనడకన ప్రక్రియ సాగుతోంది. రైతుల బయోమెట్రిక్‌ అథంటికేషన్‌లో ఎర్రర్‌ చూపించడం, సర్వర్‌ సమస్యలు, సిగ్నల్‌ సమస్యలతో వీఏఏలు తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు రైతులు కూడా గంటల తరబడి నిరీక్షించి ఇబ్బందులు పడుతున్నారు. సాంకేతిక సమస్యల నడుమ సకాలంలో ఈ ప్రక్రియ పూర్తవుతుందో లేదోనని అధికారులు, రైతులు ఆందోళన చెందుతున్నారు. 


గడువులోగా పూర్తిచేస్తాం

వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా నమోదు ప్రక్రియ గడువులోగా పూర్తిచేస్తాం. దీనిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. సాగుదారులు, రైతులు, వారి కుటుంబ సభ్యులు రాష్ట్రంలో ఏ ప్రాంతంలో అయినా బయోమెట్రిక్‌ ద్వారా అథంటికేషన్‌ వేసుకోవచ్చు. 

- బీవీ తిరుమలరావు, వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు

Updated Date - 2021-04-10T05:47:43+05:30 IST